AIADMK: ఊ అంటారా.. ఊహూ అంటారా ! | Sakshi
Sakshi News home page

AIADMK: ఊ అంటారా.. ఊహూ అంటారా !

Published Sat, Jul 9 2022 7:58 AM

Madras High Court to hear on Monday plea to stall AIADMK July 11 general council meet - Sakshi

సాక్షి, చెన్నై: సర్వసభ్య సమావేశం విషయంలో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ‘ఊ’అంటూ మార్గాన్ని సుగమం చేసేనా...లేదా ‘ఊ..హూ’అంటూ అడ్డు పడేనా అన్న ఉత్కంఠ అన్నాడీఎంకే నెలకొంది. సోమవారం ఉదయం 9.15 గంటల నుంచి పది గంటలలోపు సమావేశం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అదే రోజు ఉదయం 9 గంటలకు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించేందుకు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శుక్రవారం నిర్ణయించారు. అన్నాడీఎంకేలో పన్నీరు సెల్వం, ఎడపాడి పళని స్వామి మధ్య సాగుతున్న వార్‌ తారా స్థాయికి చేరిన విషయం తెలిసిందే. 

పళని ప్లాన్లు..
పన్నీరు సెల్వంను పార్టీ నుంచి శాశ్వతంగా సాగనంపి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టేందుకు ఎడపాడి పళని స్వామి వ్యూహాలకు పదును పెట్టారు. ఇందు కోసం ఈనెల 11వ తేదీ ఉదయం వానగరం శ్రీవారు వెంకటాచలపతి ప్యాలెస్‌ వేదికగా సర్వసభ్య సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశం ఉదయం 9.15 గంటల నుంచి 10 గంటలలోపు ప్రారంభం అవుతుందని ముందుగానే ప్రకటించారు. ఇందుకు తగ్గ ఆహ్వానాలు సభ్యులకు పంపించారు.

2441 మంది సభ్యులు ఈనెల 10వ తేదీ ఉదయానికి చెన్నైకి చేర్చేందుకు ఏర్పాట్లు చేశారు. వీరి కోసం చెన్నైలో పలు చోట్ల ప్రత్యేక క్యాంపుల్లో వసతి సౌకర్యాలు సిద్ధం చేశారు. అలాగే, పార్టీ పరంగా ఉన్న 75 జిల్లాల కార్యదర్శుల పర్యవేక్షణలో  సభ్యుల హాజరు వివరాల సేకరణకు ప్రత్యేక సాంకేతికను ఉపయోగించేందుకు నిర్ణయించారు. శరవేగంగా సర్వ సభ్య సమావేశ ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం హైకోర్టు ప్రత్యేక బెంచ్‌ చేసిన ప్రకటన అన్నాడీఎంకే వర్గాలను ఉత్కంఠలో పడేసింది. 

చదవండి: (Priya Anand: 'నిత్యానందస్వామిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా')

వాడీ వేడిగా వాదనలు 
అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశానికి స్టే విధించాలని కోరుతూ పన్నీరు సెల్వం దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట వాదనలు జరిగాయి. స్టే విధించాల్సిన అవసరం లేదని, వ్యక్తిగత స్వలాభం కోసం పన్నీరు సెల్వం అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని పళని స్వామి తరఫున వాదనలు వినిపించారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ సోమవారం ఉదయం 9 గంటలకు ఉత్తర్వులు వెలువరిస్తామ న్నారు. అయితే, శనివారం లేదా ఆదివారం ఉత్తర్వులు వెలువరించాలని పన్నీరు సెల్వం తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేసినా న్యాయమూర్తి అంగీకరించ లేదు.

అయితే, సర్వసభ్య సమావేశానికి కోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు వెలువరిస్తుందన్న ఆశాభావం పన్నీరు వర్గంలో వ్యక్తమవుతోంది. అదే సమయంలో సమావేశానికి వ్యతిరేకంగా ఏదైనా ఉత్తర్వులు వెలువడిన పక్షంలో సీజే బెంచ్‌ లేదా, ద్విసభ్య బెంచ్‌ను ఆశ్రయించి అడ్డంకులను తొలగించుకునేందుకు తగ్గ ముందస్తు కసరత్తుల్లో పళని స్వామి తరఫున న్యాయవాదులు ఉన్నారు. అయితే, 9.15 గంటలకు సమావేశం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో 9 గంటలకు ఉత్తర్వుల ప్రకటనతో న్యాయమూర్తి ‘ఊ.. అంటారా.. ఊహూ’అంటారా..? అనే ఉత్కంఠ పన్నీరు, పళని శిబిరాలతో పాటు, అన్నాడీఎంకే కేడర్‌లోనూ నెలకొంది.  

Advertisement
Advertisement