ఏపీ రాజకీయాలలో మరో వలస పక్షి | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మరో వలస పక్షి

Published Tue, Jan 23 2024 2:03 PM

Kommineni Srinivasa Rao Comments on YS Sharmila Politics - Sakshi

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మరో వలస పక్షి చేరింది. ఆమె చిలక పలుకులు కూడా పలకడం ఆరంభించారు. ఆమె ఎవరో కాదు. నిన్న,మొన్నటి వరకు వైఎస్ఆర్ టీపీ పేరుతో తెలంగాణలో సొంత పార్టీని స్థాపించి, తదుపరి దానిని నడపలేక చేతులెత్తేసి కాంగ్రెస్ లో విలీనం చేసిన వైఎస్ షర్మిల . ఆమె ఏపీ రాజకీయాలలోకి రావడాన్ని తప్పు పట్టనక్కర్లేదు.  ఆమె రాజకీయ ప్రస్తానం గమనిస్తే, ఆమె గతంలో చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకుంటే ఆమె తెలంగాణ రాజకీయాలకే పరిమితం కావాలి. తెలంగాణలోనే పుట్టాను..ఇక్కడే పెరిగాను. ఇక్కడే వివాహం చేసుకున్నాను. తెలంగాణ వారికి కోడలిని ఆమె చెబుతూ ఏపీ  రాజకీయాలతో సంబంధం లేదని అప్పట్లో స్పష్టం చేశారు. అంతేకాదు.. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత వివిధ కేసులలో చార్జీషీట్ లలో ఆయన పేరు చేర్చిన కాంగ్రెస్ పై తీవ్రంగా విమర్శలు చేసేవారు.  కాంగ్రెస్ పై ఉమ్మేయాలని అనేవారు. రాహుల్ గాంధీ తో తన పార్టీకి ఏమి సంబంధం అని ఆమె ప్రశ్నించేవారు. 

✍️అలాంటి వ్యక్తి ,తెలంగాణలో రాజకీయాలు వదలుకుని కాంగ్రెస్ పార్టీ పెద్దల ఒత్తిడి మేరకు ఏపీ రాజకీయాలలోకి వచ్చి పిసిసి అధ్యక్షురాలు అవడం ద్వారా సాధించేదేమిటో తెలియదు. కేవలం వంద రోజుల వలస పక్షిగా మిగిలిపోవడం తప్ప ఏమి చేస్తారన్నది అర్ధం కాదు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తప్ప మిగిలిన పార్టీల నేతలంతా వలస పక్షుల మాదిరి హైదరాబాద్ లోనే నివసిస్తూ, ఏపీ రాజకీయాలు చేస్తుండగా, వారికి ఈమె కూడా తోడు అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ,ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల స్థిర నివాసం హైదరాబాద్ కాగా, కేవలం రాజకీయాల కోసమే ఏపీకి వెళుతుంటారు. అక్కడ వారికి అమరావతి ప్రాంతంలో  సొంత ఇళ్లు కూడా లేవు. ఇప్పుడు షర్మిల కూడా అద్దె ఇల్లు వెతుక్కుని  కాంగ్రెస్ ను నడపాలి. 

✍️వంద రోజులలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ కావాలని ఈమెను ఒత్తిడి చేసి ఏపీ రాజకీయాలకు తీసుకు వచ్చినట్లు అనిపిస్తుంది. తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు తాను ఎట్టి పరిస్థితిలోను ఏపీ రాజకీయాలకు వెళ్లనని చెప్పారు. అప్పుడే తెలంగాణ రాజకీయాలలోకి వెళ్లవద్దని  సోదరుడు జగన్ చెప్పినా వినిపించుకోలేదు. చిత్రం ఏమిటంటే తెలంగాణ వ్యక్తిని అని చెప్పుకున్న వ్యక్తిని ఏపీకి కాంగ్రెస్ తీసుకు వచ్చి పార్టీ అధ్యక్షురాలిని చేయడం. ఇదంతా గమనిస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరోక్షంగా సహకరించారు. దానికి ప్రతిఫలంగా తెలుగుదేశంకు ఏపీలో పరోక్షంగా సహకరించడానికి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు షర్మిలను రంగంలో దించినట్లు అనిపిస్తుంది. ఆంద్రజ్యోతి ఎమ్.డి. రాధాకృష్ణ రాజకీయ ట్రాప్ లో షర్మిల, ఆమె భర్త అనిల్ పడ్డారంటేనే తెలుగుదేశం గుప్పిట్లోకి వెళ్లినట్లు లెక్క. ఎందుకంటే రాధాకృష్ణ, చంద్రబాబులు వేర్వేరు అని ఎవరూ అనుకోరు. 

✍️ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కెవిపి సొంత మనిషిగా భావించే గిడుగు రుద్రరాజును నియమించినప్పుడే అనుమానం వచ్చింది. రుద్రరాజు రాష్ట్రపార్టీని నడపగలుగుతారా?లేదా?అన్నదానితో నిమిత్తం లేకుండా నియమించి, ఆ తర్వాత ఆయనను తప్పించి షర్మిలకు బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ లో దశాబ్దాల తరబడి నేతలుగా ఉండి పలుమార్లు మంత్రులుగా, ఎమ్.పిలుగా పదవులు అనుభవించిన కెవిపి రామచంద్రరావు, చింతా మోహన్ ,పల్లంరాజు వంటి వారికి ఈ బాధ్యత అప్పగించకుండా షర్మిలను పనికట్టుకుని తీసుకురావడంలోనే కుట్ర కోణం కనిపిస్తుంది. షర్మిల వస్తే జగన్ కు మద్దతు ఇచ్చే కొన్ని వర్గాలలో చీలిక వస్తుందని, తద్వారా చంద్రబాబుకు ప్రయోజనం కలుగుతుందని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించి ఉండాలి. దానికి తగినట్లుగానే చంద్రబాబు కొన్ని రోజుల క్రితం కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డికె శివకుమార్ తో మంతనాలు జరపడం కూడా ఈ విషయాలకు బలం చేకూరింది.

✍️ వంద రోజుల్లో ఎన్నికలు పూర్తి అయిన తర్వాత , షర్మిలకు కాంగ్రెస్ పార్టీ ఏమైనా గుర్తింపు ఇస్తుందా అన్నది అనుమానమే. ఒకవేళ అలాంటి ఆలోచన ఉండి ఉంటే కర్నాటక నుంచి ఆమెను రాజ్యసభకు పంపుతారని అప్పట్లో జరిగిన ప్రచారం ప్రకారం పదవి ఇచ్చి ఉండాలి. కాని అలా ఇవ్వలేదు. అంటే కేవలం ఆమెను మభ్య పెట్టడానికి ఆ ప్రచారం చేసి ఉండవచ్చు. ఎపిలో జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ కు ఈమె వల్ల పెద్దగా కలిసి వచ్చేది ఉండదు. ఆ ఒక్క శాతం ఓట్లే పడతాయి. ఆమె ఎంపీగా పోటీచేస్తారా?లేదా?అన్నది ఇంకా తెలియవలసి ఉంది. అలా చేసినా ఓటమిపాలైతే కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈమెకు విలువ ఇవ్వడం తగ్గిస్తుంది. దాంతో ఈమెకు విరక్తి కలిగి వంద రోజుల తర్వాత తిరిగి తెలంగాణకు వచ్చేసే అవకాశం  ఉంటుంది. ఎందుకంటే ఈమె మాట మీద నిలబడతారన్న గ్యారంటీ లేదు. పాలేరు నియోజకవర్గంలో పోటీచేస్తానని ప్రమాణం చేసిన ఆమె ఆ మాటకు కట్టుబడి ఉండలేకపోయారు. 

✍️పైగా ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ తనవల్లే ఓటమిపాలయ్యారన్నట్లుగా అతిశయోక్తులతో మాట్లాడుతూ భ్రమలో  ఉంటున్నారు. ఈ నేపధ్యంలో పీసీసీ బాధ్యతలు తీసుకుంటూ చేసిన ప్రసంగం కూడా విషయ పరిజ్ఞానం లేకుండా, కొంత అజ్ఞానంతో మాట్లాడినట్లు అనిపిస్తుంది. ఉదాహరణకు పోలవరం ప్రాజెక్టు వైఎస్ మరణం తర్వాత ఒక్క అడుగు ముందుకుపడలేదని అన్నారు. ఆమె పోలవరం ప్రాజెక్టు  వద్దకు వెళ్లి చూసి మాట్లాడితే మంచిది. జగన్ అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టుకు నలభై ఎనిమిది గేట్లు పెట్టడం జరిగింది. డయాఫ్రం వాల్ సమస్య లేకపోతే ఈపాటికి పూర్తి అయ్యేది. అలాగే తన సోదరుడిని పట్టుకుని క్రైస్తవ వ్యతిరేకి అని అనడం కేవలం ఆ వర్గం ఓటర్ల లో వ్యతిరేక భావం పెంచడానికే అని అర్ధం చేసుకోవడం కష్టం కాదు. తెలుగుదేశం పత్రికలు ఆ పాయింట్ కు అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రచారం చేశాయంటేనే ఆ విషయం తేటతెల్లం అవుతుంది.మణిపూర్ లో జరిగిన హింసాకాండపై పార్లమెంటు ఉభయ సభలలో  వైఎస్సార్‌సీపీ ఎంపీలు తీవ్రంగా ఖండించారు. 

✍️అయినా ఆమె మణిపూర్ అంశాన్ని స్వార్ద రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం శోచనీయం. ఏపీలో ఏమీ జరగలేదని అసత్య ప్రచారానికి షర్మిల పరిమితం అయ్యారు. ఏదో మొక్కుబడిగా చంద్రబాబుపై విమర్శలు చేస్తూ, ముఖ్యమంత్రి జగన్ పై మాత్రం ఘాటైన వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆమెలో ఉన్న దురుద్దేశాన్ని బయటపెట్టుకున్నారు. ఇదంతా తెలుగుదేశం లేదా ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా స్క్రిప్ట్ అన్న విషయం తెలిసిపోతుంది. తెలంగాణలో ఏమైనా కొంచెం అయినా సఫలం అయి ఉంటే షర్మిల ఏపీ రాజకీయాలను కొంత ప్రభావితం చేసే అవకాశం ఉండేది. అలాకాకపోవడంతో ఏపీలో అడుగూడిపోయిన కాంగ్రెస్ ను ఈమె ఉద్దరించేది ఏమి ఉండదు. కేవలం పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి మేలు చేయాలన్న కాంగ్రెస్ పార్టీ కుట్రలో ఈమె పావుగా మిగలడం తప్ప సాధించేది ఏమీ ఉండదు. అందుకే వందరోజుల వలస పక్షి అని చెప్పవలసి వస్తుంది.

-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్‌ పాత్రికేయులు

Advertisement
Advertisement