‘కేసీఆర్‌, జగన్‌ను ఫాలో అయితే చాలా?’ | Kommineni Srinivasa Rao Comments On Telangana Congress SC ST Declarations - Sakshi
Sakshi News home page

టీ కాంగ్రెస్‌ డిక్లరేషన్లు.. ‘కేసీఆర్‌, జగన్‌ను ఫాలో అయితే సరిపోతుందా?’

Published Mon, Aug 28 2023 10:38 AM

Kommineni Comment On Telangana Congress SC ST Declarations - Sakshi

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ఆ పార్టీకి ఎంత మేర రాజకీయంగా ఉపయోగపడుతుందన్నది చర్చనీయాంశమే. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి ఖార్జున్ ఖర్గే  సమక్షంలో  ఈ డిక్లరేషన్ విడుదల చేశారు. గత పదేళ్లుగా కేంద్రంలోను, తెలంగాణలోను అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వవైభవం సాధించడానికి చేస్తున్న ప్రయత్నాలు అర్దం చేసుకోదగినవే. హిమాచల్ ప్రదేశ్, కర్నాటకలలో  కాంగ్రెస్ కు వచ్చిన విజయం వారికి కొండంత ఉపశమనాన్ని ఇచ్చింది. ఇప్పుడు అదే కొత్త  ఆశను కలిగిస్తోంది.

అయితే.. ఆ రాష్ట్రాల రాజకీయ పరిస్థితులకు ,తెలంగాణ పరిస్థితులకు చాలా తేడా ఉంటుంది. బీఆర్ఎస్ అదినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యూహాలు పన్నడంలో ఆరితేరిన నేత. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలోకాని, కాంగ్రెస్,టీడీపీ వంటి పార్టీలను తన దారిలోకి తెచ్చుకోవడంలో కాని, తెలంగాణ వచ్చాక ఆయన ముఖ్యమంత్రి అయిన తీరు కాని, తిరిగి 2018లో అధికారంలోకి వచ్చిన వైనం కాని ఆయన సమర్దత తెలియచేస్తుంది. దీనిని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ కూడా తగు ప్రణాళికలను రచిస్తోంది. అందులో భాగంగా తెలుగుదేశంలో నుంచి వచ్చిన మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించింది. ఆయన దూకుడుగానే పార్టీని నడుపుతున్నారు. మాటకారి కావడం కొంత కలిసి వచ్చే అంశం. కాని అదే సమయంలో ఆయనపై ఓటుకు నోటు కేసు ఉండడం , కాంగ్రెస్ గ్రూపులు మైనస్ అవుతాయి. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆయా వర్గాలను ఆకట్టుకోవడానికి డిక్లరేషన్ లు ప్రకటిస్తోంది. వాటి ద్వారా ఆ వర్గాలకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేయబోయే పధకాలు, కార్యక్రమాలను వివరిస్తున్నారు.

ఇప్పటికే రైతు డిక్లరేషన్ పేరుతో పలు వరాలు గుప్పించారు. రైతులకు రెండు లక్షల రూపాయల మేర రుణ మాఫీ చేస్తామని అందులో తెలిపారు. తాజాగా ఎస్.సి,ఎస్.టి వర్గాలకు ఇచ్చిన డిక్లరేషన్ లో పలు భారీ వాగ్దానాలు చేశారు. వాటిలో కొన్ని కేసీఆర్‌ ఇప్పటికే అమలు చేస్తున్నవి కాగా, మరికొన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ అమలు చేస్తున్నవి కావడం విశేషం.కాకపోతే కొన్ని మార్పులు చేశారు.

ఉదాహరణకు గతంలో  కేసీఆర్ గిరిజనులకు 12 శాతం, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు.ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంత మార్పు చేసి ఎస్సిలకు 18 శాతం, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని అంటోంది. నిజానికి కేసీఆర్‌ తాను ఇచ్చిన హామీని అమలు చేయలేకపోయారు.కేంద్రానికి ఒక తీర్మానం పంపి సరిపెట్టుకున్నారు.మరి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎలా తాను ఇచ్చిన హామీని అమలు చేయగలుగుతుందో తెలియదు. దానిపై వివరణ ఇవ్వగలిగితే బాగుంటుంది. అలాగే.. ఎస్సి రిజర్వేషన్ లలో వర్గీకరణ చేస్తామని కూడా కాంగ్రెస్ చెప్పింది. తెలంగాణలో మాదిగవర్గం అధికంగా ఉంటుంది కనుక ఈ హామీ ఇచ్చారు. కానీ,  2014 వరకు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా,ఉమ్మడి ఎపి శాసనసభ దీనికి సంబంధించి తీర్మానం చేసినా, అమలు చేయలేకపోయారు. తాజాగా ఆ హామీ ఏ రకంగా నెరవేర్చగలుగుతారో చూడవలసి ఉంది. బిజెపి కూడా వర్గీకరణకు అనుకూలమే అయినా గత పదేళ్లలోను అది అమలు కాలేదు.

✍️ఎస్సీ,ఎస్టీ వర్గాలకు కుటుంబానికి  పన్నెండు లక్షల రూపాయల చొప్పున అంబేద్కర్ అభయ హస్తం పేరుతో అందచేస్తామని, తద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. ప్రస్తుతం కేసీఆర్ దళిత బంధు పేరుతో కుటుంబానికి పది లక్షల చొప్పున ఇస్తున్నారు. దానిని వంతులవారీగా ఇచ్చే యత్నం చేస్తున్నారు. దళితులకు మాత్రమే ఇవ్వడంపై వస్తున్న విమర్శలను దృష్టిలో పెట్టుకుని ఇతర వర్గాలకు కూడా ఎంతో కొంత ఇవ్వడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్దపడింది. తాజాగా ముస్లింబందు పేరుతో లక్ష సాయం చేస్తున్నారు. బహుశా కాంగ్రెస్ పార్టీ కూడా ఆయా వర్గాల డిక్లరేషన్ లు ప్రకటించినప్పుడు వారికి కూడా ఇలా ఆర్ధిక సాయం స్కీములు ప్రకటిస్తారేమో చూడాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చేదానికి అదనంగా రెండు లక్షలు ఇస్తామని కాంగ్రెస్ అంటోంది. మొత్తం ఎంతమందికి ఈ సాయం చేస్తారు? అందుకు అయ్యే వ్యయం ఎంత? మిగిలిన వర్గాలను ఏ విధంగా సంతృప్తిపరుస్తారు? మొదలైన విషయాలలో క్లారిటీ లేదనే చెప్పాలి.

✍️ ఇక.. ప్రభుత్వ కాంట్రాక్టులలో ఎస్సి,ఎస్టిలకు 18 శాతం, 12శాతం రిజర్వేషన్ ఇస్తామని మరో హామీ ఇచ్చారు. ఏపీలో జగన్ ప్రభుత్వం ఈ తరహా హామీని అమలు చేస్తోంది. బలహీనవర్గాలన్నిటికి కలిపి ఏభై శాతంకాంట్రాక్టు పనుల రిజర్వేషన్ ఇస్తున్నారు. బహుశా దానిని క్లూ గా తీసుకుని ఈ హామీ ఇచ్చారేమో తెలియదు. ప్రైవేట్‌ విద్యా సంస్థలలో, ప్రభుత్వ రాయితీలు పొందే ప్రైవేటు కంపెనీలలో రిజర్వేషన్ అన్నారు.కాని అది అంత తేలికైన వ్యవహారం కాదు.ప్రతి ఎస్సి,ఎస్టి కుటుంబానికి ఐదేళ్ల లో ఇంటి స్థలంతో పాటు, ఇంటి నిర్మాణానికి ఆరు లక్షల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ చెబుతోంది. ఎంత స్థలం ఇస్తారు?ఏ తరహా ఇళ్లు నిర్మిస్తారు.. అనేవాటి గురించి చెబితే బాగుండేది. ఈ స్కీమ్ కు అయ్యే వ్యయం ఎంతని లెక్కవేశారు. బీఆర్ఎస్  ప్రభుత్వం గుంజుకున్న  అస్సైన్డ్ భూములను తిరిగి ఇస్తామని,ఒకవేళ ప్రజాప్రయోజనాలకు సేకరిస్తే 2013 చట్టం ప్రకారం మూడు రెట్ల పరిహారం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.ఎన్ని అస్సైన్డ్ భూములు ఆ కేటగిరిలో ఉన్నాయన్నదానిపై స్పష్టత ఉందో ,లేదో తెలియదు.

✍️ ఎస్సీలకు మూడు కార్పొరేషన్ లు ఏర్పాటు చేసి ఒక్కోదానికి 750 కోట్ల రూపాయల నిధులు ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన మరో హామీ.ఇది కూడా ఆంధ్రప్రదేశ్‌ తరహాలోనే ఉంది. కాని ఒక్కో కార్పొరేషన్ కు 750 కోట్ల కేటాయింపు సులభమేమీ కాదు. ఒక పక్క పన్నెండులక్షల సాయం స్కీమ్ అమలు చేస్తూ, మరో పక్క ఇలా కార్పొరేషన్ ల ద్వారా స్కీములు అమలు చేయడానికి చాలా నిదులు అవసరం అవుతాయి.గిరిజనులకు మూడు కార్పొరేషన్ లు, ఒక్కోదానికి 500 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పడం కూడా ఆలోచించవలసిన విషయమే.కొత్త ఐటిడిఎ లు,సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, ఈ వర్గాల విద్యార్దులు పది, ఇంటర్ ,డిగ్రీ తరగతులు పాస్ అయ్యాక నగదు బహుమతులు..ఇలా పలు హామీలను గుప్పించారు. ఏ రాజకీయ పార్టీ ఎన్ని హామీలైనా ఇవ్వనివ్వండి.కాని అవి వాస్తవాల ప్రాతిపదికన ఉన్నాయా?లేవా? అన్నది చూడాలి.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుబంధుతో పాటు,రైతుల రుణమాఫీ స్కీములు అమలు చేయడానికి ఎన్ని తంటాలు పడుతున్నది,ఎన్నివేల కోట్ల వ్యయ భారం అవుతున్నది అంతా గమనిస్తున్నారు.రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారని విమర్శించే ప్రతిపక్షాలు కెసిఆర్ అమలు చేసినవాటికంటే ఎక్కువ స్కీములు అమలు చేస్తామని చెబుతున్నారు. అది కెసిఆర్ ను ఫాలో అవడం కూడా కావచ్చు. అదే సమయంలో ఎస్సి,ఎస్టి వర్గాలలో ఆదరణ పొందడానికి ఈ వ్యూహం అమలు చేస్తుండవచ్చు. ఏది ఏమైనా ఈ డిక్లరేషన్ కు ఎంత డబ్బు అవసరం అవుతుంది?రాష్ట్ర బడ్జెట్ పరిస్థితి ఏమిటి?అన్న అంశాలపై కూడా స్పష్టత ఇస్తే మంచిది.

ఇక ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ముఖ్యమంత్రి కేఏసీఆర్‌పై నిశితంగా విమర్శలు చేశారు. బిజెపితో రహస్య అవగాహన పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. దానికి కారణం బిజెపిని వ్యతిరేకిస్తున్నట్లు చెబుతూనే ఇండియా కూటమిలో చేరకపోవడాన్ని ఆయన ఆక్షేపించారు.కాగా కెసిఆర్ వ్యూహాత్మకంగా గవర్నర్ తమిళిసైతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడాన్ని కూడా బిజెపితో అంతర్గతంగా ఉన్న బందమేనని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మొత్తం మీద కాంగ్రెస్ సభ విజయవంతం అయినా, కాంగ్రెస్ ప్రకటించిన ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్ పై మరింత స్పష్టత అవసరమని చెప్పకతప్పదు. లేకుంటే ఈ డిక్లరేషన్ ను ఆ వర్గాలు ఎంతవరకు నమ్ముతాయన్నది అప్పుడే చెప్పలేం.


:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

Advertisement
Advertisement