కల్వకుర్తి: బీఆర్‌ఎస్‌కు మైనస్‌! కాంగ్రెస్‌ కంటే బీజేపీనే బలంగా.. | Sakshi
Sakshi News home page

కల్వకుర్తి: కాంగ్రెస్‌ కంటే బీజేపీనే బలంగా.. బీఆర్‌ఎస్‌కూ మైనస్‌!

Published Wed, Aug 9 2023 1:24 PM

Mahabubnagar: Who Next Incumbent in Kalwakurthy Constituency - Sakshi

నాగర్‌ కర్నూల్ జిల్లాలో చైతన్యవంతులైన ఓటర్లు ఉన్న నియోజకవర్గం కల్వకుర్తి. ఇక్కడి ప్రజలు విలక్షణ తీర్పునిస్తారు. టీడీపీ వ్యవస్దాపకుడు ఎన్టీఆర్‌ను సైతం ఓడించి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్దితులు హాట్‌టాపిక్‌గా సాగుతున్నాయి. ఇక్కడ వచ్చే ఎన్నికల్లో బహుముఖ పోటీ అనివార్యం కానుంది.

నియోజకవర్గం పేరు: కల్వకుర్తి
మండలాల సంఖ్య: 6 (కల్వకుర్తి , వెల్దండ, ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల, కడ్తాల్)
మొత్తం గ్రామపంచాయతీలు: 164
మున్సిపాలిటీలు: కల్వకుర్తి, ఆమనగల్లు
ప్రభావితం చూపే పంచాయితీ: మాడ్గుల 
మొత్తం ఓటర్లు: 2,17,042
పురుషులు: 1,10,975;  మహిళలు: 1,06,061

2014లో కాంగ్రెస్‌ అభ్యర్ది వంశీ చందర్‌రెడ్డి కేవలం 78 ఓట్ల మెజార్టీతో సమీప బీజేపీ అభ్యర్ది ఆచారిపై గెలిచారు. 2018లో టీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ 3447 ఓట్ల మెజార్టీలో సమీప బీజేపీ అభ్యర్ది ఆచారిపై గెలిచారు. అధికార టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మధ్య  విభేదాలు తీవ్రస్దాయిలో ఉన్నాయి. గ్రూపు రాజకీయాలతో ఇక్కడ కూడా పార్టీ క్యాడర్ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఇదీ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తోంది. 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీచేసిన కసిరెడ్డి నారాయణరెడ్డి తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరారు.ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ది జైపాల్యాదవ్  మూడో స్దానం నిలిచారు. కసిరెడ్డికి స్దానికసంస్దల తరపున ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వటంతో ఆయన గెలిచారు. 2018 ఎన్నికల్లో కసిరెడ్డి బీఆర్ఎస్ తరపున సీటు ఆశించారు.

ప్రోటోకాల్ రగడ.. ఆధిపత్యపోరు
కానీ పార్టీ మరోసారి జైపాల్‌ యాదవ్‌కు అవకాశం ఇచ్చింది. ఆ ఎన్నికల్లో పార్టీ అభ్యర్దికి కసిరెడ్డి సహకరించలేదు. అయినా జైపాల్‌ యాదవ్ గెలిచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. నియోజకవర్గంలో జరిగే ప్రతి సమావేశాల్లో ప్రోటోకాల్ రగడ.. ఆధిపత్యపోరు నడిచింది. విషయం అధిష్టానం దృష్టికి వెళ్లిన పెద్దగా పట్టించుకోలేదు. తిరిగి కసిరెడ్డి రెండవసారి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా గెలిచారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఇద్దరి మధ్య అదే గ్యాప్‌ కొనసాగుతుంది. తిరిగి వచ్చే ఎన్నికల్లో కూడా కసిరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. తన క్యాడర్‌ను కాపాడుకునేందుకు కావాల్సిన కసరత్తు చేస్తూనే ఉన్నారట. ఇప్పటికే రెండుసార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సహజంగా ప్రజల్లో ఉండే వ్యతిరేకతతో పాటు వర్గపోరు కూడా తలనొప్పిగా మారనుంది.

ఎవరికి సీటు ఇచ్చినా ఇంకోకరు ఎలా స్పందిస్తారో తెలియని అయోమయం పార్టీలో నెలకొంది. పార్టీలోని చిత్తరంజన్‌దాస్‌, ఉప్పల వెంకటేష్, జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్‌లు కూడా జైపాల్‌ యాదవ్‌ అభ్యర్దిత్వాన్ని వ్యతిరేకించటమే కాక ఆయనకు సీటు ఇస్తే సహకరించమని ఇటీవల కసిరెడ్డి నేతృత్వంలో ఓ ఫాంహౌజ్‌లో జరిగిన సమావేశంలో తేల్చిచెప్పారట. ఇక జైపాల్‌ యాదవ్‌ ఈ నాలుగేళ్లలో నియోజకవర్గంలో తన మార్క్ పని ఏది చేయలేదని..డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం కల్వకుర్తిలో జరిగినా పంపిణీ చేయటంలో జాప్యం చేస్తుండటం మైనస్‌గా మారింది. నామినేటెడ్ పోస్టుల భర్తీలో కూడ తీవ్ర జాప్యం వల్ల తనకోసం పనిచేసిన వారికి మేలు చేయలేక పోయారనే అపవాదు ఉంది.

అదే జైపాల్‌ యాదవ్‌ ధీమా
ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటంతో ఈసారి కూడా తనకే సీటు వస్తుందనే ధీమాలో ఉన్నారు జైపాల్‌ యాదవ్‌. ఈ నియోజకవర్గం గుండా రెండు జాతీయరహదారులు హైదరాబాద్-శ్రీశైలం,జడ్చర్ల, కోదాడ ఉండగా కొత్తగా కొట్రనుంచి నంద్యాల వరకు మరో జాతీయరహదారి మంజూరయ్యింది. నిత్యం వేలాదిగా వాహనాల రాకపోకలతో అనేక ప్రమాదాలు జరుగుతున్నా ఎక్కడ ట్రామా కేర్ సెంటర్‌ లేదు. కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రి వందపడకలు చేస్తామన్న హమీ నేటికీ నెరవేరకపోవటంతో జనాలు వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు పరుగులు పెట్టక తప్పటం లేదు. జైపాల్‌ యాదవ్‌, కసిరెడ్డి నారాయణరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి తనయుడు మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం కూడ సీటు ఆశిస్తున్నారు. ఇక్కడ బీసీ, రెడ్డి సామాజికవర్గాల మధ్య అధిపత్యపోరు కూడా జరుగుతోంది. కేవలం ప్రభుత్వ పథకాలపైనే భరోసా పెట్టి ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్దితి ఇక్కడి బీఆర్ఎస్ నేతల వంతవుతుంది.

కాంగ్రెస్‌ పార్టీ తరపున వంశీచందర్‌ రెడ్డి 2014లో స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఏఐసీసీ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2018లో ఆయన మూడోస్దానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. తర్వాత ఆయన  నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోవటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీ కార్యక్రమాలు సైతం చేయటం లేదట. ఆయన రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారని సొంత పార్టీనేతలు గుసగుసలాడుతున్నారు. దీంతో పార్టీ క్యాడర్ కూడ తమ దారితాము చూసుకుంటున్నారు. ఐక్యతా ఫౌండేషన్ పేరుతో ఎన్‌ఆర్‌ఐ రాఘవేందర్‌రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కాంగ్రెస్‌ను నడిపించే నాయకుడే లేడా..
ఆయన కూడ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. సీటు వస్తే కాంగ్రెస్‌ నుంచి లేకుంటే ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేయాలనే అలోచనలో ఉన్నాడట. మరోవైపు తలకొండపల్లి జడ్పీటీసీ సభ్యుడు ఉప్పల వెంకటేష్ కూడ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారట. సీటు కూడ కావాలని కోరుతున్నట్టు ప్రచారం సాగుతుంది. పార్టీ నేతలతో సంప్రదింపులు కూడ జరిగాయట. కానీ సీటు గ్యారెంటీ లేదని చెప్పినట్టు తెలుస్తోంది. మరి ఆతని నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం కాంగ్రెస్‌ నడిపించే నాయకుడే కరువయ్యాడు. పారిశ్రామిక వేత్త జూపల్లి గ్రామానికి చెందిన భాస్కర్‌రావు తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు.

ఈయన 2014లో వంశీచందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలువటంలో  కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఏఐసీసీ వ్యవహారాల్లో బిజీబిజీగా ఉంటున్న వంశీచందర్‌రెడ్డి ఈసారి కల్వకుర్తి నుంచి పోటీ చేసే అవకాశంలేదనే ప్రచారం సాగుతుంది. అయితే ఆయన సూచించిన వ్యక్తికే సీటు ఇచ్చే అవకాశం మాత్రం లేకపోలేదు. అందుకే ఆయన వ్యూహత్మకంగా జూపల్లి భాస్కర్‌రావును ప్రోత్సహిస్తున్నట్టు పార్టీలో టాక్ నడుస్తోంది. ఎలాగైన వచ్చే ఎన్నికల్లో గెలవాలని భావిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న వ్యతిరేకత, రుణమాఫి, డబుల్‌ బెడ్‌రూం రూం ఇళ్ల నిర్మాణం వంటి అశలు తమకు కలిసివస్తాయని భావిస్తుంది. 

బీజేపీకి బలంగా మారిన అధికార పార్టీ గ్రూపు రాజకీయాలు
ఇక బీజేపీ ఈ నియోజకవర్గంలో బలంగా ఉంది. రెండు ఎన్నికల్లో స్వల్ప తేడాలో ఆ పార్టీ అభ్యర్ది తల్లోజు ఆచారి ఓటమి చెందారు. తర్వాత ఆయన జాతీయ బీసీ కమీషన్ సభ్యుడిగా నియమితులయ్యారు. మరోసారి ఆయన ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అయితే బీజేపీ ఈసారి ఇక్కడ గెలిచి తీరాలని టార్గెట్ పెట్టుకుంది. అయితే ఇక్కడ బీజేపీ పాత నేతలు, కార్యకర్తలు కొత్తవారిని పార్టీలోకి రానివ్వటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆచారి నియోజకవర్గంలో ఆశించిన స్దాయిలో అందుబాటులో ఉండటం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలోని ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల, కడ్తాల్ మండలాలు రంగారెడ్డి జిల్లాలో ఉండటంతో కొంత బీజేపీకి మేలు జరుగుతుందని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేకత.. టీఆర్ఎస్‌లో గ్రూపు తగాదాలు..మోదీ చరిష్మా ఈ సారి తప్పకుండా బీజేపీని గెలిపిస్తోందని ఆపార్టీ నేతలు భావిస్తున్నారు. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో కల్వకుర్తి సెగ్మెంట్ పోరు రసవత్తరంగా మారనుంది.

నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు:
ఈ నియోజకవర్గం ఇటు నాగర్కర్నూల్ అటూ రంగారెడ్డి జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. హైదరాబాద్ -శ్రీశైలం,కోదాడ-జడ్చర్ల,కొట్ర-నంద్యాల మధ్య మూడు జాతీయ రహదారులు గల నియోజకవర్గంగా ఉంది. దుందుభీ నదీ ప్రవాహం ఉంటుంది.

ఆలయాలు: రెండవ భద్రాదీగా పేరున్న సీతారామచంద్రస్వామి ఆలయం సిర్సనగండ్లలో ఉంది. కడ్తల్లో మైసిగండి ఆలయం ఉంది.

ప్రధానంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తికాకపోవటం, నిర్వాసితులకు సరైన పరిహారం అందకపోవటంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ఈ ప్రభావం ఎన్నికలపై  ఉండే అవకాశం ఉంది. ఉపాధి అవకాశాల కోసం ఎలాంటి పరిశ్రమల స్దాపన చేయకపోవటంతో ఆ వర్గం ఓట్లు కూడ బీఆర్ఎస్‌కు మైనస్ కానుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement