అమరావతికి వ్యతిరేకం కాదు : జోగి రమేష్‌

27 Sep, 2022 05:45 IST|Sakshi
జ్యోతిప్రజ్వలన చేసి వైఎస్సార్‌ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మంత్రి రమేష్‌

పెడన: రాజధాని అమరావతికి తాము వ్యతిరేకం కాదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ అన్నారు. మూడు రాజధానుల్లో అమరావతి కూడా ఒకటిగా ఉంటుందని ఆయన చెప్పారు. ఒకేచోట రూ.3 లక్షల కోట్లు ఖర్చుచేస్తే ఒక ప్రాంతమే అభివృద్ధి చెందుతుందనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని సూచించారు. కృష్ణా జిల్లా పెడన మార్కెట్‌ యార్డు ప్రాంగణంలో సోమవారం వైఎస్సార్‌ చేయూత పథకం లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ముఖ్య అతిథిగా మంత్రి జోగి రమేష్‌ పాల్గొని పెడన మండలంలోని 2,121 మంది లబ్ధిదారులకు రూ.3,97,68,750 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తన కుటుంబం, బంధువులు, సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే అభివృద్ధి చెందాలనే విధంగా అమరావతిని ఏకైక రాజధాని చేయాలని కంకణం కట్టుకుని అమరావతి–అరసవల్లి పాదయాత్రకు వ్యూహరచన చేశారని దుయ్యబట్టారు.

రైతుల పేరుతో చేస్తున్న ఈ పాదయాత్ర చంద్రబాబుకు ఏటీఎంగా మారిందన్నారు. అమరావతి కావాలా.. లేక చేయూత కావాలా.., అమరావతి కావాలా... లేక ఆసరా కావాలా.. అని మంత్రి ప్రశ్నించడంతో తమకు ఆసరా కావాలి.. చేయూత కావాలంటూ మహిళలు నినదించారు. 

మరిన్ని వార్తలు