వారంటీ లేని పార్టీ ఇచ్చే గ్యారంటీని నమ్మొద్దు   | Sakshi
Sakshi News home page

వారంటీ లేని పార్టీ ఇచ్చే గ్యారంటీని నమ్మొద్దు  

Published Sat, Sep 30 2023 4:24 AM

Minister KTR Comments On PM Modi and Congress Party - Sakshi

వనపర్తి: కాంగ్రెస్‌కు కాలం చెల్లింది..వారంటీ లేని ఆ పార్టీ ఇచ్చే గ్యారంటీలను ప్రజలు నమ్మొద్దు.. ప్రజల సంక్షేమాన్ని వదిలేసి స్కామ్‌లపై దృష్టి సారించిన చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ను నమ్మితే కన్నీళ్లే గతి’ అని  మంత్రి కేటీఆర్‌ అన్నారు. వనపర్తి జిల్లాలో రూ.669.67 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంబోత్సవాలు, శంకుస్థాపనలు శుక్రవారం జరిగాయి. అనంతరం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల  క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన ‘వనపర్తి పదేళ్ల ప్రగతి మహాసభ’లో కేటీఆర్‌ ప్రసంగించారు. బీఆర్‌ఎస్‌ను నమ్మి పదేళ్లు అధికారం ఇస్తే అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగాన నిలిపి చూపించామని చెప్పారు.

బీఆర్‌ఎస్‌ వచ్చాకే సాగునీటితో పాలమూరు పచ్చబడిందన్నారు. కాంగ్రెస్‌ను నమ్మి ఓటేస్తే.. మళ్లీ మూడు గంటల కరెంటు, తాగునీటి కోసం కుళాయిల వద్ద మహిళల కోట్లాటలు చూడాల్సి వస్తుందని, ఏడాదికో సీఎం మారుతూ.. ఢిల్లీ నుంచి సీల్డ్‌ కవర్‌లో రాష్ట్రానికి సీఎంలు దిగుమతి అవుతారన్నారు. కృష్ణానది నీటిలో రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన వాటా 575 టీఎంసీలను కేటాయిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం పాలమూరులో నిర్వహించనున్న సభలో హామీ ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

కృష్ణా నీటిలో రాష్ట్రవాటా తేల్చాలని ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేఖలు రాసినా, కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవటం తెలంగాణపై వారికున్న కక్ష్య సాధింపునకు నిదర్శనమేనన్నారు. రాష్ట్రంలో ఎన్నికలొస్తున్న సమయంలో ఓట్ల కోసం ప్రధాని నరేంద్రమోదీ మాయగాడి పర్యటనలు చేసేందుకు వస్తున్నారని విమర్శించారు. ఎగువన ఉన్న కర్ణాటక అప్పర్‌భద్రకు జాతీయహోదా కల్పించిన కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా కల్పించటంలో వివక్ష చూపిస్తోందని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఒకేలా చూడాలని కానీ తెలంగాణ ప్రస్తావన వచ్చే సరికి ‘తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు’ అంటూ నిద్దయ వ్యాఖ్యలు చేస్తారని, తెలంగాణ సమాజం ఈ విషయాన్ని గమనించి వచ్చే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఎంపీల మద్దతు లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి రావాలన్నారు. వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు రెండుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే.. కనీసం ఆ విషయాన్ని ఇప్పటి వరకు పట్టించుకోలేదని మండిపడ్డారు.  

అభివృద్ధిలో రాష్ట్రంలోనే అగ్రగామి జిల్లాలుగా పేరొందిన సిరిసిల్ల, సిద్దిపేటలను అనుసరిస్తూ.. వాటితో పోటీ పడుతున్నామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్‌ అందించిన శక్తి, ప్రోత్సాహంతో దశాబ్దాలుగా చేసిన అభివృద్ధికి మించి పదేళ్లలో వనపర్తిని అభివృద్ధి చేసి చూపించానన్నారు. 2014కు ముందు చెంతనే జీవనది కృష్ణమ్మ ఉన్నా.. సాగునీటి కష్టాలు ఉండేవవి, ఈ పదేళ్లలో రెండు గ్రామాలు మినహా వనపర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కృష్ణానది జల సవ్వడి వినిపించేలా చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు పోతుగంటి రాములు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అబ్రహం, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement