Karnataka Assembly Chaos Over Five Election Promise Implementation - Sakshi
Sakshi News home page

నెల దాటింది.. ఆ ఐదింటి అమలేదీ?.. అసెంబ్లీలో రగడ.. ప్రతిపక్షంపై సీఎం సిద్ధూ ఫైర్‌

Published Tue, Jul 4 2023 2:43 PM

Karnataka assembly chaos Over Five Election Promise Implementation - Sakshi

బెంగళూరు: బీజేపీ ఆందోళనలతో మంగళవారం కర్ణాటక విధానసభ వర్షాకాల సమావేశాలు హీటెక్కాయి. ఐదు ఎన్నికల హామీల అమలును  అధికార కాంగ్రెస్‌ పూర్తిగా పక్కనపెట్టేసిందని విమర్శిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు హౌజ్‌వెల్‌లోకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో సీఎం సిద్ధరామయ్య వర్సెస్‌ బీజేపీ ఎమ్మెల్యేల వాగ్వాదం.. కాంగ్రెస్‌ వ్యతిరేక నినాదాలతో గందరగోళం ఏర్పడి సభ కార్యకలాపాలకు అవాంతరం ఏర్పడింది. 

బీజేపీ సీనియర్‌, మాజీ సీఎం బీఎస్‌ యడ్యూరప్ప విధాన సౌధలో మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏదో చేస్తామని చెప్పి.. ఏం చేయకుండా ఉండిపోయిందని మండిపడ్డారాయన. నెల దాటినా ఎన్నికల హామీల అమలులో జాప్యం దేనికని సూటిగా ప్రశ్నించారు. తామేమీ కొత్తగా ఏదైనా చేయాలని అడగడం లేదని.. కేవలం ఇచ్చిన హామీలను నెరవేర్చమని మాత్రమే అడుగుతున్నామని చెప్పారాయన. వారం వేచిచూస్తామని..  తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. 

ఈ తరుణంలో సీఎం సిద్ధరామయ్య జోక్యంతో సభ ఒక్కసారిగా వేడెక్కింది. బీజేపీ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా వెల్‌లోకి దూసుకెళ్లి కాంగ్రెస్‌ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ‘మోసం.. మోసం.. కాంగ్రెస్‌ మోసం’ అంటూ నినాదాలు చేశారు ఎమ్మెల్యేలు. అయితే స్పీకర్‌ మాత్రం వాళ్ల నిరసనను రికార్డుల్లోకి ఎక్కించడం లేదని స్పష్టం చేశారు.  

ఇదిలా ఉంటే.. అసెంబ్లీలో బీజేపీ నిరసనలపై కర్ణాటక మంత్రి పరమేశ్వర స్పందించారు. ఇచ్చిన హామీల్లో ఇప్పటికే మూడు అమలు చేస్తున్న విషయం గుర్తించాలని బీజేపీకి ఆయన హితవు పలికారు. ఐదు హామీలను ఒక్కోటిగా చేసుకుంటూ పోతున్నామని, ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోయే క్రమంలో ఆలస్యం కావడం సహజమని వ్యాఖ్యానించారాయన.

ఇదీ చదవండి: ఆ డిప్యూటీ సీఎం అవినీతిపరుడు.. తొలగించండి

Advertisement
Advertisement