Sakshi News home page

‘వెంటిలేటర్‌పై టీడీపీ.. వల్లకాడుకు వెళ్లడం ఖాయం’

Published Sat, Nov 19 2022 5:54 PM

Jogi ramesh Serious Comments on Chandrababu naidu at Tadepalli - Sakshi

సాక్షి, తాడేపల్లి: కుట్రలు, కుతంత్రాలు ఇక చాలంటూ 2019లోనే జనం చంద్రబాబుకు బుద్ధి చెప్పారని మంత్రి జోగి రమేష్‌ అన్నారు. రాష్ట్రం విడిపోయాక ఏపీని అభివృద్ధి చేయలేదని, అందుకే బాబును జనం తరిమి తరిమి కొట్టారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ నాదీ, నేనే పెట్టానని ధైర్యంగా చెప్పే పరిస్థితి కూడా చంద్రబాబుకు లేదని విమర్శించారు. బాబు సామాజిక వర్గమే అభివృద్ధి చెందాలనుకోవడం తప్పని దుయ్యబట్టారు. నోరు పారేసుకుని విర్రవీగే వారందరికీ జనం‌ తగిన బుద్ది చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. 

వికేంద్రీకరణ జరగాలని రాయలసీమ వాసులు కోరుకుంటున్నారని, అందుకే వారంతా మూడు రాజధానులకు మద్దతుగా ప్లకార్డులు పట్టుకున్నారని మంత్రి జోగి రమేష్‌ తెలిపారు. దీనిని తట్టుకోలేక ప్రస్టేషన్‌లోకి వెళ్లిన చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని.. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏమి చేయలేదని అని దుయ్యబట్టారు.

ఎన్టీఆర్‌ను నరకయాతన పెట్టి పార్టీని చంద్రబాబు లాక్కున్నాడు. అలాంటి వ్యక్తికి ధీరుడైన సీఎం జగన్‌ గురించి మాట్లాడే అర్హత ఉందా?. సొంతంగా పార్టీని పెట్టి, 151 సీట్లతో అధికారంలోకి వచ్చారు వైఎస్‌ జగన్‌. ఎంగిలి మెతుకులకు ఆవేశ పడే వ్యక్తి చంద్రబాబు. ఆయన జీవితమే బతుకుల బొంత. ఇతర పార్టీల పొత్తుల కోసం పాకులాడే వ్యక్తి. ఎన్ని పొర్లు దండాలు పెట్టినా వైఎస్సార్‌సీపీని ఇంచు కూడా కదిలించలేరు. స్థానిక ఎన్నికలలో కుప్పం ప్రజలే చంద్రబాబుని ఘోరంగా ఓడించారు. కనీసం గుక్కెడు మంచినీరు కూడా కుప్పం ప్రజలకు ఇవ్వని వ్యక్తి చంద్రబాబు. 

బీసీలంటే చంద్రబాబుకు కడుపుమంట. సీఎం జగన్ నాయకత్వంలో మా బీసీలంతా తల ఎత్తుకుని తిరుగుతున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సీఎం ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబు కోర్టుకు వెళ్లి అడ్డుకుంటున్నారు. అలాంటి వ్యక్తి ప్రజలకు ఇప్పుడు ఏదో మేలు చేస్తానంటూ మాట్లాడితే ఎలా నమ్ముతారు?. పవన్ సైకో బ్యాచ్ పెట్రోలు పోసి ఫ్లెక్సీలు, కటౌట్లు తగుల పెడుతున్నారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం ఎలా జరుగుతుందో నేనే స్వయంగా పరిశీలించా. పవన్‌ కల్యాణ్‌ను రమ్మంటే రాలేదు. తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్‌పై ఉంది. ఎన్నికల తర్వాత వల్లకాడుకు వెళ్లటం ఖాయం’ అని మంత్రి నిప్పులు చెరిగారు.

Advertisement

What’s your opinion

Advertisement