Sakshi News home page

పచ్చ బ్యాచ్‌తో పురంధేశ్వరి కొత్త రాయబారం.. బీజేపీ స్పందనేంటి?

Published Tue, Nov 7 2023 10:39 AM

KSR Comments Over Daggubati Purandeswari And Chandrababu - Sakshi

మెరిసేదంతా బంగారం కాదని అంటారు. అలాగే ఎంతో పద్దతిగా మాట్లాడుతారు అనుకున్నవారంతా అలాగే ఉండాలని లేదు.. అవకాశం వచ్చినప్పుడు ప్రజలలో గౌరవం పొందేవారే గొప్పవారు అవుతారు. ఈ సూక్తులన్నీ ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వ్యవహార సరళి చూసిన తర్వాత ఈ అభిప్రాయానికి రావల్సి వస్తోంది. 

గతంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ కుమార్తెగా ఆమె రాజకీయాల్లోకి రాకుండా కుటుంబ వ్యవహారాలు చక్కగా చూసుకునేదని అనేవారు. ఆమె భర్గ దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాలలో బిజీగా ఉన్నా ఈమె పెద్దగా జోక్యం చేసుకున్నట్లు కనిపించేవారు కారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు నాయుడుతో సహా కుటుంబ సభ్యులంతా కలిసి పదవి నుంచి దించేసి ఆయనను ఘోరంగా అవమానించినప్పుడు కూడా ఈమె పాత్రపై భిన్నాభిప్రాయాలు ఉండేవి. అనేక ఇంటర్వ్యూలలో పురంధేశ్వరిని సమర్దిస్తూ చంద్రబాబును నమ్మవద్దని ఆ సమయంలో సలహా ఇచ్చారని దగ్గుబాటి  చెబుతుండేవారు. కానీ, కొందరు మాత్రం ఈమె కూడా కీలక పాత్ర పోషించారని విశ్వసిస్తారు. ఎందుకంటే దగ్గుబాటి ఆ తరుణంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావడానికి ముందు చంద్రబాబు, ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి, కొందరు ఐఎఎస్ అధికారులు, దగ్గుబాటికి సన్నిహితంగా కనిపించే మరికొందరు ప్రముఖులు ఆయన ఇంటి వద్ద చర్చలు జరిపారు.

అప్పుడు ఆమె తన అభిప్రాయాలు గట్టిగా చెప్పి ఉంటే చంద్రబాబు కాకపోయినా, దగ్గుబాటి అయినా కొంత వెనక్కి తగ్గేవారని అంటారు. ఎన్టీఆర్‌ భార్య లక్ష్మీపార్వతి అయితే పురంధేశ్వరి కూడా తండ్రికి అన్యాయం చేసిందని తీవ్రంగానే విమర్శించేవారు. అయినా, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద చాలా మంది పురంధేశ్వరిని ఈ విషయంలో పెద్దగా శంకించేవారు కారు. కానీ, ఇటీవలి కాలంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె వ్యవహార ధోరణి చూశాక, అప్పుడు తండ్రికి వ్యతిరేకంగా కుట్ర చేసిన వారిలో ఈమె కూడా ఉన్నారేమో అన్న భావన కలుగుతుంది. అంతేకాదు వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమా అని రాజకీయాలలోకి వచ్చి కాంగ్రెస్‌లో రెండు సార్లు మంత్రి అయి, రాష్ట్ర విభజన తర్వాత సడెన్‌గా బీజేపీలోకి జంప్ చేసిన తీరు కూడా విమర్శలకు గురి అయింది. అప్పుడే ఈమెకు రాజకీయం అంతగా ఒంటబట్టిందా అన్న ఆశ్చర్యం కలిగేది. ఆ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియాగాంధీ నుంచి కుట్రలు, కుతంత్రాలు చేయడం కూడా బాగానే నేర్చుకున్నట్లుగా ఉన్నారు. 

2011లో ఎంపీగా ఉ‍న్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా సోనియాగాంధీ, చంద్రబాబు నాయుడు కుట్ర చేసి కేసులు పెట్టి జైలుకు పంపించినప్పుడు ఈమె కూడా కాంగ్రెస్‌లోనే ఉన్నారు. అప్పుడు కోర్టును అడ్డం పెట్టుకుని, సీబీఐ అధికారి ద్వారా సీఎం జగన్‌ను ఇబ్బందులు పెట్టినట్లుగా ఇప్పుడు కూడా ఏమైనా చేయాలా అన్న దురాలోచన పురంధేశ్వరి, చంద్రబాబు వంటివారికి వచ్చిందేమో తెలియదు. ఒకప్పుడు ఉప్పు, నిప్పుగా ఉన్న పురంధేశ్వరి, చంద్రబాబు ఎప్పుడు రాజీపడ్డారో తెలియదు కానీ.. ప్రస్తుతం వారిద్దరు గతంలో మాదిరి మరోసారి కుట్ర చేస్తున్నారా అన్న అనుమానం వస్తోంది. 

ముఖ్యమంత్రి జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిలపై విధానపరమైన విమర్శలు చేస్తే ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ, ఆమె టీడీపీ నేతలు రాసిచ్చిన స్క్రిప్టు చదువుతూ, వారు అందచేసిన లేఖలపై సంతకాలు చేసి సుప్రీంకోర్టు ఛీప్ జస్టిస్‌కు పంపిన తీరు చూసిన తర్వాత ఏమనిపిస్తుంది?. కుట్రలు, కుతంత్రాలు చేయడంలో ఈమె కూడా తక్కువగా లేదనిపించదా!. చంద్రబాబుపై వచ్చిన అవినీతి కేసులలో ఆమె మాట్లాడుతున్న తీరు, చంద్రబాబును సమర్ధిస్తున్న వైనం ఆశ్చర్యం కలిగిస్తుంది. అదొక ఎత్తు అయితే, మద్యం విషయంలో విజయసాయి, మిథున్ రెడ్డిలపై ఆరోపణలు చేయడం, అక్కడితో ఆగకుండా చీఫ్ జస్టిస్‌కు అనేక పిచ్చి ఆరోపణలు జత చేస్తూ టీడీపీ తరఫున కుట్రపూరితంగా ఉత్తరం రాయడం మరో ఎత్తుగా ఉంది. అందులో వివేకా హత్య కేసు మొదలు, విశాఖ భూముల కబ్జా అంటూ ఏవేవో టీడీపీ చేసే పచ్చి అబద్దాలన్నింటిని ఆ లేఖలో పేర్కొన్నారు. ఏకంగా సీఎం జగన్, విజయసాయిల బెయిల్ రద్దు చేయాలని చీఫ్‌ జస్టిస్‌ను కోరడమంటే రాజకీయంగా తనకు వచ్చిన హోదాను దుర్వినియోగం చేయడమే. 

అంతేకాదు.. ఇలాంటి ఆరోపణలలో నిజం ఉన్నా, లేకపోయినా, ఒక రాజకీయ పార్టీగా లేఖలు రాయదలిస్తే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులకు రాస్తుంటారు. ఆ పని ఇప్పటికే చేసిన పురంధేశ్వరి అంతటితో సంతృప్తి చెందలేదు. ఏకంగా సుప్రీంకోర్టుకు లేఖ పంపడం ద్వారా ఆమె.. మోదీ ప్రభుత్వాన్ని అవమానించారు. మోదీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్ వంటివారు చేతకానివారన్నట్లుగా ఆమె ప్రవర్తించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చీఫ్‌ జస్టిస్ ఇలాంటి విషయాలలో జోక్యం చేసుకుని ఆయన ఒక పార్టీగా మారతారా?. ఒకవైపు తన మరిది, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవినీతి కేసులో జైలుపాలైతే, ఆయనను విడిపించడానికి, ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడానికి స్వయంగా నారా లోకేశ్‌ను వెంటబెట్టుకుని వెళ్లడం ద్వారా తాను టీడీపీ కోసమే పనిచేస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. 

గత బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును మార్చి ఈమెకు పదవి అప్పగిస్తే టీడీపీవారిని కాషాయపార్టీలోకి తీసుకు వచ్చి బలోపేతం చేస్తారని కేంద్ర నాయకత్వం భావించిందని అంటారు. కానీ, ఆమె అందుకు విరుద్దంగా టీడీపీని నిలబెట్టడానికి , బీజేపీని అందుకోసం వాడుకోవడానికి యత్నించినట్లు అనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్రకార్యవర్గసభ్యుడు సుబ్బారెడ్డి ఆమెను తీవ్రంగా విమర్శించడం విశేషం. పురంధేశ్వరి రాసిన లేఖకు మద్దతుగా ఏపీ బీజేపీలో మరో ప్రముఖ నాయకుడు ఎవరూ ప్రకటన ఇచ్చినట్లు కనిపించలేదు. దానిని బట్టే ఆమెకు పార్టీలో ఎలాంటి పరిస్థితి ఉందో అర్ధం అవుతుంది. విజయసాయిరెడ్డి ఆమెకు సమాధానం ఇస్తూ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆమె పరువు తీసేవిగానే ఉన్నాయి. అయితే, ఆయన ఎక్కడా అభ్యంతర వ్యాఖ్యలు చేయకుండా నర్మగర్భంగా మాట్లాడడం గమనార్హం. అంతేకాకుండా ఆమెపై కూడా ఆయన అవినీతి ఆరోపణలు చేశారు.

హైదరాబాద్‌లో భారీ వ్యయంతో విల్లా కడుతున్న సంగతి చెప్పారు. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణలో ఈమె పాత్రపై అభియోగాలు మోపారు. ఆమె వీటిని ఇంకా ఖండించినట్లు లేరు. నిజానికి చంద్రబాబు నాయుడు.. బీజేపీని, ప్రధాని మోదీని గతంలో నానా రకాలుగా దూషించారు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పుడూ అలా చేయలేదు. కేంద్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తూ , రాష్ట్ర ప్రయోజనాలు సాధించుకోవడానికి యత్నిస్తున్నారు. అయినా టీడీపీకి మద్దతు ఇస్తూ, వైఎస్సార్‌సీపీతో ఘర్షణ పెట్టుకోవడం ద్వారా ఆమె బీజేపీకి మేలు చేస్తున్నారా?. కీడు చేస్తున్నారా అన్నది ఆలోచించాలి. 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉండి కూడా ఆ పార్టీని గంగలో ముంచినట్లుగా చేసి, టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ పురంధేశ్వరి మాట్లాడలేదంటేనే ఆమె రాజకీయంపై అనుమానాలు వచ్చాయి. టీడీపీతో ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలని ఆమె తహతహలాడుతున్నారన్న అభిప్రాయం ఏర్పడుతోంది. నిజానికి ఎలాంటి సిద్దాంతాలు లేని, విలువలు లేకుండా, పార్టీలు ఫిరాయించి వచ్చినవారిని రాష్ట్ర శాఖల అధ్యక్షులుగా పెట్టుకున్న కేంద్ర బీజేపీని ముందుగా అనాలి. గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ అధ్యక్షుడిని చేస్తే ఆయన పలు ఆరోపణలకు గురయ్యారు. ఆ తర్వాత ఏకంగా బీజేపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిపోయారు. ఆ తర్వాత ఆయా పార్టీలు మారి వచ్చిన పురంధేశ్వరికి పట్టం కట్టారు. ఆమె బీజేపీకి కట్టుబడి ఉంటారన్న గ్యారంటీ ఉందా అన్నది సందేహమే.

సొంత మనుషులను వదలి, అద్దె మైకులను కేంద్ర బీజేపీ తెచ్చుకుంటోంది. అందుకు కన్నా లక్ష్మీనారాయణ, దగ్గుబాటి పురంధేశ్వరి ఉదాహరణ అవుతారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె చేస్తున్న నీచ రాజకీయానికి కేంద్ర బీజేపీ పెద్దలు మద్దతు ఇస్తున్నారా అన్నది తేలాలి. ఇప్పటికైతే అలాంటి సంకేతం కనిపించలేదు. అయినా పురంధేశ్వరి తన స్వార్ద ప్రయోజనాల కోసం పార్టీని గాలికి వదిలి టీడీపీని భుజాన వేసుకోవడం వెనుక ఎవరు ఉన్నారో తెలియదు. సాధారణంగా మూడో ప్రత్యామ్నాయంగా ఎదగదలచిన పార్టీ అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీ రెండింటిని విమర్శించాలి. అలాకాకుండా తమ పార్టీ నేతలను అవమానించినవారిని  బలపరచడానికి తహతహలాడుతున్నారంటే దీని వెనుక ఏదో బలమైన కారణమో, లేక ప్రయోజనమో ఉండాలి. ఇవన్ని గమనించిన తర్వాత ఎన్టీఆర్‌ ఆశయాలను ఆయన కుటుంబ సభ్యులే పదేపదే భ్రష్టు పట్టించారనడంలో తప్పేమి ఉంటుంది!.


కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

Advertisement

What’s your opinion

Advertisement