చాకిరీ మాది... పదవులు మీకా?  | Sakshi
Sakshi News home page

చాకిరీ మాది... పదవులు మీకా? 

Published Wed, Apr 26 2023 3:40 AM

Key meeting of TPCC BC leaders at Gandhi Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యమివ్వడం ద్వారానే కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని, 51కి తగ్గకుండా తమకు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని టీపీసీసీ బీసీ నేతల సమావేశం డిమాండ్‌ చేసింది. ‘అగ్రవర్ణాల నేతలకు టికెట్లు ఇప్పటికే ఖరారయ్యాయి. వారంతా వారివారి నియోజకవర్గాల్లో పనిచేసుకుంటున్నారు. మరి, బీసీ నేతలకు టికెట్లు ఎప్పు డు ప్రకటిస్తారు? చాకిరీ మాది..సీట్లు, పదవులు మీకా? సమీకరణల పేరుతో ప్రతీసారి ఆఖరి నిమిషంలో టికెట్లు ఇస్తున్నారు. అలాకాకుండా 6 నెలల ముందే అభ్యర్థులను ప్రకటించాలి.

అప్పుడే నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో పనిచేసుకునే అవకాశం లభిస్తుంది’అని సమావేశంలో పలువురు నేతలు వ్యాఖ్యానించారు. పార్టీలోని ఏ ఒక్క సామాజిక వర్గానికి తాము వ్యతిరేకం కాదని, కానీ జనా భా ప్రాతిపదికన తమ కోటా సీట్లు, పార్టీ పదవులు తమ కు ఇవ్వాల్సిందేనని ఉద్ఘాటించారు. పీసీసీ మాజీ అధ్య క్షుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, టీపీ సీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యల నేతృత్వంలో మంగళ వారం గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ బీసీ నేతల సమావేశం జరిగింది. ఇందులో 100 మందికిపైగా బీసీ నేతలు పాల్గొన్నారు. 

1% జనాభా లేని వారితో సమానంగా టికెట్లా? 
సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, పార్టీలో తమ వర్గాలకు ప్రాధాన్యమివ్వాలని అటు ఏఐసీసీ, ఇటు టీపీసీసీలను కోరారు. ప్రతి పార్లమెంటు స్థానంలో కనీసం 3 అసెంబ్లీ స్థానాల చొప్పున 51కి తగ్గకుండా మెజార్టీ కులాలకు టికెట్లు కేటా యించాలని ప్రతిపాదనలు చేశారు.

రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 30–32 సీట్లకే బీసీలను సరిపెడుతున్నారని, ఒక్క శాతం జనాభా లేని వారితో సమానంగా టికెట్లు ఇస్తున్నారన్నారు. బీసీల గురించి మాట్లాడితే తొక్కేస్తారనే భయం ఇప్పటికీ పార్టీలో ఉందని, పార్టీ పదవుల కేటాయింపులో మార్పు రావాలని చెప్పారు. 

 జిల్లాల వారీగా సమావేశాలు 
దేశవ్యాప్తంగా బీసీ కులాలకు ప్రాధాన్యమివ్వాలన్న పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఓబీసీల జనగణనకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని, రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తామని, పార్టీలో బీసీలకు తగిన ప్రాధాన్యమిస్తామని వెల్లడించిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీకి కృతజ్ఞతలు తెలిపే తీర్మానాన్ని ఆమోదించారు. బీసీలకు పెద్దపీట వేసిన కాంగ్రెస్‌ను దెబ్బతీయాలన్న ఆలోచనతో రాహుల్‌ ఓబీసీలను కించపర్చారంటూ బీజేపీ చేస్తున్న దు్రష్పచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

బీసీల పట్ల కాంగ్రెస్‌ వైఖరిని ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. టీపీసీసీ ఆధ్వర్యంలో బీసీ గర్జన సభనిర్వహణపై మరోసారి సమావేశమై దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఉన్న బీసీ కులాల జనాభా, ఓట్ల వివరాలతో కూడిన నివేదికను సోనియా, రాహుల్‌గాం«దీ, మల్లికార్జున ఖర్గేలకు అందజేయాలని నిర్ణయించారు. సమావేశంలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బి.మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్, పార్టీ నేతలు శ్యాంమోహన్‌ పాల్గొన్నారు.   

Advertisement
Advertisement