ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటూ చర్చలా.. | Sakshi
Sakshi News home page

ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటూ చర్చలా..

Published Sat, Aug 28 2021 6:08 PM

Minister Botsa Satyanarayana Comments On Chandrababu - Sakshi

సాక్షి, విజయనగరం:  ఉత్తరాంధ్ర అభివృద్ధిని కోర్టు వ్యాజ్యాలతో అడ్డుకుంటూ మళ్లీ అదే అంశంపై అఖిలపక్ష చర్చలు ఏ ముఖంతో పెడుతున్నారని విపక్షాలపై పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా  శనివారం విజయనగరానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధే లక్ష్యంగా తీసుకొచ్చిన మూడు రాజధానుల విధానాన్ని అడుగడుగునా అడ్డుకున్నది మీరు (ప్రతిపక్షాలు) కాదా అని ప్రశ్నించారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం విశాఖలో చేపడుతున్న పలు కార్యక్రమాలను ఒకవైపు కోర్టుల్లో వ్యాజ్యాలు వేసి అడ్డుకుంటూ.. ఇప్పుడిలా మొసలి కన్నీరు కార్చుతుండడాన్ని తప్పుబట్టారు. ప్రతిపక్ష బాధ్యతలను వదిలేసి  హైదరాబాదులో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేపడితే ఇక్కడి ప్రజలకు చంద్రబాబు వేషాలు తెలియవను కుంటున్నారని ధ్వజమెత్తారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటుకు అమ్మేస్తామని గతంలోనే బీజేపీ ప్రకటించినా, అప్పట్లో కేంద్రమంత్రిగా పనిచేసిన అశోక్‌గజపతిరాజు పట్టించుకోలేదని బొత్స గుర్తు చేశారు. కరోనా కాలంలో అప్పులు చేసినా.. ప్రజల జీవన ప్రమాణాలను పెంచామని వివరించారు. దీనిని వ్యతిరేకిస్తున్నచంద్రబాబు.. తన పాలనలో అప్పు చేసిన రూ.2.5 లక్షల కోట్లు ఎక్కడ దాచుకున్నారో చెప్పాలని మంత్రి డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి:
సినిమా స్టైల్లో అదిరిపోయే ట్విస్ట్‌: నిన్న షాక్‌.. నేడు ప్రేమపెళ్లి
పాలగుమ్మిలో అరుదైన నీటికుక్కల సందడి 

Advertisement
Advertisement