ఏపీ ఎన్నికల వరకు బాబు జిమ్మిక్కులు తప్పవా..? | Sakshi
Sakshi News home page

ఏపీ ఎన్నికల వరకు బాబు జిమ్మిక్కులు తప్పవా..?

Published Mon, Feb 12 2024 1:11 PM

Kommineni Srinivasa Rao Comments On Eenadu And Andhra Jyothi - Sakshi

‘‘టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ఎంత కష్టం వచ్చిపడింది..! ‘ఆయన తనకు ఇష్టం లేకపోయినా బీజేపీతో పొత్తు పెట్టుకోక తప్పడం లేదట. ఎన్‌డీఏలో చేరక తప్పడం లేదట. అది రాష్ట్ర ప్రయోజనాల కోసమట’. తాటిచెట్టు ఎందుకు ఎక్కావంటే  దూడ మేత కోసం అన్నట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక తన భావాలను సహచరులతో  ఆయన పంచుకున్నారట. ఆ సహచరుడు ఎవరో తెలిసిందే కదా! ఆంధ్రజ్యోతి రాధాకృష్ణే అని వేరే చెప్పనవసరం లేదు. వారిద్దరూ కూర్చుని ఒక వంటకం తయారు చేసి జనం మీద వదిలారన్నమాట. అందులో ఏమి రాశారో చూడండి..’’

'రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దష్టిలో ఉంచుకుని ఎన్‌డీఏలో చేరాలని హోం మంత్రి అమిత్‌షా మనల్ని ఆహ్వానించారు. మనకు ఉన్న పరిమితులు, సమస్యలపై చర్చించాం, వారి అభిప్రాయం వారు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల రిత్యా తప్పదేమోననిపిస్తుంది’ అని చంద్రబాబు అన్నారట. దీనినే హిపోక్రసీ అని అంటారు. తెలుగులో కపటత్వం అన్నమాట. బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే తాను గెలవలేమోనన్నది వారి భయం. ఏపీలో ఎన్నికల మేనేజ్‌మెంట్‌లో చిక్కులు వస్తాయేమోనన్నది వారి సందేహం.

గత ఎన్నికల ముందు మాదిరి తమ నేతల ఇళ్లలో ఐటీ, ఈడీ సోదాలు జరిగితే ఇక్కట్ల పాలవుతామేమోనన్నది వారి డౌటు. ఇంకేమైనా కొత్త కేసులు ఉన్నాయేమో! దీనిని వదలి ఈ డ్రామా ఎందుకు? ఇక్కడ కూడా నిజాయితీ లేదు. ఫెయిర్‌గా తాము గతంలో బీజేపీని వదలి తప్పు చేశాం.. ఇప్పుడు కోరుకుంటున్నాం అని అంటే సరిపోతుంది. అలాగే ప్రధాని మోదీని తెలివితక్కువగా దూషించాం.. అందుకు క్షమించాలని కోరుకుంటున్నాం అని  అంటే పర్వాలేదు. కాని ఇక్కడ కూడా ఆత్మ వంచనే. అమిత్‌షానే వీరిని పదే, పదే పిలిచినట్లు బిల్డప్ ఇచ్చుకోవడం. బీజేపీ రాష్ట్ర నేతలు కొందరు ఈ కథనాన్ని చూసి నవ్వాలో, ఏడవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

పాతిక సార్లు షా అప్పాయింట్‌ను చంద్రబాబు కోరితే, ఆ విషయం రాయకుండా షా రమ్మన్నారని ప్రచారం చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ కూడా మళ్లీ వైఎస్సార్‌సీపీపై విమర్శలు. రాష్ట్రానికి ఏదో నష్టం జరిగిపోయిందని అంతా అనుకుంటున్నట్లు అబద్దపు ప్రచారం. బీజేపీతో పొత్తుపై మైనార్టీ వర్గాలు అసంతృప్తి చెందవచ్చని, కాని పరిస్థితులను విశదీకరించి చెబితే అర్ధం చేసుకుంటారని అమిత్‌షా అన్నారట. ఎంత కథ రాశారండి. యూపీలో ఒక్క సీటు  కూడా మైనార్టీలకు ఇవ్వకుండా ఎన్నికలలో పోటీచేసిన బీజేపీ, ఏపీలో మైనార్టీ నేతలు టీడీపీకి మద్దతు ఇవ్వరేమోనని ఆలోచన చేస్తుందా? ఎవరిని మోసం చేయడానికి ఈ మాయ ప్రచారం.

ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే తెలంగాణలో బీజేపీ సిద్దపడకపోవడం వల్లే,   కాంగ్రెస్‌తో  తప్పనిసరి పరిస్థితిలో జట్టు కట్టవలసి వచ్చిందని కూడా చంద్రబాబు చెబితే అమిత్‌షా ఊ కొట్టారట. కాంగ్రెస్‌కు ఇచ్చే బదులు బీజేపీకే పరోక్ష మద్దతు ఇచ్చి ఉండవచ్చు కదా..! 2019లో దేశం కోసం కాంగ్రెస్‌తో స్నేహం అని చంద్రబాబు భావన అని ఈనాడు, ఆంధ్రజ్యోతి ఊదరకొట్టాయి కదా! మోదీ అంత అవినీతిపరుడు లేడని, ఉగ్రవాది అని, ముస్లీంలకు రక్షణ ఉండదని, త్రిబుల్ తలాఖ్ తెచ్చారని ఇలా ఎన్నో విమర్శలు చేశారు కదా! ప్రత్యేక హోదాను కేంద్రంలోని బీజేపీ ఇవ్వలేదని, 29 సార్లు ఢిల్లీ వెళ్లినా విభజన హామీలు నెరవేరలేదని, ఏడాదిన్నర పాటు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వకుండా మోదీ అవమానించారని చెప్పారు కదా!

మరి ఇప్పుడు ఆ పరిస్థితిలో ఏమి మార్పు వచ్చిందని బీజేపీ పెద్దలను కాకా పట్టి మరీ వారిని కలిశారో చెప్పాలి. ప్రత్యేక హోదా ఇస్తామని, ఇతర సమస్యలను తీర్చుతామని అమిత్‌షా ఏమైనా హామీ ఇచ్చారా? అలా ఇచ్చి ఉంటే కదా! రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో జతకట్టి ఎన్‌డీఏలో చేరుతున్నామని చెప్పాలి. అదేమి కాకుండా చంద్రబాబు బీజేపీని అంటకాగే యత్నం చేస్తున్నారంటే దానికి ఒక కారణం చెబుతున్నారు. ఇదంతా ఈనాడు అధినేత రామోజీరావు ఇచ్చిన సలహా అని అంటున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికలలో టీడీపీ ఓడిపోతే చంద్రబాబుపై వచ్చిన అవినీతి కేసుల విషయంలో ఇబ్బంది పడవలసి వస్తుందని రామోజీ భావిస్తున్నారట.

దానినుంచి తప్పించుకోవడానికి కేంద్రంలోని బీజేపీతో జట్టు కడితే ఏపీలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చినా, అంత దూకుడుగా వెళ్లకపోవచ్చన్నది ఆయన భావన అని రాజకీయవర్గాలలో ప్రచారం జరుగుతోంది. తాను కూడా బీజేపీవారితో సత్సంబంధాలు కొనసాగించడం వల్లే తనపై ఉన్న మార్గదర్శి కేసులలో అరెస్టు వరకు వెళ్లకుండా తప్పించుకోగలిగానని చెబుతున్నారట. ఈ ప్రచారంలో నిజం ఉందో, లేదో తెలియదు కాని, ఈ వాదనలో హేతుబద్దత ఉన్నట్లు అనిపిస్తుంది. మరో వైపు ఎక్కువ సర్వేలు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉంటే ఒక్క సీ-ఓటర్ సర్వే టీడీపీకి ఫేవర్‌గా రావడం కూడా ఆశ్చర్యమే అనిపిస్తుంది.

టైమ్స్ నౌ, న్యూస్ అరెనా ఇండియా, జనమత్, పొలిటికల్ క్రిటిక్ వంటి పలు సంస్థల సర్వేలలో ఏపీలో 17 నుంచి 20 లోక్‌సభ సీట్లు,  113 నుంచి 118 అసెంబ్లీ సీట్లతో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తే సీ-ఓటర్ సర్వే మాత్రం భిన్నంగా ఇచ్చింది. పదిహేడు సీట్లు టీడీపీ, జనసేన కూటమికి వస్తాయని అంటున్నది. 2019లో కూడా ఈ సంస్థ టీడీపీనే గెలుస్తుందని చెప్పింది కాని, వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించింది. ఇటీవలె జరిగిన మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘర్ రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్‌ గెలుస్తుందని సీ-ఓటర్ చెబితే, ఆ రెండుచోట్ల బీజేపీ విజయం సాధించింది.

ఈ నేపధ్యంలో సీ-ఓటర్ సర్వే గురించి పెద్దగా పట్టించుకోనవసరం లేదని వైఎస్సార్‌సీపీ భావిస్తోంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇదే విషయం చెప్పారు. అసలు ఈ సర్వేని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లే నమ్మడం లేదని అనుకోవచ్చు. చంద్రబాబు అయితే జనసేనతో పొత్తు కోసం పడిన తంటాలు తెలిసినవే. వారిద్దరూ కలిశాక, నిజంగానే వారికి గెలుస్తామన్న నమ్మకం ఉండి ఉంటే బీజేపీని ఎందుకు బతిమలాడుకుంటారు? వైఎస్సార్‌సీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ పదే, పదే ఎందుకు చెబుతుంటారు? వచ్చే రెండు నెలలు కూడా టీడీపీ అనండి.. చంద్రబాబు అనండి.. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాదాకృష్ణ.. ఇంకా ఎన్నో జిమ్మిక్కులు చేస్తారు. ఎన్నికలు అయ్యేవరకు మనకు ఈ బెడద తప్పదు.


-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్‌ పాత్రికేయులు

Advertisement
Advertisement