Kamareddy : కామారెడ్డి చరిత్ర ఘనం.. ఘాటు రాజకీయం | Sakshi
Sakshi News home page

Kamareddy : కామారెడ్డి చరిత్ర ఘనం.. ఘాటు రాజకీయం

Published Thu, Jul 27 2023 4:13 PM

Kamareddy Assembly Constituency History - Sakshi

కామారెడ్డి నియోజకవర్గం

కామారెడ్డి నియోజకవర్గం..  ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షిస్తోంది. ఎందుకంటే బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కామారెడ్డిని రెండో నియోజకవర్గంగా ఎంచుకుని పోటీ చేయబోతున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ రేసులో ఉంటానని ప్రకటించారు. 

ఇక్కడి నుంచి 2018లో టీఆర్‌ఎస్‌(బీఆర్‌ఎస్‌) పక్షాన గంపా గోవర్దన్‌, కాంగ్రెస్‌ తరపున సీనియర్‌ నేత, మాజీ మంత్రి, శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన షబ్బీర్‌ అలీ పోటీ పడగా, గోవర్దన్‌ నే విజయం వరించింది. గోవర్దన్‌ 4557 ఓట్ల తేడాతో విజయం సాదించగలిగారు. గోవర్దన్‌ కు 68162 ఓట్లు రాగా, షబ్బీర్‌ అలీకి 63610 ఓట్లు వచ్చాయి. గోవర్దన్‌ బిసిలలోని పెరిక సామాజికవర్గానికి చెందినవారు.గతంలో ఈయన టిడిపిలో ఉండేవారు.తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి టిఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి వరసగా గెలుస్తున్నారు. అయితే ఈసారి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ స్వయంగా ఇక్కడి నుంచి బరిలోకి దిగనున్నారు. దీంతో జిల్లా రాజకీయం ఒక్కసారిగా ఆసక్తికరంగా మారింది. 

గతంలో..
టీడీపీ పక్షాన రెండుసార్లు, టిఆర్‌ఎస్‌ తరపున మూడుసార్లు గెలిచారు. కాగా కామారెడ్డిలో బీజేపీ పక్షాన పోటీచేసిన కె.వెంకటరమణారెడ్డికి పదిహేనువేలకు పైగా ఓట్లు వచ్చాయి. గంపా గోవర్దన్‌ రెండువేల తొమ్మిదిలో టిడిపి పక్షాన గెలిచినా, ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసి ,టిఆర్‌ఎస్‌ లో చేరి తిరిగి ఉప ఎన్నికలో విజయం సాధించారు. కామారెడ్డిలో నాలుగుసార్లు రెడ్డి నేతలు,తొమ్మిదిసార్లు బిసిలు, రెండుసార్లు ఎస్‌.సిలు గెలవగా, మూడుసార్లు ముస్లింలు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. కామారెడ్డి కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ ఐలు కలిసి ఏడుసార్లు, టిడిపి ఐదుసార్లు టిఆర్‌ఎస్‌ మూడుసార్లు గెలుపొందగా, ఒకసారి ఇండిపెండెంటు నెగ్గారు. టి.ఎన్‌. సదాలక్ష్మి ఇక్కడ ఒకసారి,ఎల్లారెడ్డిలో మరోసారి గెలిచారు.

సదాలక్ష్మి గతంలో నీలం, కాసు మంత్రివర్గాలలో పనిచేస్తే, షబ్బీర్‌ అలీ 1990లో చెన్నారెడ్డి, 1993లో కోట్ల విజయభాస్కరరెడ్డి, 2004 నుంచి ఐదేళ్లపాటు వ్కె.ఎస్‌.రాజశేఖరరెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్నారు.తదుపరి ఒకసారి ఎమ్మెల్సీ అయి శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా కూడా షబ్బీర్‌ ఉన్నారు. 1952లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌ అభ్యర్ధి రామారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1999లో టిడిపి తరుఫున గెలిచిన యూసఫ్‌ అలీ విప్‌గా కొంతకాలం బాధ్యతలు నిర్వహించారు. గంపా గోవర్దన్‌ కూడా విప్‌ అయ్యారు.

కామారెడ్డిలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

Advertisement

తప్పక చదవండి

Advertisement