టీడీపీ ప్లాన్‌.. కాంగ్రెస్‌ యాక్షన్‌ | Sakshi
Sakshi News home page

టీడీపీ ప్లాన్‌.. కాంగ్రెస్‌ యాక్షన్‌

Published Thu, Jan 4 2024 1:59 PM

KSR Comments Over YS Sharmila And Congress Party - Sakshi

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ ప్రస్థానం చివరికి  కాంగ్రెస్‌కు చేరింది. దీనివల్ల ఆమెకు రాజకీయంగా ఎంతవరకు ఉపయోగం జరుగుతుందో చెప్పలేం కానీ, కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు మరోసారి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నట్లు కనిపిస్తోంది. దీనికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సహకారం ఉన్నట్లు అనిపిస్తుంది. 

ఒకే కుటుంబంలోని వ్యక్తులు వేర్వేరు పార్టీలలో చేరి రాజకీయాలు చేయడం కొత్తకాదు. షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. వారు ఇచ్చిన ఆఫర్ల గురించి కూడా వెల్లడించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తామని, ఏపీసీసీ అధ్యక్షురాలు, లేదా స్టార్ కాంపెయినర్‌గా వ్యవహరించాలని కోరుతున్నట్లు ఆమె తెలియచేశారు. తెలంగాణ నుంచి లోక్‌సభకు పోటీచేసే ఆలోచన కూడా ఉందని చెబుతున్నారు. ఆమె కాంగ్రెస్‌లో చేరినా తెలంగాణకే పరిమితం అయితే మంచిదే. కానీ, రాజకీయం ఎప్పుడూ అనుకున్నట్లు జరగదు. సహజంగానే ఆమెను రాజకీయంగా ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తున్న శక్తులు తప్పుదారి పట్టించే యత్నాలు కూడా ఉంటాయి. 

ఇప్పటికే షర్మిల, ఆమె భర్త అనిల్ ఒక  తెలుగుదేశం మీడియా యజమాని రాజకీయ ట్రాప్‌లో ఉన్నారు. ఆయన సహాయ సహకారాలు తీసుకుంటున్నారంటేనే చంద్రబాబు కూడా ఈ కుట్రలో భాగస్వామిగా ఉన్నారనే  అభిప్రాయం కలుగుతుంది. అందుకు తగినట్లుగానే షర్మిల భర్త అనిల్ టీడీపీ నేత బీటెక్‌ రవితో మాటామంతి కలిపారని అనుకోవచ్చు. షర్మిల ఒకప్పుడు వైఎస్ జగన్‌కు అండగా ఉన్న మాట నిజం. ఆయన కూడా ఆమె పట్ల ఎంతో అభిమానంగా ఉంటారు. అయినా రాజకీయం ఎంతటి వారి మధ్య అయినా బేధాలు సృష్టిస్తుంటుంది. కారణం ఏమైనా ఆమె తెలంగాణ రాజకీయ మార్గం ఎంచుకున్నారు. అలా చేయవద్దని సీఎం జగన్ చెప్పి చూశారు. కానీ, ఆమె అంగీకరించలేదు. దీంతో, రాజకీయాలలో ఆమె దారి ఆమెది అని సీఎం జగన్ చాలా స్పష్టంగా చెప్పేసి, తన పనిలో తాను పడ్డారు. షర్మిల కూడా చిత్తశుద్దితో తెలంగాణ రాజకీయాలు చేయాలని అనుకున్నారు. సొంతంగా పార్టీని నిలబెట్టడానికి యత్నించారు. 

పాలేరు నియోజకవర్గం నుంచి పోటీచేసి అసెంబ్లీకి వెళ్లాలని భావించి తగు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. పాదయాత్ర జరిపారు. ఆ క్రమంలో నర్సంపేటలో టీఆర్ఎస్ నేతలతో  ఒక పెద్ద వివాదం కూడా జరిగింది. ఆ సందర్భంలో హైదరాబాద్‌లో తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులకు ఎదురొడ్డి కారులో నుంచి దిగకుండా ఉండడం, దాంతో టోల్‌ వెహికిల్ ద్వారా ఆ కారును పట్టుకువెళ్లే యత్నం జరిగింది. అప్పుడు ఆమె నిరసన దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇన్ని జరిగిన తర్వాత కూడా ఆమె తెలంగాణలో పార్టీని వ్యవస్థాపరంగా అభివృద్ది చేసుకోలేకపోయారు. పార్టీ నిర్మాణం గ్రామ స్థాయి నుంచి చేసుకోలేకపోయారు. పార్టీ భవిష్యత్తుపై అనుమానాలు ఏర్పడటంతో పలువురు నేతలు తమదారి తాము చూసుకున్నారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్‌తో కలిసి రాజకీయం చేయాలని భావించారు. కానీ, అప్పటికే టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో  చేరి పీసీసీ అధ్యక్షుడు అయిన రేవంత్ రెడ్డి అందుకు అంగీకరించలేదు. 

దీంతో ఆమె కొన్నిసార్లు రేవంత్ రెడ్డిపై ఘాటైన విమర్శలు కూడా చేశారు. అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేయాలని అనుకున్నా, ఆమె ఏ కారణం వల్లనైతేనేమీ చేయలేకపోయారు. ఈలోగా ఆమెను కాంగ్రెస్‌లోకి తీసుకు వచ్చి ఏపీ రాజకీయాలలో ప్రవేశపెట్టాలని కొందరు  ప్రయత్నాలు చేశారు. బహుశా ఆమె కూడా దీనిపై మల్లగుల్లాలు పడి ఉండవచ్చు. తొలుత అంత సుముఖత చూపలేదు. చివరికి కాంగ్రెస్ అధిష్టానం చేసిన సంప్రదింపుల పర్యవసానంగా ఆమె తన పార్టీని విలీనం చేయడానికి ఒకే చేశారు. కానీ.. కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఏమన్నారో  చూడండి. షర్మిల ఆరునెలలుగా కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని అడుగుతున్నారని  చెప్పారు. దీనిని బట్టి కాంగ్రెస్ వారు ఎలా వ్యవహరిస్తారో అర్ధం చేసుకోవచ్చు. 

షర్మిలకు ఏ పదవి ఇస్తారో అది వేరే విషయం. ఆమెను ఎలాగైనా ఏపీ రాజకీయాలలోకి తీసుకు వచ్చి ముఖ్యమంత్రి, ఆమె సోదరుడు అయిన సీఎం జగన్‌ను ఇబ్బంది పెట్టాలన్నది కాంగ్రెస్, టీడీపీలోని కొందరి లక్ష్యం. కొద్ది రోజుల క్రితం బెంగుళూరు ఎయిర్ పోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ల మధ్య జరిగిన ఏకాంత చర్చలలో షర్మిల  విషయం ప్రస్తావనకు వచ్చిందని రాజకీయవర్గాలలో ప్రచారం జరిగింది. ఈ ఉదంతంలో చంద్రబాబు, ఎల్లో మీడియా యజమాని ఒకరిని  ప్రయోగించి ఉండవచ్చు. ఈ వ్యూహంలో  భాగంగానే చంద్రబాబు తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల ప్రచార సమయంలోనే  తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఏపీ రాజకీయాలలో కూడా ట్విస్ట్ వస్తుందని చెప్పడం గమనార్హం. అప్పుడే కాంగ్రెస్ కుట్రలకు శ్రీకారం చుట్టిందన్న అనుమానం వ్యక్తం అయింది. అది నిజమే అన్నట్లుగా ప్రస్తుత పరిణామాలు సాగుతున్నాయి.

ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కారణమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. సీఎం జగన్ గతంలో సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత ఆయనను కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుతో కలిసి ఎన్ని కష్టాల పాలు చేసింది తెలిసిందే. ప్రస్తుతం ఆ స్థాయిలో ఇబ్బంది పెట్టే పరిస్థితి లేకపోయినా, ఎన్నికలలో తెలుగుదేశంకు ఉపయోగపడేలా కాంగ్రెస్ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు అర్దం అవుతుంది. ఒకప్పుడు కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ షర్మిల, తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఛార్జిషీట్‌లో పెట్టడంపై కూడా నిపులు చెరిగారు. ఆ విషయాలను పక్కనబెట్టి ఆమె కాంగ్రెస్‌లో చేరడం కాస్త ఆశ్చర్యమే అయినా, రాజకీయాలలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఆ మాటకు వస్తే తెలుగుదేశంలో జరిగిన పరిణామాలను ఒక్కసారి నెమరువేసుకోండి.

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఇంటిలో చంద్రబాబు పెట్టిన చిచ్చు గురించి జ్ఞప్తి చేసుకోండి. రామారావును ఆయన అల్లుళ్లు చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కుమారులు హరికృష్ణ, బాలకృష్ణ తదితరులు ముఖ్యమంత్రి పదవి నుంచి కూలదోసి అవమానించారు. ఆ పరాభవం భరించలేక ఎన్టీఆర్‌ గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనతో పోల్చితే  షర్మిల కాంగ్రెస్‌లో చేరడం అన్నది పెద్ద విషయమే కాదు. ఆమె ఎప్పుడో ఏపీ రాజకీయాలకు దూరమై.. తాను తెలంగాణలో రాజకీయం చేసుకుంటున్నారు. ఇప్పుడు మనసు మార్చుకుని ఆమె ఏపీలో కూడా చేస్తే  చేసుకోవచ్చు. అందులో పెద్ద ఆక్షేపణ ఏమీ లేదు. ఆమె వైఎస్సార్‌సీపీలో ఉండి అన్నకు వ్యతిరేకంగా, అంటే చంద్రబాబు తన మామపై చేసినట్లు  కుట్రలు చేస్తే తప్పు కానీ, ఆమె నేరుగా రాజకీయాలు నడుపుకుంటే విమర్శించవలసిన అవసరం లేదు.

కాకపోతే కాంగ్రెస్‌, టీడీపీల కుట్రలో ఆమె పావు అవుతున్నారేమో అన్నదే డౌటు. చంద్రబాబు నాయుడు అప్పట్లో దగ్గుబాటి  వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పి, తన కుట్రలో భాగస్వామిని చేసి, ఆ తర్వాత అవమానించి బయటకు పంపించారు. ఎన్టీఆర్‌ కుమారుడు హరికృష్ణది అదే పరిస్థితి. ఆయన ఎమ్మెల్యేగా లేనప్పుడు మంత్రిని చేశారు. తీరా ఉప ఎన్నికలో గెలిచి ఎమ్మెల్యే అయినా మంత్రి పదవి ఇవ్వకుండా ఘోరంగా అవమానించారు. దాంతో ఆయన  సొంతంగా అన్నాటీడీపీ పేరుతో పార్టీని పెట్టుకుని కొంతకాలం నడిపారు. చంద్రబాబు  తన ఆధ్వర్యంలోని టీడీపీ ఓడిపోయిన తర్వాతే తిరిగి హరికృష్ణతో రాజీ చేసుకుని ఎంపీ పదవి ఇచ్చారు. అయినా హరికృష్ణ ఆయనను నమ్మేవారుకారు. అప్పట్లో హరికృష్ణ  ఒక నక్కను పెంచుకునేవారట. దానికి ఎవరి పేరు పెట్టుకున్నారో తెలుసా! వద్దులే.. చెబితే  బాగుండదు. 

ఇక జూనియర్ ఎన్టీఆర్‌కు ఎన్ని చేదు అనుభవాలు జరిగాయో చెప్పనవసరం లేదు. ఆ ఘట్టాలతో పోల్చితే షర్మిల ఉదంతం చాలా ఫెయిర్‌గా ఉన్నట్లు లెక్క.   ఎన్టీఆర్‌ కుమార్తె పురందేశ్వరి తనభర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి కాంగ్రెస్‌లో ఎందుకు చేరారు?. చంద్రబాబు ఇంటికి వెళ్లిన  దగ్గుబాటిని అవమానించడం అవాస్తవమా!ప్రస్తుతం పురందేశ్వరి బీజేపీలో ఎందుకు ఉన్నారు. 2019లో దగ్గుబాటి వైఎస్సార్ కాంగ్రెస్ పక్షాన పోటీచేస్తే, పురందేశ్వరి బీజేపీ తరపున పోటీ చేశారు. పురందేశ్వరి  సోదరుడు బాలకృష్ణ టీడీపీలో చంద్రబాబు వెంట ఎలా ఉన్నారు?. చంద్రబాబుకు అత్త అయ్యే లక్ష్మీపార్వతి వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో క్రియాశీల పదవిలో ఉన్నారు. అవేవి తప్పు కానప్పుడు షర్మిల తన ఇష్టం వచ్చిన విధంగా రాజకీయం చేసుకుంటే తప్పు ఏమి ఉంటుంది?. ఇవన్ని ఎందుకు! చంద్రబాబు నాయుడిని తన సోదరుడు రామ్మూర్తి నాయుడు 1999లో ఎంత తీవ్రంగా విమర్శించింది, కాంగ్రెస్‌లో చేరి కుప్పంలో పోటీచేయడానికి సిద్దపడింది గుర్తు లేదా!. 

తాజాగా విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్ని వర్గాలు ఎలా గొడవలు పడుతున్నాయి? వారి కుటుంబంలో చంద్రబాబే చిచ్చుపెట్టారన్న విమర్శకు సమాధానం ఏమిటి?. అన్నదమ్ములు, సోదరి, సోదరులు, చివరికి తల్లి, కొడుకులు వేర్వేరు పార్టీలలో ఉన్న ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. రాజమాతగా పేరొందిన విజయరాజే సింధియా బీజేపీ నేత అయితే ఆమె కుమారుడు మాధవరావు సింధియా కాంగ్రెస్ నేతగా ఉండేవారు. ఇందిరాగాంధీ కోడళ్లు సోనియాగాందీ కాంగ్రెస్ నేత అయితే మేనకా గాంధీ బీజేపీ నేతగా ఉన్నారు. 1952లోనే తిరువూరు నియోజకవర్గంలో తండ్రి, కుమారులు పేట బాపయ్య, పేట రామారావులు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల తరపున పోటీ పడ్డారు. 

ఇప్పటికిప్పుడు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే షర్మిల కాంగ్రెస్‌లోకి వచ్చినంత మాత్రాన ఆ పార్టీకి ఏదో ఊపు వస్తుందనుకుంటే భ్రమే అవుతుంది. సీఎం జగన్‌ను రాజకీయంగా దెబ్బతీయలేరన్నది ఎక్కువ మంది భావన. షర్మిలవల్ల ఏవైనా ఓట్లు వస్తే అవి ప్రభుత్వ వ్యతిరేక  ఓట్లే అవుతాయి కాని, ముఖ్యమంత్రి జగన్ అనుకూల ఓట్లు అవడానికి తక్కువ అవకాశం ఉంటుంది. ఏదో జగన్ చెల్లి వేరే పార్టీలో ఉన్నారని చికాకు పెట్డడానికి ప్రత్యర్ధులు ప్రయత్నించవచ్చు. అంతే తప్ప ఆమె వల్ల వైఎస్సార్‌సీపీకి నష్టం ఉండదు. 

చివరిగా ఒక మాట.. 1995లో ముఖ్యమంత్రి అయిన తర్వాత భార్య భువనేశ్వరితో కలిసి చంద్రబాబు నాయుడు తన మామ ఎన్‌టీఆర్‌ ఇంటివద్దకు వెళితే ఆయన కనీసం వీరి ముఖాలు చూడడానికి ఇష్టం పడలేదు. తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వచ్చిన చెల్లెలు వైఎస్‌ షర్మిలను సీఎం జగన్ సాదరంగా స్వాగతించి రాజకీయాలతో సంబంధం లేకుండా మర్యాద చేసి పంపించారు.


-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్.

Advertisement
Advertisement