T Congress: ఆ లోపం స్పష్టంగా కనిపించింది | Sakshi
Sakshi News home page

తుక్కుగూడ సభలో ఆ లోపం స్పష్టంగా కనిపించింది

Published Mon, Sep 18 2023 2:18 PM

Kommineni Comment On Mixed Reactions For Thukkuguda Congress Meet - Sakshi

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అద్వర్యంలో జరిగిన బహిరంగ సభ సఫలం అయింది. హైదరాబాలో సీడబ్ల్యూసీ సమావేశాలతో పాటు విజయభేరీ పేరుతో తెలంగాణ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. దీనిద్వారా ప్రజలలో ఒక బలమైన ముద్ర వేసుకోవాలన్న వారి ఆకాంక్ష అర్దం అవుతూనే ఉంది. తెలంగాణ సెంటిమెంట్ తో పాటు  కొత్తగా పార్టీ చేసిన ఆరు వాగ్దానాలపైనే  కాంగ్రెస్ ఎక్కువగా ఆధారపడుతున్నట్లుగా ఉంది. ఈ హామీల ద్వారా కర్నాటకలో మాదిరి హిట్ కొట్టాలన్నది వారి సంకల్పం. వీరి సభ సక్సెస్ అయినా.. బీఆర్ఎస్ మీద ప్రజలలో వారు అనుకున్న స్థాయిలో వ్యతిరేకత ఉందా? అన్నది సందేహమే. ప్రజలలో అంత నెగిటివ్ వాతావరణం ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇన్ని భారీ  హామీలను ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా? అనే ప్రశ్న తలెత్తుతుంది.

కర్నాటక మోడల్ అని చెబుతున్నా, అక్కడ ఇచ్చిన విధంగానే తెలంగాణలో కూడా వాగ్దానాలు చేసి అధికారంలోకి రావాలన్నది వారి లక్ష్యం. తప్పు లేదు. ఈ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్‌కు ఒకరే సలహాదారుగా ఉన్నారు. ఆయనే ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కూడా సలహాదారుగా పనిచేస్తున్నట్లు ఉన్నారు. సరిగ్గా దాదాపు ఇవే హామీలను ఏపీలో కూడా చంద్రబాబు ఇచ్చి ప్రచారం చేస్తుంటారు. కర్నాటకలో బీజేపీ ప్రభుత్వంపై ఉన్న  మాదిరి తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంపై కూడా తీవ్ర వ్యతిరేకత ఉంటే ప్రజలు ఆటోమేటిక్‌గా కాంగ్రెస్ వైపు మొగ్గుతారు. బీజేపీ ఇటీవలికాలంలో తెలంగాణలో వెనుకబడిందన్న భావన ఉండడం ఒకరకంగా కాంగ్రెస్‌కు కలిసొచ్చే అంశమైనా , మరో రకంగా అది కాంగ్రెస్‌ను దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంటుంది.

✍️విపక్ష ఓట్ల చీలిక బీఆర్ఎస్‌కు మేలు చేయవచ్చు. అందుకే కాంగ్రెస్ అగ్రనేతలు, మల్లిఖార్జున ఖర్గే బీజెపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలను ఒక గాటన కట్టి విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ తన ప్రసంగంలో బీఆర్ఎస్ అంటే బీజేపీ బంధువుల పార్టీ అని నిర్వచించారు. అందుకు కొన్ని ఆధారాలు కూడా ఆయన చూపించారు. రాష్ట్రపతి ,ఉప రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీ అభ్యర్దులకు మద్దతు ఇవ్వడం, జీఎస్టీతో సహా వివిధ బిల్లులకు కేంద్రంలో బీజెపీకి సపోర్టు చేయడం వంటివాటిని ఆయన ఉటంకించారు. ఇందులో వాస్తవం ఉండొచ్చు!. కాని దానివల్ల బీఆర్ఎస్‌ పై ప్రజల్లో వ్యతిరేకత పెద్దగా ఉండకపోవచ్చు.

ఢిల్లీ రాజకీయాలు వేరు.. తెలంగాణ రాజకీయాలు వేరు అనే భావన ఉంటుంది. ప్రతిపక్షనేతలందరిపైన కేసులు ఉన్నాయని, కానీ కేసీఆర్ పైనే ఎందుకు లేవని ఆయన ప్రశ్నించారు. ఇక.. కేసీఆర్‌పై రాహుల్ చేసిన ఆరోపణ ఒకటి మరీ విడ్డూరంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆయన అన్నారు. మొత్తం ప్రాజెక్టుకు ఇప్పటిదాకా ఖర్చు చేసింది సుమారు 80 వేల కోట్లు అయితే, లక్ష కోట్ల స్కామ్ అనడం ఎంతవరకు సమంజసం అవుతుంది?.  అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి గాని, కేసీఆర్‌ కుమార్తె కవితకు ఈడీ నోటీసుల గురించి గాని వీళ్లెవరూ ప్రస్తావించలేదు. కావాలని ఆ ఊసెత్తలేదా?లేక మర్చిపోయారా? అనేది తెలియదు.

✍️రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి మాట్లాడుతూ.. 2004లో సోనియాగాంధీ హామీ ఇచ్చారని , ఆ ప్రకారం రాష్ట్రం ఇవ్వడం జరిగిందని అన్నారు. అదే ప్రకారం ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేస్తామని అన్నారు. అధికారంలోకి వచ్చిన తదుపరి తొలి క్యాబినెట్లోనే ఈ వాగ్దానాల అమలుకు నిర్ణయాలు తీసుకుంటారని కూడా ఆయన ప్రకటించారు. ఈ హామీలను ప్రకటిస్తున్నప్పుడు సభికులలో మంచి స్పందనే కనిపించింది. సభకు .వచ్చినవారిలో ఎక్కువ మంది శ్రద్దగా కూర్చోవడం, ఆయా సందర్భాలలో హర్షద్వానాలు చేయడం కనిపించింది. కాని నాయకులు ఉర్రూతలూగించే ఉపన్యాసాలు చేయలేకపోయారు.  కాస్తో.. కూస్తో అలా హంగామా చేయగల రేవంత్ రెడ్డికి సభ లో పూర్తి స్థాయిలో మాట్లాడే అవకాశం రాకపోవడం ఒక లోపంగా కనిపిస్తోంది. రేవంత్ మాట్లాడుతున్న తరుణంలో.. ఖర్గే, రాహుల్ తదితరులు లేచి నిలబడి వెళ్లిపోవడానికి ఉద్యుక్తులవుతుండడంతో ఆయన తన స్పీచ్ ను ఆపివేయవలసి వచ్చింది.  రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రసంగం ఎవరికి  పెద్దగా అర్దం కాలేదు. మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొద్దిసేపు మాట్లాడి కాంగ్రెస్ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. రేవంత్, కోమటిరెడ్డిలకే ప్రజలలో అధిక స్పందన కనిపించింది. మరో ఎమ్.పి ఉత్తంకుమార్ రెడ్డికి రాహుల్ ,సోనియాగాందీల ప్రసంగాల అనువాద బాధ్యత అప్పగించారు. ఖర్గే ప్రసంగాన్ని మాజీ ఎంపీ మధుయాష్కి తెలుగులో సంక్షీప్తకరించారు. మల్లు భట్టి కొద్దిసేపు మాట్లాడి ఖర్గేకి స్వాగతం చెప్పారు. ఆయనతో రైతుభరోసా హామీని విడుదల చేయిస్తున్నట్లు ప్రకటించారు.

సోనియాగాంధీ కేవలం ఆరు వాగ్దానాలను విడుదల చేసి.. బహుశా ఆరోగ్య కారణాల రీత్యానేమో అతికొద్ది సేపు మాత్రమే ప్రసంగించారు. రాష్ట్ర ఏర్పాటును ప్రస్తావించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తన కల అని అన్నారు.  ఆ సందర్భంలో ఈ వాగ్దానాలు అమలు చేస్తామని చెప్పారు. ఈ హామీల అమలు గ్యారెంటీ కార్డులను ఖర్గే, రాహుల్, రేవంత్ తదితరులు కలిసి విడుదల చేశారు. ఇక వంద రోజులే కేసీఆర్‌ ప్రభుత్వానికి మిగిలిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని.. రాహుల్ చెప్పారు. కేసీఆర్‌  కుటుంబం కోసమే తెలంగాణను వాడుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. అయితే కేసీఆర్‌ ది కుటుంబ పార్టీ అని అనకుండా జాగ్రత్తపడ్డారు. ఎందుకంటే కాంగ్రెస్ పైనా అదే ముద్ర ఉంది కనుక.

✍️తెలంగాణ ఇచ్చినా రాష్ట్రంలో అధికారం రాలేదన్న బాధ వారిలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ విషయాన్ని నేరుగా గుర్తు చేయకపోయినా, తెలంగాణ హామీని నిలబెట్టుకున్న మాదిరే..  తాజా వాగ్దానాలను అమలు చేస్తామని చెప్పడానికే ఆ పాయింట్‌ను వాడుకున్నారు. కాగా కొత్తగా ప్రకటించిన మహాలక్ష్మి, గృహ లక్ష్మి, గృహ జ్యోతి తదితర హామీలకు ఎంత వ్యయం అయ్యేది, అందుకు అవసరమయ్యే వనరులను ఎక్కడ నుంచి తెచ్చేది మాత్రం చెప్పలేదు. కాకపోతే కర్నాటకలో అమలు చేస్తున్నామని చెప్పుకున్నారు. కాంగ్రెస్ సభ పూర్తి కాగానే.. మంత్రి హరీష్ రావు అవన్నీ బూటకపు హామీలని ఎద్దేవ చేశారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఈ స్తాయిలో సభను ఏర్పాటు చేయడం విశేషమే.కాని దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారా అంటే సంశయమే అని చెప్పాలి.

:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

Advertisement
Advertisement