జగన్‌ ఏంటో చెప్పడానికి విశాఖ చాలదా! | Sakshi
Sakshi News home page

జగన్‌ ఏంటో చెప్పడానికి విశాఖ చాలదా!

Published Sat, Mar 9 2024 2:39 PM

Ksr Comments On Visakha Development - Sakshi

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నంలో చేసిన ప్రసంగం ఎంత ముచ్చటగా ఉందో గమనించారా..! ఆయన చక్కటి ఇంగ్లీష్ భాషలో నిరాఘాటంగా ప్రసంగించి ఆ సదస్సులో ఉన్న సుమారు రెండువేల మంది ఔత్సాహికులు, వివిధ వర్గాల వారిని ఆకట్టుకున్నారు. ఆ ప్రసంగం వింటుంటే ఏపీ గౌరవాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి‌ పెంచినట్లు అనిపిస్తుంది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు వచ్చీ, రాని ఆంగ్లభాషలో మాట్లాడుతుంటే వినడానికి ఇబ్బంది అనిపించేది.

ఆంగ్ల భాష రాకపోవడం తప్పు  కాదు. గ్రామర్‌తో సంబంధం లేకుండా మాట్లాడడం కన్నా ముందుగా తయారుచేసిన ప్రసంగం చదవడం మంచిది. కాని చంద్రబాబు అలాకాకుండా తాను ఆంగ్లంలో పండితుడినే అన్నట్లుగా సొంతగా స్పీచ్ ఇవ్వడానికి యత్నించేవారు. దాంతో  పలు తప్పులు దొర్లేవి. అదే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విషయంలో ఆ సమస్య లేదు. దానికి కారణం ఆయన ఆంగ్ల భాషలోవిద్యను అభ్యసించడమే. బహుశా అందుకేనేమో రాష్ట్రం అంతటా తెలుగుతో పాటు, ఆంగ్ల మీడియంను ప్రభుత్వ స్కూళ్లలో పెట్టి విద్యార్దులను ప్రోత్సహిస్తున్నారు.
YS Jagan Mohan Reddy, AP CM YS Jagan News in Telugu | Download Latest  Photos and Videos of CM Jagan
ఈ విషయాన్ని అలా ఉంచితే విజన్ విశాఖపై ఆయన మాట్లాడిన విషయం చక్కగా ఉంది. అందులో ఒక చిత్తశుద్ది కనిపించింది. వైజాగ్ నగరాన్ని అభివృద్ది చేయడం ద్వారా రాష్ట్రానికి ఒక ఆర్దిక గ్రోత్ ఇంజన్‌గా ఉపయోగపడుతుందన్న వాదనను బలంగా వినిపించారు. విశాఖను ఏ విధంగా అభివృద్ది చేసేది కూడా ఆయన డాక్యుమెంటరీ ద్వారా కూడా చూపించారు. అమరావతి రాజధానిగా తాను వ్యతిరేకం కాదని, శాసన రాజధానిగా కొనసాగుతుందని అంటూ విశాఖలో కార్యనిర్వహాక రాజధానిగా చేస్తామని, ఎన్నికల తర్వాత అది జరుగుతుందని ఆయన ధీమాగా చెప్పారు. ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రిగా విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తానని చెప్పడంలో ఆయనకు ఉన్న విశ్వాసం అలాంటిది. ఆయన ధైర్యం అటువంటిది.

నిజానికి ఎన్నిక ముందు ఇలాంటి విధాన ప్రకటనలు చేయడంలో రిస్కు ఉంటుందని మామూలు రాజకీయ నేతలు భావిస్తారు. కాని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అలా చేయలేదు. తన కార్యాచరణ ఏమిటో స్పష్టంగా చెప్పేశారు. అమరావతిలో ప్రాధమిక వసతుల కల్పనకే లక్ష కోట్లు వ్యయం అవుతుందని, అదే విశాఖలో అభివృద్ది చెందిన వసతులు ఉన్నాయని, హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాలకు ధీటుగా విశాఖను తయారు చేస్తే రాష్ట్రానికి ప్రయోజనమని ఆయన స్పష్టం చేశారు.

నిజంగానే ఏపీలో అతి పెద్ద నగరం విశాఖపట్నం. హైదరాబాద్ ప్రముఖ నగరంగా అభివృద్ది చెందబట్టే ప్రభుత్వానికి పన్నులు, తదితర రూపాలలో ఆదాయం బాగా వస్తోంది. విశాఖను కూడా ఆ స్థాయికి తీసుకురావాలన్న తన లక్ష్యాన్ని విజన్‌లో వివరించారు. ఐకానిక్ సచివాలయం, అహ్మదాబాద్‌లో  కొత్తగా నిర్మించిన అతి పెద్ద స్టేడియం, భోగాపురం విమానాశ్రయం, ఆ ఎయిర్ పోర్టు వరకు సముద్రం ఒడ్డున ఆరు లైన్ల రహదారి, పెద్ద కన్వెన్షన్ సెంటర్ మొదలైనవి రూపుదిద్దుకుంటే విశాఖ స్వరూపమే మారే అవకాశం ఉంటుంది. దానినే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన విజన్ వైజాగ్లో తెలియచేశారు. విశాఖలో ఈ మద్యకాలంలో వేసిన రోడ్లు చూస్తే అక్కడ జరిగిన అభివృద్ది తెలుస్తుంది. బీచ్ రోడ్డుకాని, వ్యాలీ స్కూల్ రోడ్డు కాని ఎంతో బాగా అభివృద్ది చేశారని ఒక కారు డ్రైవర్‌ నాతో అన్నారు. రిషికొండ వద్ద నిర్మించిన టూరిజం భవనం కూడా విశాఖకు ఒక మణిదీపంగా కనిపిస్తుంది. వీటన్నటిని చెడగొట్టడానికి ఈనాడు, ఆంద్రజ్యోతి వంటివి చేయని దుర్మార్గం లేదు. వారు చెత్త రాయడం, దానిని పట్టుకుని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ మాట్లాడి విశాఖపై విషం చిమ్మడం వంటివి ఇంతకాలం చేశారు.

ఎన్నికలు వచ్చినందున ఇప్పుడైనా ఆపుతారేమోనని అనుకుంటే ఈనాడు మాత్రం తన వైఖరి మార్చుకోలేదు. విజన్ విశాఖ గురించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన రోజే ఈనాడు దానిని విమర్శిస్తూ అన్యాయంగా కధనాలు రాసింది. దీనివల్ల వారికి ఏమి వస్తుందో తెలియదు. వారి స్వార్ధ, రాజకీయ ప్రయోజనాలకోసం ఇంతగా దిగజారడం బాగోలేదు. భూముల కబ్జా అంటూ ఈనాడు పచ్చి అబద్దాలు రాసి ప్రజల మనసులలో విశాఖ అభివృద్ది జరుగుతున్న తీరును మర్చిపోయేలా చేయాలన్నది వారి లక్ష్యం. చంద్రబాబు ప్రభుత్వ టైమ్లో విశాఖలో కబ్జాలు, హుద్ హుద్ తుపానులో రికార్డులు గల్లంతయ్యాయని అధికారికంగా వెల్లడి చేసిన సంగతి అన్ని మర్చిపోయినట్లు ఈనాడు నటిస్తోంది. ఈ ప్రభుత్వం వచ్చాక సుమారు 400 ఎకరాల భూమిని కబ్జా నుంచి విడిపించింది. అయినా ఎక్కడైనా భూవివాదాలు ఉండవచ్చు. అంతమాత్రాన విశాఖ ఎగ్జిక్యూటివ్ కాపిటల్‌గా మారకూడదని చెప్పడమే అత్యంత శాడిజం అని చెప్పాలి.

అమరావతిలో వారికి ఉన్న వ్యాపార ప్రయోజనాలు దెబ్బతింటాయన్న బాధ తప్ప, రాష్ట్రం గురించి ఆలోచనే ఈనాడు రామోజీ, చంద్రబాబు, పవన్ వంటివారికి లేకపోవడం దురదృష్టకరం. విశాఖకు వస్తున్న డేటా సెంటర్, ఐటి కంపెనీలు మొదలైనవాటి గురించి కూడా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వివరించి, విద్యుత్ రంగంలో 30 వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పారు. ఈ రకంగా అభివృద్దిలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దూసుకుపోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంటే వాటిని అడ్డుకోవడానికి విపక్షం, ఆ వర్గం మీడియా నానా పాట్లు పడుతోంది. ఎప్పుడైతే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాను ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారో, ఐకానిక్ సెక్రటేరియట్ నిర్మిస్తానని చెప్పారో, ఉత్తరాంద్ర అంతటా దాని ప్రభావం పడి వైసీపీ విజయావకాశాలు బాగా పెరుగుతాయన్నది టీడీపీ, ఆ వర్గం మీడియా భయం అని వేరే చెప్పనవసరం లేదు. విశాఖతో పాటు ఆయా చోట్ల పూర్తి చేసిన అభివృద్ది పనులకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఎప్పటి నుంచో ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు కలగా ఉన్న వెలిగొండ ప్రాజెక్టును వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జాతికి అంకితం ఇచ్చారు.

నిజంగా ఇది ఏపీ ప్రజలంతా సంతోషించవలసిన సమయం. వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టును ఆయన తనయుడుగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరంభించడం గొప్ప సంగతే. 31 కిలోమీటర్ల టన్నెల్ నిర్మించడం అంటే తమాషా కాదు. అయినా వైఎస్ఆర్ సాహసోపేతంగా దీనిని ఆరంభించారు. సీపీఐ నేతల కోరిక మేరకు దివంగత నాయకుడు పూల సుబ్బయ్య పేరు కూడా పెట్టారు. కృష్ణానదికి వరద వస్తే ఈ ప్రాజెక్టు కింద నిర్మించిన నల్లమల సాగర్‌కు నీరు చేరుతుంది. దానిని ఈ మూడు జిల్లాలకు పంపిణీ చేయవచ్చు. తద్వారా ఈ జిల్లాలలోని మెట్ట ప్రాంతాలకు సాగు నీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలని ఆ ప్రాంత రైతులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. దానిని సాకారం చేస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఇలా వివిధ కార్యక్రమాలను ఎన్నికల ముందు చకచకా ఆరంభిస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన సత్తా ఏమిటో తెలియచేస్తున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక విజన్‌తోనే రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారనడానికి ఇవి ఉదాహరణలే అవుతాయి.


– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Advertisement
Advertisement