‘అది ఓ ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా?’ | Sakshi
Sakshi News home page

‘అది ఓ ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా?’

Published Wed, Mar 13 2024 11:43 AM

Kommineni Srinivasa Rao Reaction On CM Revanth Reddy Comments - Sakshi

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాంబుల భాష వాడడం అంత బాగోలేదని చెప్పాలి. 'ఎవడన్న టచ్ చేసి చూడండి.. మా పాలమూరు బిడ్డలు అగ్ని కణితలైతరు. మానవ బాంబులైతరు..ఎవడన్నా మిగుల్తాడేమో నేను చూస్తా"అని రేవంత్ హెచ్చరించారు.ఆ తర్వాతత మరో సభలో ఫామ్ హౌస్ ఇటుకలు కూడా మిగలవని అన్నారు. రేవంత్ కు ఎందుకు ఇంత అసహనం. కేవలం ప్రజల సానుభూతి కోసమే ఈ ప్రయత్నమా? లేక నిజంగానే ఆయన ప్రభుత్వాన్ని ఎవరైనా టచ్ చేస్తారని, తన సీఎం సీటుకు గండం వస్తుందని భయపడుతున్నారా? నిజానికి ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ నుంచి ఎవరూ పార్టీ మారలేదు. పైగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు ఆయనను కలవడం అనుమానంగా ఉంది. అయినా రేవంత్ ఇలా మాట్లాడుతున్నారంటే ఏమని అనుకోవాలి. నిజమే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల ఏర్పాటు, అసమ్మతి, ప్రభుత్వాలు పడిపోవడం జరుగుతోంది. అదేమి కొత్త విషయం కాదు. దానిని సమర్ధించడం లేదు.

కాని తన ప్రభుత్వాన్ని టచ్ చేస్తే పాలమూరు బిడ్డలు మానవ బాంబులు అవుతారని అనడం మాత్రం అభ్యంతరకరం. మీ రాజకీయ క్రీడలోకి సామాన్య కార్యకర్తలను లాక్కురావడం దేనికో తెలియదు. విశేషం ఏమిటంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఆనాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఎమ్మెల్సీ ఎన్నికలలో నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి వెళ్లి రేవంత్ అరెస్టు అయ్యారు. అప్పుడు అదంతా కుట్ర అని రేవంత్ చెబుతారు. అది కుట్రనా , కాదా, అన్నది పక్కనబెడితే ఏభై లక్షల నగదు ఎందుకు ఆ ఎమ్మెల్యే వద్దకు తీసుకు వెళ్లారో వివరణ ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకా ఈ కేసు కోర్టు విచారణలోనే ఉంది.అయినా అదృష్టవశాత్తు రేవంత్ ముఖ్యమంత్రి స్థాయికి రాగలిగారు. అంతవరకు సంతోషమే. కాని ఇప్పుడు ఇలా మాట్లాడడం పద్దతి అనిపించదు. నిజంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ కు రేవంత్  ప్రభుత్వాన్ని పడగొట్టే అంత సీన్ ఉన్నట్లు కనిపించదు. 

బీజేపీ వారు పార్లమెంటు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని ప్రచారం చేస్తున్నప్పటికి అది అంత తేలిక కాదు. అదేదో రాజకీయ విమర్శ మాదిరి, పార్లమెంటు ఎన్నికలలో లబ్ది పొందడానికి ఎవరికి వారు ఆరోపణలు చేసుకుంటూ కధ నడుపుతున్నారు. ఎప్పుడు రేవంత్ ప్రభుత్వానికి చిక్కులు వస్తాయి?తెలంగాణలో కాంగ్రెస్ కు ఉన్న మెజార్టీ కేవలం నాలుగు సీట్లే. మిత్రపక్షం సిపిఐ కి ఉన్న మరో సీటు కూడా కలిపితే ఐదు సీట్ల మెజార్టీ ఉన్నట్లు. కేసీఆర్ 2014లో  అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మూడు సీట్ల మెజార్టీనే వచ్చింది. ఓటు కు నోటు కేసు తర్వాత ఆయన పలువురు  ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ లోకి లాగారు.

అది విమర్శలకు గురైనా ఆయన అదే రీతిలో ముందుకు వెళ్లారు. 2018లో మంచి మెజార్టీతో కెసిఆర్ అదికారంలోకి వచ్చినా మళ్లీ అదే పద్దతి అవలంభించారు.దాని వల్ల కేసీఆర్ కు కొంత అప్రతిష్ట వచ్చింది. 2014లో కాంగ్రెస్ కు 21సీట్లు,  టీడీపీ,బీజేపీ కూటమికి 20 సీట్లు రావడం వల్ల కేసీఆర్ కు అంత ఇబ్బంది రాలేదు. 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు కూడా అదే  తరహా కంపోజిషన్ ఉందని చెప్పాలి. బీఆర్ఎస్ కు 39 సీట్లు వస్తే, బీజేపీకి ఎనిమిది, ఎంఐఎంకు ఏడు సీట్లు వచ్చాయి. బీఆర్ఎస్ , బీజేపీ కలిసినా నలభైఏడు సీట్లే అవుతాయి.కాని ఇప్పటికిప్పుడు ఈ రెండు పార్టీల మద్య అవగాహన కుదిరే అవకాశం కనిపించడం లేదు. ఒకవేళ కలిసినా ఆ సంఖ్యతో కాంగ్రెస్ కు  ధ్రెట్ అవడం కష్టం.  ఎంఐఎం నేరుగా బీజేపీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి ఉండక పోవడం కూడా కాంగ్రెస్ కు కలిసి వస్తుంది.

బీజేపీ మినహా  ఎవరు అధికారంలో ఉంటే వారివైపు వెళ్లడానికి ఎంఐఎం  ప్రాధాన్యత ఇస్తుంటుంది.ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసిని ప్రోటెం స్పీకర్ ను చేయడం, లండన్ పర్యటనకు ఆహ్వానించడం తదితర చర్యల ద్వారా ఆ పార్టీవారిని తమ వైపు అవసరమైతే ఉండేలా కాంగ్రెస్ జాగ్రత్తపడుతోంది. అయినా రేవంత్ ఎందుకు సీరియస్ ప్రకటనలు చేస్తున్నారు?అంటే పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ కు ఆశించిన సీట్లు రాకపోతే  సొంత పార్టీలోనే కొత్త కుంపట్లు వస్తాయని ఆయన  భయపడుతుండవచ్చు.దానిని దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచి తనకు అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని  కూడగట్టుకునే యత్నం చేస్తున్నారనుకోవాలి.అలాగే పార్లమెటు ఎన్నికలలో కరువు, నీటి సమస్య,  నెరవేరని హామీలు  చర్చకు రాకుండా రేవంత్ ఈ మానవ బాంబుల భాష వాడి ఉండవచ్చు. 

రేవంత్ అక్కడితో ఆగలేదు..ఒక్కొక్కడిని పండబెట్టి తొక్కి పేగులు తీస్కొని మెడల వేస్కుని ఊరేగుతాం బిడ్డా ఎవడన్నా ఈ ప్రభుత్వం మీదకు వస్తే.. .అంటూ తీవ్రంగా హెచ్చరింకలు చేశారు. కొద్ది రోజుల క్రితం ప్రతిపక్షనేత ,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యల ఆధారంగా రేవంత్ మాట్లాడి ఉండవచ్చు.వచ్చే పదేళ్లు అధికారంలో ఉంటామని విశ్వాసం వ్యక్తం చేస్తున్న ఆయన మానవ బాంబుల గురించి ప్రస్తావించవలసిన అవసరం ఏమి ఉంటుంది?ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఎవరైనా సామాన్య కార్యకర్త తొందరపడితే ఎంత ప్రమాదం!దానికి రేవంత్ బాధ్యత వహిస్తారా? తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక నాయకుడు పెట్రోల్ పోసుకోబోతున్నట్లు ప్రయత్నించిన సన్నివేశంపై ఎన్ని విమర్శలు వచ్చాయో అందరికి తెలుసు. ఆ తర్వాత మరికొందరు అదే ప్రయత్నం చేశారు.

 చివరికి శ్రీకాంతాచారి ఆ నిప్పుకే బలైపోయారు.ఎంత దారుణం. మానవత్వం ఉన్నవారెవరూ ఇలాంటివాటిని సమర్ధించరాదు.రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో  కొంత ఆవేశంగా మాట్లాడేవారు. కొన్నిసార్లు ఆంద్రులను ఉద్దేశించి కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అదంతా గతం.ఇంకో సంగతి చెప్పాలి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మానవ బాంబుకే బలైపోయారు.అది అత్యంత దురదృష్టకర ఘటన . శ్రీలంక ఉగ్రవాదులు చేసిన ఘాతుకం అది.దేశంలో పలువురు ప్రముఖులు బాంబులు పేలిన ఘటనలలో మరణించారు. వాటి గురించి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు ప్రస్తావించడం ఏ మాత్రం సహేతుకం కాదని స్పష్టంగా చెప్పాలి. ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ ప్రముఖ నేతలు ఎవరూ రేవంత్ కు వ్యతిరేకంగా మాట్లాడడం లేదు.

 ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి ఫోటో లేకుండా ప్రచార ప్రకటనలు వస్తున్నా ఆయన కూడా నోరెత్తలేదు. అలాగే మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి కూడా రేవంత్ కు అసమ్మతిగా మారలేదు. కాస్తా,కూస్తో గతంలో రేవంత్ కు పార్టీలో ప్రత్యర్ధిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు మంత్రి అయిన తర్వాత తన బాణీ మార్చుకున్నారు. రేవంత్  ను తెగ పొగుడుతున్నారు.అందువల్ల రేవంత్ కు వచ్చిన తక్షణ ప్రమాదం కనిపించదు. అయితే కాంగ్రెస్ రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. మరో వైపు రేవంత్  ప్రధాని మోడీని బడా బాయి అని అనడం ఆధారంగా బిఆర్ఎస్ నేత కెటిఆర్ తదితరులు విమర్శలు గుప్పించారు. ఇందులో రేవంత్ ను పెద్దగా తప్పు పట్టనక్కర్లేదు. ప్రధానిని గౌరవించడం సంస్కారమే.కాని మరీ బంధం ఎక్కువగా ఉందేమో అన్న చందంగా పద ప్రయోగం చేస్తే కాంగ్రెస్ లోనే అనుమానం రావచ్చు. అందుకే ఆ తర్వాత  మోడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా అంత సముచితంగా లేవు.

 కాగా కేసీఆర్ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌ తో ఒప్పందం చేసుకోవడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. దీనిపై రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లు  ఘాటైన విమర్శలే చేశారు. పదేళ్లు మాదిగలను వంచించి మోసగించిన దొర దగ్గరకు వెళ్లడం ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ కు న్యాయమా?అని రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్ ఆశ్చర్యకరమైన రీతిలోనే బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారని చెప్పాలి. దీని వల్ల ఆయన పార్టీ బలహీనపడిందన్న సంకేతాన్ని ఇచ్చినట్లయింది. బహుశా దళిత ఓట్లను ఆకర్షించడానికి ఈ పొత్తు పెట్టుకుని ఉండవచ్చు. అధికారంలో ఉన్నప్పుడు సిపిఐ,సిపిఎం వంటి పార్టీలతో వ్యవహరించిన తీరు విమర్శలకు గురి అవుతుండేది. 

మునుగోడు ఉప ఎన్నికలో వామపక్షాల  మద్దతు తీసుకుని, సాధారణ ఎన్నికలలో వారిని పట్టించుకోకపోవడం వల్ల కేసీఆర్ కు నిలకడ లేదన్న అభిప్రాయానికి తావిచ్చారు. ఇప్పుడు బిఎస్పితో ఎంతకాలం పొత్తు ఉంటుందన్నది చూడాలి. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి అయినా, మరొకరు అయినా బాంబుల భాష వాడకుండా ఉంటే మంచిది. ప్రస్తుత రాజకీయ వేడిలో ఇలాంటి హితోక్తిలను నేతలు వినే పరిస్థితి ఉండడం లేదు. అయినా మనం చెప్పవలసింది చెప్పాలి.


– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Advertisement
Advertisement