ఆల్రెడీ ఈ సినిమా అట్టర్ ప్లాఫ్ కదా! | Sakshi
Sakshi News home page

ఏపీ రాజకీయాల్లో సినిమా.. ఆల్రెడీ అట్టర్ ప్లాఫ్ కదా!

Published Fri, Feb 23 2024 12:12 PM

Kommineni Srinivasa Rao Fires on 73 Years Shameless Chandrababu - Sakshi

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సినిమా భాష మాట్లాడుతున్నారు. జగన్ రెడ్డీ.. నీ సినిమా అయిపోయింది.. కాస్కో..అసలు సినిమా ఇప్పుడే మొదలైంది.. ఇది చంద్రబాబు కొద్ది రోజుల క్రితం   చేసిన ఒక వ్యాఖ్య. దీనిని టీడీపీ మీడియా ప్రముఖంగా ప్రచురించి మురిసిపోయింది. ఐదేళ్లుగా ఎదురు లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతూ జనంలోకి వెళుతున్న జగన్ సినిమా అయిపోయిందని ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు అనడం ఏమిటా అని ఆశ్చర్యం కలగవచ్చు. అది ఆయన  స్టైల్. ఆయనకు తన సినిమా అయిపోవచ్చిందని తెలుసు. అయినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడంలో దిట్ట. దానికి కారణం ఆయనకు ఈనాడు,ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా అనైతిక అండ ఉండడమే .

వారు ఏపీపై ద్వేషంతో విషం వెదజల్లుతుండడమే. ఆ అనైతిక బంధం పనిచేయకపోతుందా! ఆ మీడియా  కక్కుతున్న విషం ఎక్కకపోతుందా అన్న కొద్దిపాటి ఆశమాత్రమేనని వేరే చెప్పనవసరం లేదు. చంద్రబాబు టీడీపీ 2012 లోనే ఖాళీ అయిపోయింది. అప్పట్లో పద్దెనిమిది ఉప ఎన్నికలు వస్తే ఒక్కచోట కూడా టీడీపీ గెలవలేదు.పైగా పలుచోట్ల డిపాజిట్లు కోల్పోయింది. అప్పట్లో వచ్చిన అవిశ్వాస తీర్మానం ఆమోదం పొంది ఉంటే వెంటనే ఎన్నికలు వచ్చేవి. చంద్రబాబు సినిమా అయిపోయి ఉండేది. కాని అక్కడ కాంగ్రెస్ తో కుమ్మక్కై, కిరణ్‌ కుమార్ రెడ్డి  ప్రభుత్వం పడిపోకుండా చంద్రబాబు కాపాడారు. తదుపరి 2014నాటికి  ఎలాగొలా నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్‌ వంటివారిని బతిమలాడుకుని, పొత్తు పెట్టుకుని, లక్ష కోట్ల రుణాలను మాఫీ చేస్తామని అబద్దపు ప్రచారం చేసి ప్రభుత్వంలోకి వచ్చారు. కానీ ఆయన చేసిన వాగ్దాలన్నీ మోసపూరితమేనని ప్రజలు అర్ధం చేసుకోవడానికి ఎక్కువకాలం పట్టలేదు.

.. దానిని కప్పిపుచ్చుకోవడానికి రాజధాని నిర్మాణం  పేరుతో కొత్త సినిమా కొంత కాలం ఆడించారు. అంతకుముందు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో ఓటుకు నోటు కేసులో పట్టుబడడంతో అక్కడ నుంచి పారిపోవల్సి వచ్చింది. ఈ కేసుతో కూడా చంద్రబాబు సినిమా అయిపోవాలి. కాని కేంద్రంలో ఉన్న తన మద్దతుదారుల అండతో, న్యాయ వ్యవస్థలోని కొందరు ప్రముఖుల సహాయ సహకారాలతో  కేసు తనపై నేరుగా రాకుండా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ను మేనేజ్ చేసుకోగలిగారు. ప్రజలు వీటన్నిటిని గమనించారు. అందువల్లే 2019 శాసనసభ ఎన్నికలలో ఆయన సినిమా ఫ్లాఫ్ అయిపోయింది. కేవలం 23 శాసనసభ స్థానాలకే పరిమితం చేశారు.ఈ ఎన్నికల తర్వాత రాజ్యసభలో నలుగురు టీడీపీ ఎంపీలను బీజేపీలోకి పంపి అక్కడ తన పార్టీ సినిమా క్లోజ్ అవడానికి చంద్రబాబే శ్రీకారం చుట్టారు. మిగిలిన ఒక్క ఎంపీల టరమ్ ముగియడంతో రాజ్యసభలో ఒక్కరు కూడా లేకుండా  ఖాళీ అయింది.

ఎందుకంటే 23 మంది ఎమ్మెల్యేలతో రాజ్యసభకు ఒక్క సీటు కూడా గెలుచుకోలేరు కనుక. కొద్ది రోజుల క్రితం ఈనాడు రామోజీరావు ఏమి రాయించారో గుర్తుకు తెచ్చుకోండి. వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సీట్ల సర్దుబాట్లు, మార్పులు,చేర్పులు చేస్తున్నారని, దాంతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పలువురు టీడీపీకి మద్దతు ఇచ్చేలా ఉన్నారని ఆయన వణికిపోతున్నట్లు ఒక పిచ్చ కధనాన్ని వండి జనం మీదకు వదలింది. చంద్రబాబు అలాంటి కుట్రలు చేయడంలో దిట్టే కనుక ఏమైనా మళ్లీ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే యత్నం జరుగుతోందా అన్న సందేహం వచ్చింది. కాని అది అంత తేలిక కాదని అర్ధం చేసుకుని తోక ముడిచారు.

రామోజీ కూడా  దీనిపై నోరు మూసుకుని కూర్చున్నారు. ఎన్నికలలో పోటీచేయడానికి వణికింది చంద్రబాబే అని తేలిపోయింది కదా! అయినా ఈనాడు మీడియా ఎందుకు రాయలేదంటే అది వారి దిక్కుమాలిన జర్నలిజం అన్నమాట. దీంతో రాజ్యసభ లో టీడీపీ సినిమా అయిపోయింది. ఇదే కాదు. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తామని పలుమార్లు చంద్రబాబు డాంబికాలు పలికేవారు.తన కుమారుడు లోకేష్ తెలంగాణ పార్టీ ఇన్ చార్జీగా ఉంటారని గతంలో చెప్పారు. కాని ఆయన ఏమి చేశారో తెలియదు. ఒకరి తర్వాత ఒకరిని పార్టీ అధ్యక్షులుగా పెట్టారు. 2023 శాసనసభ ఎన్నికలలో పోటీ చేయవద్దని చంద్రబాబు అంటున్నారని, తాను పార్టీ కోసం కోట్లు ఖర్చు చేస్తే ,ఇలా ముంచేశారని ఆనాటి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ వాపోయారు. తదుపరి ఆయన పార్టీని వదలివేసి తనదారి తాను చూసుకున్నారు. అంతే తెలంగాణలో కాంగ్రెస్ కు పరోక్షంగా మద్దతు ఇవ్వడానికి సొంత టిడిపికే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. దాంతో తెలంగాణలో టీడీపీ సినిమా ముగిసిపోయింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 90 శాతం అనుకూల ఫలితాలు సాధించడంతో టీడీపీ సినిమా ఆ స్థాయిలో కూడా ముగిసిపోయింది.

ఏపీలో ఏ శాసనసభ,లోక్ సభ  ఉప ఎన్నిక జరిగినా కనీసం పోటీచేయడానికి కూడా టీడీపీ భయపడింది.అంటే ఎవరి సినిమా ఫ్లాప్ అయిపోయినట్లు?చంద్రబాబు తనకు అంత సీన్ ఉండి ఉన్నట్లయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంటపడో,ట్రాప్ చేసో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు.అది చాలదన్నట్లు అసలు ఎపిలో ఒక్క శాతం ఓట్లు కూడా లేని బీజెపీతో అంటకాగడానికి ఎందుకు నానా పాట్లు పడుతున్నట్లు! వచ్చే శాసనసభ ఎన్నికలలో టిడిపి పరాజయం చెందితే పార్టీ భవిష్యత్తు పూర్తిగా ముగిసిపోతుందన్న భయంతోనే ఇలాంటి కొత్త,కొత్త డైలాగులను ప్రజలపై వదలుతున్నారు. మరి అదే జగన్ విషయం చూస్తే ఏమి అనిపిస్తుంది?ఆయన తనకు ఆటుపోట్లు ఎదురైనా,ఎక్కడా తొణకకుండా, బెణకకుండా ముందుకు సాగారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో  విభేదాలు వస్తే ధైర్యంగా ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో 5.45 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు.

దాంతో సోనియాగాంధీ,చంద్రబాబు కుమ్మక్కై అక్రమ కేసులు పెట్టించి, పదహారు నెలలపాటు జైలులో పెట్టించినా జగన్ ఎన్నడూ భయపడలేదు. జైలులో ఉండి కూడా ఉప ఎన్నికలలో తన తఢాఖా చూపించారు. అనూహ్యంగా 2014లో ఓటమి ఎదురైనా,67 సీట్లు సాధించి  విపక్షంలో గట్టిగా నిలబడ్డారు. 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసినా ఏ మాత్రం లెక్క చేయకుండా జనంలోకి వెళ్లి వారి ఆదరణ చూరగొని 151 సీట్లు గెలుచుకుని తఢాఖా చూపించారు. ఆ తర్వాత జగన్ తను ఇచ్చిన హామీలను దాదాపు పూర్తిగా అమలుచేసి జనం ముందుకు వస్తుంటే ఆయన సినిమా అయిపోయిందట.. కాస్కో.. అసలు సినిమా ఇప్పుడే మొదలైందట..చంద్రబాబుకు అంత ధైర్యం ఉంటే ఒక మాట చెప్పాలి.

2014-19 మధ్య ఫలానా గొప్ప పని చేశానని, మళ్లీ అదే తరహా పాలన ఇస్తానని ఎందుకు చెప్పలేకపోతున్నారు! జన్మభూమి కమిటీల పాలన తెస్తానని ఎందుకు అనలేకపోతున్నారు? జగన్ పెట్టిన స్కీములను ఇంకా అధికంగా ఇస్తామని ఎందుకు ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ కాదు..జగన్ ఒక్క మాట చెబుతున్నారు. తన ప్రభుత్వం వల్ల మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి అని సాహసోపేతంగా అడుగుతున్నారు.అలా ఎప్పుడైనా చంద్రబాబు చెప్పారా? చెప్పగలరా? దీనిని బట్టే ఎవరి సినిమా అయిపోయింది..ఇట్టే తేలిపోవడం లేదూ!


కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్‌ పాత్రికేయులు
 

Advertisement
Advertisement