టీకాంగ్రెస్‌లో పాలి‘ట్రిక్స్‌’.. కమ్మ కులంతో కొత్త రాజకీయం! | Sakshi
Sakshi News home page

టీకాంగ్రెస్‌లో పాలి‘ట్రిక్స్‌’.. కమ్మ కులంతో కొత్త రాజకీయం!

Published Thu, Oct 12 2023 11:14 AM

KSR Comments Over Kamma Caste Politics In Telangana - Sakshi

తెలంగాణలో కమ్మ సామాజికవర్గం ప్రతినిధిగా తనను తాను ఫోకస్ చేసుకోవడానికి కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి చాలా కష్టపడుతున్నారు. అందులో భాగంగా ఆమె కాంగ్రెస్ అధిష్టానం వద్దకు కమ్మ జేఏసీ నేతలను కొందరిని తీసుకువెళ్లారు. అక్కడ  వచ్చే శాసనసభ ఎన్నికలలో కమ్మ వర్గానికి పన్నెండు సీట్లను కాంగ్రెస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

1982లో తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఉమ్మడి ఏపీలో రెండు పార్టీల వ్యవస్థ ఆవిర్భవించిందని చెప్పాలి. 1983కి  ముందు కమ్మ వర్గం కూడా కాంగ్రెస్‌తోనే ఉందని గణాంకాలు చెబుతాయి. తదుపరి తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజికవర్గం ఆధిపత్యంలో ఉంటే, కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యంలో ఉన్నట్లు లెక్కలు  వెల్లడిస్తాయి. ఆయా ఎన్నికలలో ఇతర సామాజికవర్గాలను ఎవరు ఆకర్షించగలిగితే ఆ పార్టీ అధికారంలోకి వస్తోంది. రెడ్డి సామాజికవర్గం ఆంధ్ర, తెలంగాణలో రెండు చోట్ల ప్రాముఖ్యత కలిగి ఉంది. కమ్మ వర్గం ప్రధానంగా ఆంధ్రకే  పరిమితమైందని చెప్పాలి. రెడ్డి వర్గం ప్రతీ ఎన్నికలోనూ రెండు ప్రాంతాలలో కలిపి సుమారు ఎనభై నుంచి తొంభై మంది ఎమ్మెల్యేలుగా గెలుస్తుంటే, కమ్మ వర్గం అత్యధికంగా ఆంధ్రలోనే గెలుస్తోంది. 

రెండు ప్రాంతాలలో కలిపి వీరు అత్యధికంగా 1994లో 53మంది, అత్యల్పంగా 2018లో తెలంగాణలో ఐదుగురు, 2019లో ఏపీలో పదిహేడు మంది అంటే రెండు రాష్ట్రాలలో కలిపి ఇరవై రెండు మంది గెలిచారు. 2014లో రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 38 మంది, ఉమ్మడి ఏపీలో 2009లో 27, 2004లో 35, 1999లో 43, 1994లో 53, 1989లో 36, 1985లో 52, 1983లో 51, 1978లో 41, 1972లో 35, 1967లో 41, 1962లో 39 మంది గెలిచారు. అయితే, అప్పటి నుంచి ఇప్పటివరకు తెలంగాణలో మాత్రం కమ్మ వర్గం 1985లో అత్యధికంగా ఎనిమిది మంది నెగ్గారు. మిగిలిన ఎన్నికలలో రెండు  నుంచి ఏడుగురు వరకు మాత్రమే గెలిచారు.  

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కూడా టీడీపీ ఉనికిని నిలబెట్టడానికి ఈ వర్గం యత్నించింది. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసుతో మొత్తం పార్టీ ఇక్కడ కకావికలం అయింది. దాంతో కమ్మ వర్గం వారు ఏ పార్టీకి అధికారం వస్తే అటువైపు మొగ్గు చూపడానికి అధికంగా ఇష్టపడుతన్నట్లు అనిపిస్తుంది. గత రెండు ఎన్నికలలో టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్ ) పాలన పగ్గాలు చేపట్టగా, కమ్మ వర్గం ఎమ్మెల్యేలు ఏ పార్టీలో గెలిచినా అంతా టీఆర్ఎస్‌లో చేరిపోయారు. రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ నుంచి కొందరు టీఆర్ఎస్‌లో చేరినా, పూర్తిగా ఆ పార్టీకి దూరం కాలేదు. 

2018 ఎన్నికలలో టీడీపీ, కాంగ్రెస్‌లు పొత్తు పెట్టుకోవడంతో కమ్మవర్గం నేతలు కూడా ఆ బాట పట్టారు. కానీ, పెద్దగా ఫలితం సాధించలేకపోయారు. టీఆర్ఎస్ పక్షాన పోటీచేసిన ఐదుగురు కమ్మ అభ్యర్దులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. టీడీపీ లేదా కాంగ్రెస్ నుంచి ఒక్కరు కూడా గెలవలేదు. చివరికి దివంగత టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ మనుమరాలు, మాజీ మంత్రి హరికృష్ణ కుమార్తె సుహాసిని కూకట్‌పల్లి నుంచి పోటీచేసి ఘోర పరాజయం చెందారు. ఏ వర్గం వారైనా కేవలం కులం ఆధారంగానే గెలవరని ఈ ఎన్నికలు రుజువు  చేశాయి. టీడీపీ సెంటిమెంట్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలవడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోయారు. దానికి తోడు విభజిత ఆంధ్రలో అప్పటికే చంద్రబాబుపై ఏర్పడిన విపరీతమైన వ్యతిరేకత కూడా చాలా ప్రభావం చూపింది.  

2014లో టీఆర్ఎస్ నుంచి ఒక్క కమ్మ అభ్యర్ధి గెలుపొందలేదు. ఇద్దరు టీడీపీ నుంచి, ఇద్దరు కాంగ్రెస్ నుంచి, ఒకరు బీఎస్పీ నుంచి విజయం సాధించారు. తదుపరి కాలంలో వీరంతా టీఆర్ఎస్‌లోకి జంప్ చేశారు. ఆ తర్వాత ఒక ఉప ఎన్నిక ద్వారా మరో కమ్మ నేత టీఆర్ఎస్ పక్షాన ఎమ్మెల్యే అయ్యారు. ఉమ్మడి ఏపీలో ఎన్నికలు జరిగినప్పుడు పరిశీలిస్తే 2009లో తెలంగాణలో  ముగ్గురు గెలవగా వారిలో ఇద్దరు టీడీపీ, ఒకరు లోక్‌సత్తాకు చెందినవారు. 2004లో కూడా ఈ వర్గం వారు ముగ్గురే గెలిచారు. ఒకరు కాంగ్రెస్ నుంచి, ఇద్దరు ఇతరులు కావడం విశేషం. టీడీపీ నుంచి ఎవరూ గెలవలేదు. 

1999లో టీడీపీ పక్షాన ముగ్గురు విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి ఎవరూ గెలవలేదు. 1994లో ఆరుగురు విజయం సాధించగా, టీడీపీ నుంచి నలుగురు, కాంగ్రెస్ ఒకరు, ఇతరులు ఒకరు గెలిచారు. 1989లో ముగ్గురు గెలిస్తే టీడీపీ నుంచి ఒకరు, ఇద్దరు ఇతర పార్టీలవారు. 1985లో మొత్తం ఎనిమిది మందికి గాను, ఆరుగురు టీడీపీ, ఇద్దరు టీడీపీ కూటమిలోని ఇతర పార్టీలవారు. తెలంగాణ చరిత్రలో ఈ ఎన్నికలోనే కమ్మ వర్గం నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అవడం విశేషం. 1983లో గెలిచిన ఏడుగురు కమ్మ ఎమ్మెల్యేలు టీడీపీవారే. ఎన్టీరామారావు ప్రభంజనం వీయడంతో  వీరు విజయం సాధించారు. అంతకుముందు 1978 ఎన్నికలలో కమ్మ వర్గం వారు ఐదుగురు, 1972, 1967లలో నలుగురు 1962లో ఇద్దరు గెలుపొందారు. 

స్థూలంగా చూస్తే తెలంగాణ ప్రాంతంలో కమ్మ సామాజికవర్గం ఎప్పుడూ పెద్ద బలంగా లేదు. కాకపోతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ వర్గం ఓన్ చేసుకోవడానికి యత్నించింది. అది కొంతకాలం బాగానే సాగినా, ఆ తర్వాత అది నెగిటివ్ గా మారుతోంది. ప్రత్యేకించి 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కమ్మ సామాజికవర్గం వారు ఎక్కువ శాతం టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారన్న భావనతో ఇతర వర్గాలవారు ఆ పార్టీకి దూరమయ్యారు. తాజా పరిణామాలలో కమ్మ ఓటర్లను పోలరైజ్ చేయడానికి రేణుకా చౌదరి వంటివారు యత్నిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ వర్గం సంఖ్య కాస్త ఎక్కువగా ఉండటమే కారణం. నిజంగానే కమ్మ వర్గానికి అంత బలం ఉంటే చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీకే మద్దతు ఇవ్వవచ్చు కదా! అలా చేయడం లేదంటే కారణం అర్ధం చేసుకోవచ్చు. అయినా రేణుక వంటివారు కమ్మ వర్గాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీలో అవినీతి కేసు నమోదై, ఆయన జైలుకు వెళితే దానిని కమ్మ సామాజికవర్గంపై దాడిగా ఆమె ప్రచారం చేసింది. ఎందుకైనా మంచిదని ఇతర పార్టీలవారు కూడా అదే బాటలో మాట్లాడారు. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ పూర్తిగా బలహీనపడిపోయిన నేపథ్యంలో ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు ఆ వర్గం వారిని కాంగ్రెస్‌కు అంటగట్టడానికి యత్నిస్తున్నాయి. నిజానికి ఆ వర్గం కానీ, ఆయా సెటిలర్ వర్గాలుగానీ కొంత కాలం క్రితం వరకు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారన్న అభిప్రాయం ఉంది. కానీ, చంద్రబాబు అరెస్టు ఉదంతం తర్వాత కమ్మ వర్గాన్ని కాంగ్రెస్ వైపు మళ్లించడానికి వ్యూహాలు పన్నుతున్నారు. 

నిజానికి ఏ కులం వారైనా తమ ఇష్టం వచ్చిన పార్టీకి మద్దతు ఇవ్వవచ్చు. కానీ, ఒక భావజాలాన్ని వ్యాప్తిలోకి తెచ్చి కమ్మవారు ఫలానా పార్టీకి అనుకూలం అనుకోవాలనేది కొందరి వ్యూహం. రేణుకా చౌదరి ఖమ్మం జిల్లాలో తనకు, అనుయాయులకు టిక్కెట్లు ఇప్పించుకోవడానికి కులం కార్డు ఉపయోగిస్తున్నారు. నలభై నియోజకవర్గాలలో కమ్మ వర్గం గణనీయంగా ఉందని, ముప్పై చోట్ల గెలుపు, ఓటములు నిర్ణయించే దశలో ఉందని, పది చోట్ల విజయావకాశాలు కలిగి ఉందని కమ్మ ఐక్యవేదిక కాంగ్రెస్ అధినాయకత్వానికి వివరించింది. వీటిలో ఎక్కువ భాగం హైదరాబాద్ పరిసరాలలోనివి కాగా, కొన్ని నిజామాబాద్, నల్గొండ జిల్లాలలోనివి. జూబ్లిహిల్స్, శేరీలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్చుల్లాపూర్, మేడ్చల్, ఖమ్మం, మల్కాజిగిరి, కొత్తగూడెం, కోదాడ, పాలేరు మొదలైన చోట్ల టిక్కెట్లను ఆశిస్తున్నట్లు ఈ వేదిక తెలిపింది. 

ఒకరకంగా ఇది కులం పేరు చెప్పుకుని కొందరు ఆయా పార్టీలను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఏ సామాజికవర్గం వారికైనా వారి సత్తాను బట్టి పార్టీలు టిక్కెట్లు ఇస్తాయి. కాకపోతే కమ్మ వర్గం కొంత ఆర్ధిక బలం కూడా కలిగి ఉంటుందన్న అభిప్రాయం ఉంది. టీఆర్ఎస్ కమ్మ వర్గానికి చెందిన  ఐదుగురికి టిక్కెట్లు కేటాయించింది. కాంగ్రెస్ అంతకు మించి ఇస్తుందా అన్నది సందేహమే. ఈ వర్గం నేతల హడావుడి కారణంగా, కాంగ్రెస్ హై కమాండ్ బీసీ వర్గం నేతలకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదట. అది ఆ పార్టీకి తలనొప్పి అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా అదేదో కమ్మ వర్గం వారికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వకపోతే నష్టం అనుకుంటే అది పెద్ద పొరపాటు అవుతుంది. పైగా ఇతర వర్గాలలో అపోహలు పెరిగే అవకాశం ఉండవచ్చు. అసలే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికీ చంద్రబాబుకు సన్నిహితుడన్న ప్రచారం ఉండగా, ఆయనను రేణుకా చౌదరి వంటివారు ఇలాంటి వివాదాలలోకి తీసుకు వెళ్లకుండా ఉంటేనే పార్టీకి ప్రయోజనం అని చెప్పాలి. 

ఏది ఏమైనా గత అరవైఐదేళ్ల తెలంగాణ ఎన్నికల చరిత్రను చూస్తే కమ్మ సామాజికవర్గం  అంత ప్రభావశీలిగా లేదనే చెప్పాలి. అన్ని సామాజికవర్గాలకు న్యాయం చేయడంలో భాగంగా ఏ పార్టీ అయినా ఇతర కులాలతో పాటు  కమ్మవారు కొందరికి కూడా  టిక్కెట్లు ఇస్తాయి. కానీ, అదే సమయంలో ప్రత్యేకించి రాష్ట్ర విభజన నేపధ్యంలో ఒక గ్రూపు తయారై అనవసరంగా రాజకీయాలు చేస్తూ ఆ వర్గం వారికి అప్రతిష్ట తేకుండా ఉంటే అదే పదివేలు అని చెప్పాలి.


కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్.

Advertisement
Advertisement