కేసీఆర్‌ కాలిగోటికి కూడా రేవంత్‌ సరిపోడు | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ కాలిగోటికి కూడా రేవంత్‌ సరిపోడు

Published Mon, Jan 29 2024 12:59 AM

KTR Shocking Comments On CM Revanth Reddy - Sakshi

సిరిసిల్ల: ‘‘మూడు ఫీట్లు లేనోడు కూడా కేసీఆర్‌ను వంద మీటర్ల లోతుకు తొక్కుతాడట.. ఈ బుడ్డర ఖాన్‌తో ఏమీ కాదు’’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు సీఎం ఎ.రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణభవ న్‌లో ఆదివారం నిర్వహించిన బీఆర్‌ఎస్‌ సర్వసభ్య సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ రేవంత్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కేసీఆర్‌ కాలిగోటికి కూడా రేవంత్‌రెడ్డి సరిపోడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ మేనేజ్‌మెంట్‌ కోటాలో సీఎం సీటును కొన్నాడని ఎద్దేవా చేశారు. అలవికాని హామీలిచ్చి కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మొత్తం 420 హామీలు ఇచ్చిందని వాటిని అమలు చేయడం చేతకాక కేసీఆర్‌ అప్పులు చేశారంటూ తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ఎన్నికల హామీలను అమలు చేసేదాకా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో 1.8 శాతం స్వల్ప ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యామనీ,  పోయింది అధికారమేననీ.. పోరాట పటిమ కాదన్నారు. కాంగ్రెస్‌ ఉంటే  కరెంట్‌ ఉండదనే మాజీ సీఎం కేసీఆర్‌ మాటలను  కాంగ్రెస్‌ సర్కారు నిజం చేస్తోందని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ కారుకు ఇది ఒక స్పీడ్‌ బ్రేకర్‌ మాత్రమేనని, మళ్లీ వంద కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

సగం సీట్లు గెలిచినా హంగ్‌ వచ్చేది
ఎన్నికల్లో 14 చోట్ల కేవలం ఐదువేల ఓట్ల తేడాతో బీఆర్‌ఎస్‌ ఓడిపోయిందని, అందులో సగం సీట్లు గెలిచినా.. హంగ్‌ సర్కారు వచ్చేదని కేటీఆర్‌ విశ్లేషించారు. మార్పు కావాలే అన్నోళ్లు ఇప్పుడు నెత్తినోరు కొట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. సచివాల యంలో లంకెబిందెలు ఉన్నాయని వస్తే.. ఉత్తబిందెలు కూడా లేవని రేవంత్‌రెడ్డి మాట్లాడడం విడ్డూ రంగా ఉందన్నారు. మంత్రిగా చేసిన అనుభవం లేనోడు ముఖ్యమంత్రి అయితే గిట్లనే ఉంటదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలను వేర్వేరుగా పెట్టడం ద్వారా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఒక్కటే నని తేలిపోయిందన్నారు.

ధర్మం కోసం పని చేస్తే మఠం పెట్టుకోండి
ఐదేళ్లలో కరీంనగర్‌ ఎంపీగా బండి సంజయ్‌ చేసింది ఏమిటని కేటీఆర్‌ ప్రశ్నించారు. సిరిసిల్లకు మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ అడిగితే ఇవ్వలేదని, నవోదయ పాఠశాలలు తేలేదని నిందించారు. ధర్మం కోసం పనిచేస్తే.. రాజకీయాలు మానేసి మఠం పెట్టుకోవాలని హితవు పలికారు. మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్,  జెడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ, టెస్కాబ్‌ చైర్మన్‌ రవీందర్‌రావు, బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement