Malla Reddy Fires On EX MLA Sudheer Reddy And ZP Chairperson, Details Inside - Sakshi
Sakshi News home page

సమావేశాని​కి పిలవాల్సిన అవసరమేంటి? వారే రావాలి: మంత్రి మల్లారెడ్డి

Published Wed, Apr 26 2023 1:52 PM

Malla Reddy Fires EX Mla Sudheer Reddy And ZP chairperson - Sakshi

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: రానున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) బలోపేతమే లక్ష్యంగా చేపట్టిన ఆత్మీయ సమ్మేళనాలు కాస్తా.. నేతల మధ్య చాపకింద నీరులా అంతర్గతంగా కొనసాగుతున్న విభేదాలు బహిర్గతమవడంతో కేడర్‌ తీవ్ర అయోమయానికి గురవుతోంది. మంగళవారం దేవరయాంజల్‌లో జరిగిన మేడ్చల్‌ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనానికి మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిపెద్ది సుధీర్‌రెడ్డి, ఆయన తనయుడు జెడ్పీ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి దూరంగా ఉండటంపై కార్యకర్తల్లో చర్చ సాగుతోంది. 

అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం..
సమ్మేళనానికి ఆహ్వానం లేకపోవటం వల్లే హాజరు కాలేదని సుధీర్‌రెడ్డి, శరత్‌చంద్రారెడ్డి పేర్కొంటుండగా, వారిని పిలవాల్సిన అవసరమేంటి..? వారే రావాలని మంత్రి మల్లారెడ్డి వాదిస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాల్లో అందరూ పాల్గొనాలని అధిష్టానమే ఆదేశించిందని, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధీర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డిని తాను పిలవడం ఏంటని.. వారే రావాలి కదా అని మంత్రి మల్లారెడ్డి పేర్కొంటున్నారు.

గతంలో మండల, పురపాలక స్థాయి సమావేశాల్లో పాల్గొన్న వారిని.. ఎవరు పిలిస్తే వచ్చారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై జెడ్పీ చైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డి మాట్లాడుతూ ఆ సమావేశాలకు ఆహ్వానం ఉండటం వల్లే పాల్గొన్నామని తెలిపారు. మంత్రి మల్లారెడ్డి వ్యవహారాన్ని, ఆత్మీయ సమ్మేళనాలకు ఆహ్వానించని విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.    

ఆత్మీయ సమ్మేళనాలు ఇలా.. 
మేడ్చల్‌ జిల్లాలో దాదాపు నెల రోజులుగా మండల, పురపాలక సంఘాలు, అసెంబ్లీ నియోజకవర్గం స్థాయిల్లో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తున్నారు. ఆతీ్మయ సమ్మేళనాల విజయవంతం కోసం మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాకు పార్టీ సమన్వయకర్తగా ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డిని అధిష్టానం నియమించింది. మార్చి 24 నుంచి జిల్లాలో బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతుండగా, మేడ్చల్‌ నియోజకవర్గంలో మాత్రం 10 పురపాలక సంఘాలు, 5 మండలాల సమావేశాలకు 6 పురపాలికలు, 4 మండలాల్లో మాత్రమే జరిగాయి. ఇంకా పీర్జాదిగూడ, ఘట్‌కేసర్, నాగారం, దమ్మాయిగూడ పురపాలక సంఘాలతోపాటు ఎంసీపల్లి మండలంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాల్సి ఉంది. 

గతంలో ఐదుగురు ఎమ్మెల్యేల తిరుగుబాటు..
మేడ్చల్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌ నేతల మధ్య అంతర్గంగా కొనసాగుతున్న విభేదాలు ఆత్మీయ సమ్మేళనాలతో పోతాయని భావించినా.. మరింత ముదురుతుండటంతో పరిస్థితి ఎక్కడి దారి తీస్తుందోనని పార్టీ కేడర్‌ ఆందోళన చెందుతోంది. గతంలోనే మంత్రి మల్లారెడ్డిపై జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయగా, ఇంత వరకు ఇది ఓ కొలిక్కివచ్చిన దాఖలాలు లేవు. గతంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హన్మంతరావు ఇంట్లో సమావేశమైన ఐదుగురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి నిధుల విషయంలో మంత్రి మల్లారెడ్డి జోక్యాన్ని తప్పుబట్టారు.

ఈ వ్యవహారాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామని వారు పేర్కొన్న విషయం తేల్సిందే. అలాగే, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ ఆదేశాలను ఖాతర్‌ చేయకుండా నామినేటెడ్‌ పదవులను కూడా మంత్రి మల్లారెడ్డి సొంత నియోజకవర్గం వారికి కట్టబెట్టారని ఆ సందర్భంలో ఎమ్మెల్యేలు ఆరోపించిన విషయం తేల్సిందే. ఈ వ్యవహారం ఇంకా చక్కబడకపోగా, నివురుగప్పిన నిప్పులా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.  

పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా..
జిల్లాలోని మేడ్చల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి వర్సెస్‌ మాజీ ఎమ్మెల్యే సు«దీర్‌రెడ్డి, ఉప్పల్‌లో ఎమ్మెల్యే భేతి సుభా‹Ùరెడ్డి, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్, కుత్బుల్లాపూర్‌లో ఎమ్మెల్యే వివేకానందగౌడ్, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌ శంభీపూర్‌ రాజు మధ్య విభేదాలు తారస్థాయిలో ఉన్నాయి. కూకట్‌పల్లిలో కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇద్దరూ తమ గ్రూపులను ప్రోత్సహిస్తున్నట్లు పార్టీ కేడర్‌లో గుసగుసలు వ్యక్తం అవుతున్నాయి.

జిల్లాలోని 13 పురపాలక సంఘాలోŠల్‌ అధికార పార్టీ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు ఉన్నప్పటికీ వారి మధ్యనే విభేదాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా కొనసాగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని డివిజన్లతో సహా పలు గ్రామాల్లో కూడా పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య అంతర్గత విభేదాలు చాపకింద నీరులా కొనసాగుతున్నాయి. 

మూడింటిలో తారస్థాయిలో..
మేడ్చల్‌ జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ఇందులో మేడ్చల్, ఉప్పల్, కుత్బుల్లాపూర్‌ మినహాయించి మిగతా కూకట్‌పల్లి, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు సాఫీగానే కొనసాగుతున్నాయి. ఉప్పల్, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాల్లో చాపకింద నీరులా నాయకుల మధ్య అంతర్గత విభేదాలు కొనసాగుతున్నా.. ఆత్మీయ సమ్మేళనాలు మాత్రం సజావుగా నిర్వహిస్తున్నారు. మేడ్చల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఆత్మీయ సమ్మేళనాల తీరు నేతల మధ్య ఆధిపత్య పోరుకు ఆజ్యం పోస్తోంది.

ఇటీవల బోడుప్పల్‌ పురపాలక సంఘంలో జరిగిన బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం దీనికి నిదర్శంగా నిలుస్తోంది. బోడుప్పల్‌ సమ్మేళనంలో మంత్రి చామకూర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి మధ్య నాలుగేళ్లుగా కొనసాగుతున్న విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా సమన్వయకర్త, పార్టీ ఇన్‌చార్జి ఎమ్మెల్సీ, రాష్ట్ర రైతుబంధు చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమక్షంలోనే ఇరువురు నేతలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ.. వాగ్వాదాలకు దిగడం పార్టీ కేడర్‌ను తీవ్ర అయోమయానికి గురిచేసింది.  

Advertisement
Advertisement