అది కరెక్ట్‌ కాదు.. పూర్తి బాధ్యత నాదే: కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

ప్రజలు తప్పుచేశారడనం కరెక్ట్‌ కాదు.. పూర్తి బాధ్యత నాదే: కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

Published Fri, Jan 12 2024 3:55 PM

KTR Key Comments At Bhuvanagiri Constituency  Preparatory Meeting - Sakshi

హైదరాబాద్‌, సాక్షి:  అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు మరోసారి స్పందించారు. శుక్రవారం భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ సన్నాహక భేటీలో ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిపాలనపై అతి శ్రద్ధతో పార్టీ సంస్థాగత నిర్మాణం సరిగ్గా జరగనందునే ఓడామని.. అందుకు పూర్తి బాధ్యత తనదేనని వ్యాఖ్యానించారాయన. ఈ క్రమంలో ఓటమికి పది కారణాలను పార్టీ కేడర్‌కు ఆయన వివరించారు. 

‘‘బీఆర్‌ఎస్‌ను ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదు. ప్రజలు తప్పుచేశారడనం సరికాదు. రెండుసార్లు మనల్ని గెలిపించింది కూడా ప్రజలే. మొత్తం స్థానాల్లో 14 చోట్ల వందల్లో, వేలల్లో మాత్రమే మన మెజార్టీ తగ్గింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కారణాల్ని సమీక్షించుకోవాలి. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలి’’ అని కేడర్‌కు పిలుపు ఇచ్చారాయన.  

ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమికి పది కారణాలను కేటీఆర్‌ వివరించారు. పరిపాలనపైనే దృష్టిపెట్టి పార్టీని పట్టించుకోలేదు. అందుకు పూర్తి బాధ్యత నాదే. పార్టీలో సంస్థాగత నిర్మాణం సరిగ్గా​ జరగలేదు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు సరైన గుర్తింపు ఇవ్వలేకపోయాం. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కేంద్రంగా మారి పార్టీని నడపడం సరికాదు.

ఈ పదేళ్లలో పార్టీ కార్యకర్తల ఆర్థిక పరిస్థితి పట్టించుకోలేదు. ప్రభుత్వానికి పథకాల మద్య కార్యకర్త లేకుండానేరుగా లబ్ధిదారుడికి పథకం చేరడంతో ఓటర్‌కి.. కార్యకర్తకు లింక్‌ తెగిపోయింది. రాష్ట్రంలో గత పదేళ్లలో 6 లక్షల రేషన్‌ కార్డులు ఇచ్చినా.. ప్రజల్లోకి ఆ విషయాన్ని తీసుకెళ్లలేకపోయాం. ప్రతీ నియోజకవర్గంలో 15 వేల కొత్త పెన్షన్‌లు ఇచ్చిన విషయాన్ని కూడా జనంలోకి తీసుకెళ్లలేకపోయాం. వందలో ఒక్కరికి రాలేదు.. అదే నెగెటివ్‌గా ప్రచారం అయ్యింది. 

దళిత బంధు కొందరికే రావడంతో మిగతా వాళ్లు ఓపిక పట్టలేకపోయారు. వాళ్లంతా అసహనంతో మనకు వ్యతిరేకం అయ్యారు. రైతు బంధు తీసుకున్న సామాన్య రైతు కూడా..  ఎక్కువ ఎకరాలున్న భూస్వామికి ఇస్తే ఒప్పుకోలేదు’’ అని ఓటమి కారణాల్ని కేటీఆర్‌ విశ్లేషించి.. బీఆర్‌ఎస్‌ కేడర్‌కు వివరించారు.

బీజేపీతో పొత్తు గతంలో లేదు.. భవిష్యత్తులో ఉండదు.  ఇక ఎమ్మెల్యే చుట్టూ తిరిగే విధానం ఉండదు. పార్టీ చుట్టురానే ఎమ్మెల్యే తిరిగే విధానం ఉంటుంది. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించం అని కేడర్‌ను హెచ్చరించారాయన. 

Advertisement
Advertisement