Medak Lok Sabha: మెదక్‌ నుంచి కేసీఆరే! | Sakshi
Sakshi News home page

Medak Lok Sabha: మెదక్‌ నుంచి కేసీఆరే!

Published Thu, Mar 21 2024 10:37 AM

Kcr Contest To Medak Lok Sabha seat - Sakshi

గులాబీ దళపతి వ్యూహాత్మక అడుగులు

కాంగ్రెస్‌ అభ్యర్థి తేలాకే ప్రకటించే యోచనలో బీఆర్‌ఎస్‌

మరోవైపు వంటేరు ఖరారైనట్లుజోరుగా ప్రచారం

అధికార, ప్రతిపక్షం అభ్యర్థుల ఎంపికలో వీడని ఉత్కంఠ

గులాబీ దళపతి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మెదక్‌ ఎంపీ స్థానం నుంచి బరిలో దిగనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే శ్రేణులను కార్యోన్ముఖులను చేసేలా రంగం సిద్ధమైనట్లు సమాచారం. మరో వైపు వంటేరు ప్రతాప్‌ రెడ్డికి బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఖరారైనట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి తేలిన తరువాతే బరిలో ఎవరుంటారన్నది తేలనుందని బీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో జహీరాబాద్‌, మెదక్‌ లోక్‌సభ స్థానాలున్నాయి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలు జహీరాబాద్‌ స్థానానికి అభ్యర్థులను ప్రకటించాయి. కానీ మెదక్‌ కు వచ్చేసరికి బీజేపీ మాత్రమే అభ్యర్థిని ప్రకటించింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు మాత్రం తమ అభ్యర్థులెవరో ఇంకా ప్రకటించకపోవడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు ఎప్పుడు తెరపడనుందో వేచిచూడాల్సిందే మరి..  

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : మెదక్‌ లోక్‌సభ అభ్యర్థిత్వం విషయంలో గులాబీ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని జహీరాబాద్‌ టికెట్‌ను ప్రకటించినప్పటికీ, మెదక్‌ విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ టికెట్‌ను వంటేరు ప్రతాప్‌రెడ్డికి ఇవ్వాలని అధినేత కేసీఆర్‌ పక్షం రోజుల క్రితమే నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇంకా అధికారికంగా ప్రకటించడం లేదు. కాంగ్రెస్‌ అభ్యర్థిత్వం తేలిన తర్వాత ఇక్కడి అభ్యర్థిని ప్రకటించే అవకాశాలున్నాయని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ టికెట్‌పై ఉత్కంఠ అలాగే కొనసాగుతోంది. కాగా ఈ టికెట్‌ కోసం మరో ఇద్దరు ముఖ్యనాయకులు పోటీ పడుతున్నారు. మరికొంత మంది కూడా ఆశిస్తున్నారు. ముఖ్యంగా నర్సాపూర్‌ మాజీ ఎమ్మెల్యే చిలువుల మదన్‌రెడ్డి రేసులో ఉన్నారు.

కొన్ని నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్‌ టికెట్‌ను సునీతారెడ్డికి ఖరారు చేసిన సందర్భంగా ఆయనకు ఎంపీ టికెట్‌ ఇస్తామని బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం హామీ కూడా ఇచ్చింది. అలాగే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన గాలి అనిల్‌కు కూడా ఎంపీ టికెట్‌ ఇస్తామనే హామీ ఇచ్చారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు జహీరాబాద్‌ టికెట్‌ ఖరారు చేశారు.

మరోవైపు తమకే కేటాయించాలని సంగారెడ్డికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు బీరయ్యయాదవ్‌, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్‌లో చేరిన కంఠారెడ్డి తిరుపతిరెడ్డి కూడా అధినాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అధినేత కేసీఆర్‌ మాత్రం వంటేరు ప్రతాప్‌రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వంటేరును లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పని చేసుకోమన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ అధికారికంగా మాత్రం ప్రకటించకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే కాంగ్రెస్‌ అభ్య ర్థిత్వం ఒకటీ రెండు రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయి. బీజేపీ మాత్రం వారం రోజుల క్రితమే ప్రకటించింది. ఈ టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు కేటాయించింది. ఆయన నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు.

అధినేతే బరిలోకి దిగుతారనే ప్రచారం?
ఈ మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి స్వయంగా అధినేత కేసీఆరే బరిలోకి దిగే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం కూడా షురూ అయింది. అందుకోసమే ఈ అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన రాలేదనే టాక్‌ జోరందుకుంటోంది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ గెలుచుకునే సీట్లలో మెదక్‌ సీటు ముందుంటుందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఏడు ఎమ్మెల్యే స్థానాల్లో ఆరు చోట్ల బీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. ఒక్క మెదక్‌ అసెంబ్లీ స్థానం మాత్రం కాంగ్రెస్‌ గెలిచింది. ఈ ఎన్నికల్లో కూడా కారు జోరందుకునే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ టికెట్‌ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో నెలకొంది.

Advertisement
Advertisement