KSR Comments On Priyanka Gandhi Saroor Nagar Nirudyoga Sabha, Details Inside - Sakshi
Sakshi News home page

Priyanka Gandhi Nirudyoga Sabha: కాంగ్రెస్‌కు ప్రియాంకానే ఆశా కిరణం కానున్నారా?

Published Tue, May 9 2023 10:15 AM

KSR Comment On Priyanka Gandhi Saroor Nagar Sabha - Sakshi

హైదరాబాద్‌లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పాల్గొన్న సభ విజయవంతం అయిందనే చెప్పవచ్చు. ఆమె ఆహార్యం, ప్రసంగం చేసిన తీరు అన్ని గమనిస్తే క్రమంగా ఆమె తన నానమ్మ , మాజీ ప్రధాని ఇందిరాగాందీని అనుకరించడానికి సిద్దం అవుతున్నట్లుగా అనిపిస్తుంది. యువ సంఘర్షణ పేరుతో ఏర్పాటు చేసిన ఈ సభలో యూత్ డిక్లరేషన్‌ను ఆమె ప్రకటించారు. ఇవన్ని తెలంగాణ కాంగ్రెస్ రూపొందించినవే  అయినా, ఆమె స్పీచ్ ప్రదానంగా ఇక్కడి పార్టీ బాద్యులు తయారు చేసి ఇచ్చిందే అయినా ఆమె సభికులను ఆకట్టుకునేలా ఉపన్యసించగలిగారు.

వచ్చిన కాంగ్రెస్ అభిమానులు కూడా ఆమె ప్రసంగాన్ని శ్రద్దగానే ఆలకించడం, ఆయా సందర్భాలలో స్పందించడం గమనిస్తే ఆ పార్టీకి ప్రస్తుతం ఆమే ఆశాకిరణం అవుతుందా అన్న భావన కలుగుతుంది. ఈ సభలో రెండు రకాల సెంటిమెంట్లు ప్రయోగించడంతో పాటు, యువతను ఆకట్టుకునే ఐదు పాయింట్ల డిక్లరేషన్ ను ప్రకటించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ఒకటికి,రెండుసార్లు గుర్తు చేయడం ద్వారా గతంలో ఆమెకు ఉన్న ప్రజాకర్షక శక్తిని ప్రియాంక రూపంలో మళ్లీ సాదించాలన్నది ఒక సెంటిమెంట్ అయితే, తెలంగాణ ఉద్యమం, బలిదానాలు, రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ ప్రదాన పాత్ర గురించి చెప్పడం ద్వారా తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలించడానికి యత్నించారు.

రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం తో పాటు ఈ సెంటిమెంట్లను, యువతను ఆకర్షించే  తాయిలాలను కూడా ప్రకటించారు. పిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ సభకు ప్రియాంక గాంధీని రప్పించడం ద్వారా కాంగ్రెస్ కు కొత్త ఆకర్షణ తేవడంలో కొంత సఫలం అయ్యారనుకోవాలి. నిజానికి ప్రియాంక గాంధీని ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితమే రాజకీయాలలోకి తేవాలన్న డిమాండ్ ఉండేది. ఆమె అయితే ఇందిరాగాంధీ పోలికలు కలిగి ఉంటారని ,తద్వారా రాజకీయంగా లబ్ది కలుగుతుందని అప్పట్లో కొందరు కాంగ్రెస్ నేతలు వాదించేవారు. ఆ రోజులలో యువతిగా ప్రియాంక గాందీ మరింత గ్లామరస్ గా కనిపించేవారు. నెహ్రూ, ఇందిర కుటుంబ వారసురాలిగా ఆమెకు  సత్వరమే గుర్తింపు వచ్చేది. 

కాని ఎందువల్లో సోనియా గాంధీ అందుకు సుముఖత చూపలేదు. ఆమె తన కుమారుడు రాహుల్ గాందీ వైపే మొగ్గు చూపారు. దానికి తోడు 2004లో కాంగ్రెస్ ఆద్వర్యంలోని యూపీఏ కూటమి అదికారంలోకి రావడంతో ప్రియాంక ప్రాధాన్యతను మరింత తగ్గించారు. ఆమె కూడా కుటుంబ విషయాలకే పరిమితం అయ్యారు. ఈ టైమ్ లో సోనియాగాంధీ స్వయంగా అధికారాన్ని చేపట్టకపోయినా,  శక్తిమంతమైన నేతగా చక్రం తిప్పేవారు. పేరుకు మన్మోహన్ సింగ్ ప్రధాని అయినా, అధికారాలన్నీ తన గుప్పిట్లోనే పెట్టుకునేవారని అంటారు.

అదే టైమ్ లో రాహుల్ గాంధీ ఎంపీగా ఉన్నప్పటికీ, ఆశించినంత యాక్టివ్గా కనిపించేవారు కారు. ఆయన తరచు విదేశాలలో విహార యాత్రలకు వెళుతుండేవారు.ప్రధానిగా బాద్యతలు చేపట్టాలని పార్టీ నాయకులు కోరినా ఆయన అంగీకరించలేదు. అదే సమయంలో ప్రభుత్వంపై అనధికారికంగా పెత్తనం చెలాయిస్తున్నట్లు కనిపించేవారు.

ఉదాహరణకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక ఆర్డినెన్స్ కాపీని మీడియా ముందు చించివేయడం వివాదం అయింది. సొంత ప్రభుత్వాన్ని ఆయనే అవమానించుకున్నారు. అప్పటి ఆర్డినెన్స్ ను రాహుల్ అలా చేయకుండా ఉంటే, ఇప్పుడు రెండేళ్ల జైలు శిక్ష పడినా వెంటనే తన ఎమ్.పి పదవి కోల్పోయేవారుకారు. అలా అంత తెలివిగా వ్యవహరించలేదన్న అభిప్రాయం రాహుల్ పై ఏర్పడింది. తదుపరి ప్రతిపక్షంలోకి వచ్చాక కేంద్రంలో వరసగా రెండోసారి అదికారంలోకి రాలేకపోవడం, పలు రాష్ట్రాలలో అధికారం కోల్పోవడం , మోదీకి ఈయన సరైన ప్రత్యర్ధి కాదన్న భావన కలగడంవంటి కారణాలతో ఆయన వెనుకబడిపోయారు.

ఈ దశలో ప్రియాంక క్రమంగా తెరపైకి రావడం ఆరంభించారు.తొలుత  యూపీలో ఎన్నికల ప్రచారంలో విస్తారంగా పాల్గొన్నా అంత ప్రయోజనం కనిపించలేదు.తదుపరి మాత్రం  హిమాచల్‌ప్రదేశ్‌లో అధికారం వచ్చింది. రాహుల్ కన్నా, ప్రియాంకనే బెటరేమోనని భావించేవారు కాంగ్రెస్ లో చాలామందే ఉన్నారు. తెలంగాణకు వచ్చేసరికి, రాహుల్ ఇక్కడ బాగా పాతబడిపోయారు. ప్రియాంక గాంధీ కొత్తగా రావడంతో కాంగ్రెస్ కు ఒక ఫ్రెష్ ఫేస్ దొరికినట్లయింది. ఆమె కూడా ఏది పడితే అది మాట్లాడకపోవడం  మంచిదే. బిఆర్ఎస్ ప్రభుత్వం తన జాగీరు మాదిరి తెలంగాణను మార్చుకుందని, హామీలను నెరవేర్చలేదని , అప్పులపాలు చేసిందని , ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని ఆమె వివరించారు.

స్పీచ్ లో పంచ్ లు పెద్దగా లేకపోయినా, ఆమె మాట్లాడిన తీరు ఫర్వాలేదనిపించారు.ఇక యూత్ డిక్లరేషన్ చూస్తే ఇటీవలికాలంలో తెలంగాణలో యువతలో ఏర్పడిన అశాంతిని రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకునే యత్నం చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఏకంగా ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆచరణలో ఇది అంత తేలికగా సాద్యమయ్యేది కాదు.బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఇబ్బందులను ఎదుర్కుంటోంది.  నిరుద్యోగులకు పది లక్షల రూపాయల మేర వడ్డీలేని రుణం ఇస్తామని అన్నారు. ఆ రుణం ఎవరిద్వారా ఇప్పిస్తారు? ప్రభుత్వం సొంతంగా ఇస్తుందా? అన్నదానిపై క్లారిటీ లేదు. బిఆర్ఎస్ ప్రభుత్వం పది లక్షల రూపాయల దళిత బందును అమలు చేస్తున్నందున ,దానికి పోటీగా ఈ స్కీమ్ ను తెచ్చినట్లు ఉన్నారు.  తెలంగాణ అమరుల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం, వారసులకు పాతికవేల పెన్షన్ అని చెప్పారు కాని, ఇది కూడా అమలు చేయడంలో ఎన్నో సమస్యలు ఎదురుకావచ్చు. 1969 నాటి ఉద్యమకారుల వివరాలు అన్నీ తెలుసుకోవడమే కష్టం కావచ్చు.

గతంలో టీఆర్‌ఎస్‌ కూడా ఇలాగే తెలంగాణ ఉద్యమకారులకు సాయం చేయడానికి హామీ ఇచ్చింది కాని, తీరా వారిని గుర్తించడానికి ఇబ్బందులు ఎదురవడంతో కేవలం 400 మందికే పరిమితం కావల్సి వచ్చింది.  ఆ సమస్యలను పరిష్కరించుకుని ముందుకు వెళ్లవలసి ఉంటుంది. స్థానికులకు ప్రైవేటు పరిశ్రమల ఉద్యోగాలలో రిజర్వేషన్ అని మరో హామీ ఇచ్చారు. ఆంద్రప్రదేశ్, కర్నాటక వంటి రాష్ట్రాలు ఇప్పటికే ఈ విషయంలో ముందుకు వెళ్లాయి. నిరుద్యోగ యువతకు నెలకు నాలుగువేల రూపాయల బృతి అని కూడా డిక్లరేషన్ లో పెట్టారు. ఇంతకుముందు ఎపిలో చంద్రబాబు నాయుడు, తెలంగాణలో కేసీఆర్‌లు ఈ హామీ ఇచ్చినా, అమలు చేయలేకపోయారు.

మరి కాంగ్రెస్ ఎలా చేయగలుగుతుందన్న ప్రశ్న వస్తుంది. మరో కొత్త హామీ ఏమిటంటే చదువుకునే విద్యార్దినులకు స్కూటీలు ఇస్తామని కాంగ్రెస్ తెలిపింది. ఎందరికి ఇవ్వగలుగుతారు? అందుకు ఎంత వ్యయం అవుతుందన్న విషయాల జోలికి వెళ్లలేదు.  ఇచ్చిన హామీలన్నిటిని  ఎలా అమలు చేస్తామో చెప్పగలిగితే యువతకు,ప్రజలకు నమ్మకం కలుగుతుంది. ఏది ఏమైనా ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు ప్రియాంక దగ్గరవడానికి యత్నించారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఆమె  మరింత క్రియాశీలక పాత్ర పోషించే  అవకాశం ఉన్నట్లు పరోక్షఃగా తెలిపారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీలోని తన ప్రత్యర్ధులపై కాస్త పై చేయి సాధించడానికి ఈ సభ కొంత ఉపయోగపడుతుంది. ఈ మాత్రానికే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేస్తుందన్న గ్యారంటీ రావడానికి ఇంకా సమయం పట్టవచ్చు.  అదే సమయంలో భువనగిరి ఎమ్.పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సభకు గైర్ హాజరవడం ఆసక్తి కలిగించే అంశమే. ప్రియాంక ఈ అసమ్మతి నేతలను కూడా దారిలోకి తేగలుగుతారా? తెలంగాణ ఎన్నికలలో ఎలాంటి భూమిక పోషిస్తారన్న అంశాలపై వేచి చూడాల్సిందే. 


-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

Advertisement
Advertisement