మరో రాష్ట్రంలో లవ్ జిహాద్ చట్టం..? | Sakshi
Sakshi News home page

మరో రాష్ట్రంలో లవ్ జిహాద్ చట్టం..?

Published Sat, Aug 5 2023 8:06 PM

Maharashtra May Bring Its Own Love Jihad Law - Sakshi

ముంబయి: లవ్ జిహాద్ చట్టాన్ని దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఆ జాబితాలో త్వరలో మహారాష్ట్ర కూడా చేరనుంది. ఇదే విషయాన్ని రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. మహారాష్ట్రాలోనూ లవ్ జిహాద్ చట్టాన్ని ప్రవేశపెట్టాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్ వస్తున్నట్లు చెప్పారు. పలు రాష్ట్రాల్లో తీసుకువచ్చిన ఈ చట్టాన్ని సమగ్రంగా విశ్లేషించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని స్ఫష్టం చేశారు. 

హిందూ యువతులను వివాహం పేరిట మతమార్పిడీకి పాల్పడే కుట్ర జరుగుతోందని బీజేపీ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో దీనిని అరికట్టడానికి ఇప్పటికే పలు రాష్ట్రాలు చట్టాన్ని కూడా తీసుకువచ్చాయి. 

'పెళ్లి పేరిట యువతులపై మతమార్పిడీకి పాల్పడుతున్నారనే కేసులు వస్తున్నాయి. రాష్ట్రంలో అన్ని వర్గాల నుంచి చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ ఉంది. ఇదే విషయాన్ని గతంలోనూ అసెంబ్లీలో ప్రస్తావించాను. పలు రాష్ట్రాలు తీసుకువచ్చిన లవ్ జిహాద్ చట్టంపై అధ్యయనం చేస్తున్నాం. అనంతరం మహారాష్ట్రాలోనూ ఆ చట్టాన్ని తీసుకువస్తాం' అని దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.

మోదీ వ్యాఖ్యల పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు స్టే విధించిన అంశంపై ఫడ్నవీస్ స్పందించారు. కోర్టు తీర్పు తమకు అనుగుణంగా రాగానే కాంగ్రెస్ వేడుకలు జరపడంపై ఆయన ఆక్షేపించారు. కొందరు రాజ్యాంగ విలువలను నాశనం చేస్తున్నారని కాంగ్రెస్‌ను ఉద్దేశించి దుయ్యబట్టారు. ఈ మేరకు మహారాష్ట్ర పోలీసు అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్‌కి హాజరైన అనంతరం ఫడ్నవీస్ మాట్లాడారు. రాష్ట్రంలో త్వరలో 18000 పోలీసు రిక్రూట్‌మెంట్ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.       

ఇదీ చదవండి: మోదీ-యోగీ సోదరీమణుల ఆత్మీయ ఆలింగనం..

Advertisement
Advertisement