కేసీఆర్‌ కుటుంబం 10వేల ఎకరాలు కబ్జా చేసింది  | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ కుటుంబం 10వేల ఎకరాలు కబ్జా చేసింది 

Published Sat, Aug 5 2023 3:18 AM

KCR family has occupied 10 thousand acres - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌ కుటుంబం దోపిడీ చేస్తోందని, హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న 10 వేల ఎకరాలను కేసీఆర్‌ కుటుంబం కబ్జా చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్‌రెడ్డి ఆరోపించారు. లక్ష కోట్ల రూపాయలు వెనుకేసుకున్న తర్వాత కేసీఆర్‌కు తెలంగాణపై మోజు తీరిందని వ్యాఖ్యానించారు.

శుక్రవారం రాత్రి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లుతో పాటు పెద్దపల్లి, సుల్తానాబాద్‌ ప్రాంతాలకు చెందిన పలువురు ముఖ్యనేతలు, సర్పంచ్‌లు కాంగ్రెస్‌ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం చచ్చిపోయిందా? మున్సిపల్‌ మంత్రి వరదల్లో కొట్టుకుపోయారా? రాష్ట్రంలో మంత్రులు లేరా అని ప్రశ్నించారు.

వరద సహాయక చర్యలపై శాసనసభలో కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ప్రశ్నిస్తుంటే మంత్రులు అడ్డుకుంటున్నారని చెప్పారు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుని ఉంటే సీతక్కలాంటి ఎమ్మెల్యేలు కన్నీరు పెట్టాల్సి వచ్చేది కాదని, వరదబాధిత ప్రాంతాల్లో తిరగాల్సిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రౌడీల్లా వీధుల్లో తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌కు తెలంగాణపై మోజు తీరినందునే వరద ప్రాంతాల్లో పర్యటించకుండా మహారాష్ట్రకు వెళ్లాడని, అక్కడ పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ తెలంగాణ రైతులపై లేదని విమర్శించారు.  

కేసీఆర్‌ బ్రహ్మరాక్షసుడు 
రానున్న ఎన్నికల్లో జరిగే ధర్మయుద్ధంలో కాంగ్రెస్‌ పార్టీ దే విజయమని రేవంత్‌ వ్యాఖ్యానించారు. ‘రాక్షసులందరినీ పుట్టించిన బ్రహ్మ రాక్షసుడు కేసీఆర్‌. ఆ బ్రహ్మరాక్షసుడికి మందు పెట్టి బొంద పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజల్లో ఉండి ప్రజలకోసం మేం కొట్లాడుతున్నాం. మీకోసం మేముంటాం. మాకోసం మీరు ఉండండి. రానున్న ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యత ప్రతి కార్యకర్త తీసుకోవాలి.’ అని రేవంత్‌ పిలుపునిచ్చారు. 

Advertisement
Advertisement