రాధాకృష్ణను కమ్మేసిన చంద్ర మాయ | Kommineni Comments On ABN Radha Krishna About Congress And YS Jagan Paluku - Sakshi
Sakshi News home page

ఏబీఎన్‌ రాధాకృష్ణను కమ్మేసిన చంద్ర మాయ

Published Mon, Sep 4 2023 1:09 PM

Kommineni Comment On ABN Radha Krishna Congress YS Jagan Paluku - Sakshi

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నమ్మడం లేదట. వైఎస్సార్‌ కాంగ్రెస్ అదినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నమ్ముతున్నారట. అదే సమయంలో జగన్ కాంగ్రెస్ అగ్రనేతలతో కూడా టచ్‌లో ఉండి, లోక్ సభ ఎన్నికల తర్వాత మద్దతు ఇస్తానని అన్నారట. ఇది నిత్యం తెలుగుదేశం కోసం బట్టలూడదీసుకుని తిరిగే ఆంధ్రజ్యోతి తాజా పలుకు. ఎలాగోలా ఆంధ్ర వరకైనా జనసేనతో పాటు  బీజేపీని, టీడీపీని కలపడానికి ఎంతకైనా దిగజారి కొత్తపలుకో, చెత్తపలుకో రాసి అపోహలు సృష్టించాలన్న ఆ పత్రిక యజమాని రాధాకృష్ణ ఆంతర్యం అర్దం అవుతూనే ఉంది. అంతేకాక జగన్ సోదరి షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించడం లేదని తెగ బాధపడ్డారు.

నిజానికి ఈ వారం అతి ముఖ్యమైన అంశం ఏమిటి? చంద్రబాబునాయుడుకు ఆదాయపన్ను శాఖ రూ. 118 కోట్ల రూపాయల బ్లాక్ మనీకి సంబంధించి నోటీసు ఇవ్వడం. ఎవరెవరి ద్వారా ఆ డబ్బు  జమ అయింది తదితర వివరాలు వెలుగులోకి రావడం. అంటే అదంతా ముడుపుల రూపేణా తీసుకున్న డబ్బేనన్న భావన  సహజంగానే ఏర్పడుతుంది కదా?. చంద్రబాబు  దీనిపై స్పందించాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నా.. ఆయన స్పష్టత ఇవ్వడం లేదు. పైగా తప్పించుకునే రీతిలో మాట్లాడారు. ఆయన అంతేవాసిగా ఉన్న రాధాకృష్ణ అయినా అందులోని మర్మం ఏమైనా రాస్తారేమోనని చూసినవారికి ఆశ్చర్యం కలిగించేలా కాంగ్రెస్ పార్టీకి, జగన్ కు లింక్ పెట్టడానికి ఆయన చేసిన విన్యాసాలు కనిపించాయి. పైగా ఈయన రాజకీయ విలువలు గురించి మాట్లాడడం. ఇంతకన్నా సిగ్గు చేటు అయిన విషయం ఏమైనా ఉంటుందా?

✍️ జగన్ సోదరి షర్మిల తెలంగాణలో రాజకీయపార్టీ పెట్టుకుని నడుపుతున్నారు. ఆమెతో ప్రస్తుతం కాంగ్రెస్ అదిష్టానం టచ్లోకి వెళ్లింది. పార్టీ విలీనం, తదితర అంశాలపై ఆమె సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తదితరుల్ని కలిసి వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన కొన్ని విషయాలకు వక్రభాష్యం చెబుతూ ఈయన కాంగ్రెస్ ను కమ్మిన జగన్మాయ అని కథ అల్లేశారు. అందులో తనకు జగన్ పైన ఉన్న విద్వేషాగ్ని అంతటిని మరోసారి కక్కారు. ఇంత ద్వేషంలో కూడా ఆయనకు తెలియకుండానే ఒక విషయం అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ వచ్చే ఎన్నికల తర్వాత కూడా పవర్ పుల్ గానే ఉంటారని, ఒకవేళ కేంద్రంలో ఎవరికి మెజార్టీ రాని పక్షంలో జగన్ సాధించే లోక్ సభ సీట్లు కీలకం అవుతాయని చెప్పకనే చెప్పినట్లయింది. 

జగన్ తన కేసుల కోసమో, వివేకా హత్య కేసు విషయం గురించో ప్రధాని మోదీ తదితరులతో సన్నిహితంగా ఉంటున్నారని ఏబీఎన్‌ రాధాకృష్ణ చెబుతున్నారు. అది పచ్చి అబద్దమని పలుమార్లు రుజువైనా రాధాకృష్ణ వంటి వారు ఈ దుష్ప్రచారం ఆపరు. అదే నిజమైతే వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌ రెడ్డి తండ్రి ఎందుకు జైలులో ఉండవలసి వస్తుంది?. జగన్ తనపై ఉన్న కేసుల్ని ఎందుకు కొట్టివేయించుకోలేకపోయారు?. మరో వైపు చంద్రబాబు నాయుడు తన పై వచ్చిన అభియోగాలపై ఎన్నడైనా విచారణకు సిద్దపడ్డారా?. ఎన్ని స్టేలు ఎలా తెచ్చుకోగలిగారు?. ఆ చిదంబర రహస్యం ఏమిటో రాధాకృష్ణ కన్నా బాగా ఎవరికి తెలుస్తుంది!.

✍️ చంద్రబాబుకు నిత్యం సలహాలు ఇస్తూ రామోజీరావు కన్నా తానే ముఖ్యమన్నట్లు బిల్డప్‌ ఇచ్చుకునే ఈయన.. ఆ విషయాలు కూడా రాస్తే బాగుంటుంది కదా!. చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని పేరుతో సాగించిన వ్యవహారాలలో అవినీతి జరిగిందా?.. లేదా?, సబ్‌ కాంట్రాక్టర్ ల నుంచి డబ్బులు వసూలు చేశారా?..లేదా?,  ఆదాయపన్ను శాఖ ఇచ్చిన నోటీసు వాస్తవమా?..కాదా?, అందులో ఉన్న విషయాలతో ఆయన ఏకీభవిస్తారా?.. లేదా? వీటి గురించి ఒక్క ముక్క రాయని రాధాకృష్ణ, వైఎస్సార్‌సీపీ వాళ్ల ఒత్తిడి వల్ల ఆదాయపన్ను శాఖ మళ్లీ నోటీసు ఇచ్చిందని నిస్సిగ్గుగా కథనాన్ని ఇవ్వడం సమర్దనీయమేనా?

✍️ ఎన్టీఆర్‌ నాణెం పేరుతో చేసిన రాజకీయం ఈ ఆదాయపన్ను కేసు గురించా? కాదా?.. బిజెపి జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో ఎందుకు అంత ప్రాధేయపడుతన్నట్లుగా చంద్రబాబు ఫొటోలలో కనిపించారు. ఫోటో ఎప్పటిదో కాని.. ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ వద్ద చేతులు కట్టుకుని ఉన్న చంద్రబాబు ఫోటో గురించి ఈయన ఎందుకు కామెంట్ చేయలేకపోయారు?. జగన్ పట్ల కాంగ్రెస్ మెతక వైఖరికి రావడం వల్ల తెలంగాణలో కాంగ్రెస్ కు నష్టం జరుగుతుందని మరో దిక్కుమాలిన వ్యాఖ్య చేశారు. దీనివల్ల మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వంటివారు కాంగ్రెస్లో చేరే విషయంపై పునరాలోచించుకునే అవకాశం ఉందని రాధాకృష్ణ బెదిరిస్తున్నారు.

జగన్ వల్ల సెటిలర్లు కాంగ్రెస్కు ఓట్లు వేయకపోవచ్చని ఈయన ప్రచారం. సెటిలర్లు అంటే కేవలం తన కులం వారో, టీడీపీ మద్దతుదారులే అని ఆయన భ్రమ పడుతున్నట్లుగా ఉంది. ఎవరైనా  తెలంగాణ రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా కాకుండా.. ఏపీ వ్యవహారాలపై ఆధారపడి ఎందుకు ఓట్లు వేస్తారు?. జగన్  విధ్వంసపాలన చేస్తున్నారని ఆంధ్రులు అనుకుంటున్నారని.. చెత్త రాతలు రాసేస్తే జనం నమ్ముతారా?. మోకాలికి, బోడిగుండుకు లింక్ పెడుతూ జగన్ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తానన్నారని, మరి ఇప్పుడు మోదీ ఏమి చేస్తారో చూడాలని రాసేస్తున్నారు. ఈయన రాసే అబద్దాలన్నీ బిజెపి పెద్దలు నమ్మాలన్నది ఆయన కోరిక.

✍️ రాహుల్ గాంధీని షర్మిల కలిసినప్పుడు అన్నాచెల్లెళ్ల మధ్య తగాదాపెట్టామన్న పేరు రావడం తనకు ఇష్టం లేదని అన్నారట. అది ఈయనకు నచ్చలేదు. రెండు తెలుగు రాష్ట్రాలు కాకుండా దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలలో ప్రచారానికి షర్మిల సేవలను వినియోగించుకుంటామని అధిష్టానం పెద్దలు చెబుతున్నారట. విషయం ఏమిటంటే ఆంధ్రలో తాను రాజకీయాలు చేయనని, తను పుట్టింది,పెరిగింది. తన అత్తగారి ప్రాంతం అంతా తెలంగాణే అని షర్మిల పలుమార్లు చెప్పారు.. అయితే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వంటివారికి షర్మిల తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలలో ఉండడం ఇష్టం లేదు. షర్మిలను చేర్చుకుంటే పోటీ పవర్ సెంటర్ అవుతారనో, లేక బీఆర్ఎస్ నేతలు ఎక్కడ ఆంధ్ర సెంటిమెంట్ తెస్తారోనన్న భయం ఉండి ఉండవచ్చు.  రేవంత్ రెడ్డికి కూడా సన్నిహితుడైన రాధాకృష్ణ ఆయనకు ఎక్కడ నష్టం వస్తుందోనని తలచి ఇలాంటి కథలు అల్లుతున్నారు.

✍️ ఇక్కడ మరో సంగతి చెప్పాలి. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును జగన్ కేసులలో చార్జీషీట్లో పెట్టడంపై సోనియాగాంధీ వివరణ ఇచ్చారని షర్మిల మాటలను బట్టి అర్ధం అవుతుంది. వైఎస్సార్‌ పేరు పెట్టిన విషయం తనకు తెలియదని, రాజీవ్ గాంధీ పేరు కూడా సీబీఐ చార్జీషీట్ లో చేర్చిందని, ఆ బాధ తనకు తెలుసునని అన్నారట. దీనిని బట్టి ఏమి అర్ధం అవుతోంది. వైఎస్సార్‌ పేరును తనకు తెలియకుండా చార్జీషీట్‌లో పెట్టారని అన్నారంటే జగన్ పై కేసులు తాను పెట్టించినట్లు ఒప్పుకున్నట్లే అవుతుంది కదా!. అప్పట్లో సంబందంలేని వ్యక్తులతో సోనియాగాంధీ,చంద్రబాబు నాయుడు కేసులు వేయించి జగన్ ను రాజకీయాలలో లేకుండా చేయాలని ప్రయత్నించిన విషయం బహిరంగ రహస్యమే.  వైఎస్ మరణం తర్వాత జగన్ కాంగ్రెస్ ను నానా ఇబ్బందులకు గురి చేశారని ,అలాంటి వ్యక్తితో ఎలా రాజీ పడుతుందని కూడా రాధాకృష్ణ చిత్రమైన లాజిక్ తెచ్చారు. జగన్ కాంగ్రెస్ లో నుంచి వెళ్లేటట్లు చేసి, ఆయన సొంత పార్టీ పెట్టుకుంటే కేసులు పెట్టి వేధించిన సంగతిని పక్కనబెట్టి.. కాంగ్రెస్నే జగన్ వేధించారని రాయడం అంటే పిచ్చిరాతలకు పరాకాష్టే అని చెప్పాలి.

✍️ రాధాకృష్ణ వంటి ఆషాఢభూతుల చెప్పుడు మాటలు విని సోనియాగాంధీ ఆనాడు అధికారం ఉందనే అహంకారంతో అలా చేశారన్న సంగతి బహిరంగ రహస్యమే. అయినా మసిపూసి మారేడు కాయ చేయాలన్నది ఆయన ఉద్దేశం. ఆదాయపన్ను కేసు లో చంద్రబాబు ఇబ్బంది పడి రాజకీయంగా నష్టపోతారేమోనన్న  భయంతో రాధాకృష్ణ ఇలాంటి నీచమైన వంటకాలు వండుతున్నారు. చంద్రబాబును మోదీ నమ్మడం లేదు కనుక జగన్ ను కూడా నమ్మకుండా చేయాలంటే ఇలా కాంగ్రెస్ తో అంటకట్టాలన్న తాపత్రయం ఆయన అక్షరాలలో అడుగడుగునా కనిపిస్తుంది. అందుకే కాంగ్రెస్ను కమ్మేసిన జగన్మాయ అని రాశారు.

జగన్  కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో ఉంటేనేమో అక్రమమట. మరి బీజేపీతో బంధంలో ఉన్న  పవన్ కళ్యాణ్ టీడీపీతో అక్రమ సంబంధం పెట్టుకుంటే మాత్రం సక్రమమట. ఏపీలో చంద్రబాబుకు , తెలంగాణలో రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వడం ద్వారా తన వ్యాపార ,రాజకీయ ప్రయోజనాలు రక్షించుకోవాలన్నదే రాధాకృష్ణ అసలు లక్ష్యం. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ విషయం గమనించకపోతే వారికే నష్టం. రేవంత్ రెడ్డి వంటివారు గుడ్డిగా నమ్మి ఆయన చెప్పినట్లు వింటే నూతిలో పడ్డట్లే అవుతుంది. చంద్రబాబు తరపున కేంద్రంలో బీజేపీ పెద్దలను మాయచేయాలని రాధాకృష్ణ ఇలాంటి దుష్టపలుకులు రాస్తున్నర సంగతి ఎవరు అర్దం చేసుకోలేరు?.


:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

Advertisement

తప్పక చదవండి

Advertisement