కాంగ్రెస్‌ 420 హామీలునెరవేరాలంటే అదనంగా రూ.1.25 లక్షల కోట్లు కావాలి | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ 420 హామీలునెరవేరాలంటే అదనంగా రూ.1.25 లక్షల కోట్లు కావాలి

Published Sun, Feb 11 2024 4:04 AM

KTR fire on CM Revanth Reddy - Sakshi

రాంగోపాల్‌పేట(హైదరాబాద్‌): ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇ చ్చిన 420 హామీలు నెరవేరాలంటే అదనంగా రూ.1.25 లక్షల కోట్లు అవసరమని, ఇప్పుడు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ లో రూ.53 వేల కోట్లు కేటాయించారని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధ్యక్షతన శనివారం సికింద్రాబాద్‌లోని ఎస్వీఐటీ ఆడిటోరియంలో సనత్‌నగర్‌ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ‘మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన మహిళలు 1.67 కోట్ల మంది ఉన్నారు.

ఒక్కొక్కరికి రూ.2500 చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తే నెలకు రూ.4500 కోట్లు... సంవత్సరానికి రూ.54 వేల కోట్లు అవుతుంది. మిగతా పథకాలు ఎలా అమలు చేస్తారు. 100 రోజుల్లో హామీలు నెరవేర్చకపోతే వారి భరతం పడతాం. రుణమాఫీకే రూ.39వేల కోట్లు కావాలి. రైతుభరోసాకు రూ.24వేల కోట్లు కావాలి. ఇవన్నీ అమలు చేస్తే అదనంగా 1.25లక్షల కోట్లు అవసరం. కానీ నేటి బడ్జెట్‌ మేడిపండు చందంగా ఉందని’విమర్శించారు.

బీఆర్‌ఎస్‌ను 100 మీటర్ల బొంద తవ్వి పెడతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంటున్నారని, గడ్డపారలు పట్టుకొని లంకెబిందెల కోసం తిరగడం ఆయనకు అలవాటేనని, అందుకే తవ్వుడు గురించి మాట్లాడుతున్నాడన్నారు. 24 ఏళ్లలో కేసీఆర్‌ను ఖతం చేస్తాం అంటూ ఎంతోమంది తీస్మార్ఖాన్‌లు వచ్చినా ఏమీ చేయలేకపోయారని, నీలాంటి బుడ్డర్‌ఖాన్‌లతో ఏమవుతుందని ఎద్దేవా చేశారు.

కేఆర్‌ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను ధారాదత్తం చేస్తూ ఈ దద్దమ్మ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఈనెల 13వ తేదీన నల్లగొండలో తలపెట్టిన సభను విజయవంతం చేయాలని ఆయన కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, పద్మారావు, ముఠాగోపాల్, పాడి కౌశిక్‌రెడ్డి, దానం నాగేందర్, ఎమ్మెల్సీ మహమూద్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.  

కాళేశ్వరం కట్టింది మేము..చూడాల్సింది మీరే
‘కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతం, దానిని కట్టింది మా ప్రభుత్వమే. కాళేశ్వరం గురించి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తెలియని విషయాలు ఉంటే తెలుసుకోవచ్చు. కాళేశ్వరం కట్టిందే మేము.. అయితే చూడాల్సింది కాంగ్రెస్‌ పా ర్టీనే’అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. తెలంగాణభవన్‌లో కేటీఆర్‌ తనను కలిసిన మీడియా ప్రతినిధులతో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రాజెక్టులో ఏవైనా చిన్నచిన్న ఇబ్బందులు ఉంటే సరిచేయాలి. అందుకు అవసరమైన పూర్తి యంత్రాంగం ప్రభుత్వం వద్ద ఉంది.

మేడిగడ్డ సమస్యను చూపుతూ మొత్తం ప్రాజెక్టు పూర్తిగా విఫలమైందనే కుటిల ప్రయత్నం చేయడం.. సూర్యుడి మీద ఉమ్మడం లాంటిదే. ప్రాజెక్టులో తప్పులు జరిగితే బయటపెట్టాలని, ఏ విచారణకైనా సిద్ధమేనని గతంలోనే పదులసార్లు చెప్పాం’అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాళేశ్వరం గొప్పతనంతోపాటు కాలువలు, పంప్‌హౌస్‌లు ఎన్ని ఉన్నాయని కాంగ్రెస్‌ తెలుసుకోవచ్చు.

కానీ కాళేశ్వరం గురించి కాంగ్రెస్‌ నేతలకు కనీస ఇంగిత జ్ఞానం లేదు.అని కేటీఆర్‌ పేర్కొన్నారు. ‘రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తి ఒక క్రిమినల్‌. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ. ఆయనకు క్రిమినల్‌ ఆలోచనలు తప్ప ఇంకొకటి లేదు. అధికారం ఆయన చేతిలో ఉంది కాబట్టి ఎవరిపైనైనా నిరభ్యంతరంగా చర్యలు తీసుకోవచ్చు’అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. 

Advertisement
Advertisement