వంద సీట్లున్న ప్రభుత్వం ఎలా కూలుతుంది?  | Sakshi
Sakshi News home page

వంద సీట్లున్న ప్రభుత్వం ఎలా కూలుతుంది? 

Published Sat, Apr 9 2022 3:14 AM

Minister Satyavati Rathod Reacts On Governor Tamilisai Comments - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తీరు బీజేపీ కార్యకర్త మాదిరిగా ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ విమర్శించారు. అసెంబ్లీలో 119 స్థానాలకుగాను వంద సీట్లున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎలా కూలుతుందో గవర్నర్‌ స్పష్టత ఇవ్వాలన్నారు. ఈ వ్యాఖ్యలను చూస్తుంటే గవర్నర్‌ ఆంతర్యం, మనస్తత్వం తెలిసిపోతోందన్నారు.

శుక్రవారం బంజారాహిల్స్‌లో నిర్మిస్తున్న ఆదివాసీ భవన్, గిరిజన భవన్‌ను మంత్రి సందర్శించారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడారు. ‘సీఎం కేసీఆర్‌ మాటలతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారని గవర్నర్‌ అనడాన్ని చూస్తే ఆమె ఫక్తు బీజేపీ కార్యకర్తగా మాట్లాడినట్టు అనిపిస్తోంది. అత్యున్నతమైన గవర్నర్‌ స్థానంలో ఉండి మాట్లాడినట్లు అనిపించడం లేదు.

ఆమె మాట్లాడిన ప్రతి మాటను ఆలోచించుకోవాలి. గవర్నర్‌గా మాట్లాడారా? లేదా బీజేపీ కార్యకర్తగా మాట్లాడారా? అనేది ఆమె తేల్చుకోవాలి’అని అన్నారు. గవర్నర్‌కు అవమానం జరిగితే అనేక వేదికల మీద చెప్పుకునే అవకాశం ఉందని, మేడారంలో గానీ, మన్ననూరులో గానీ చెప్పుకోవచ్చని పేర్కొన్నారు.

కానీ ఢిల్లీకి వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసిన తర్వాతే తెలంగాణ ప్రభుత్వం మీద, కేసీఆర్‌ మీద విమర్శలు చేయడం చూస్తుంటే, ఆమె బీజేపీ కార్యకర్తగా మాట్లాడినట్లు కనిపిస్తోందని దుయ్యబట్టారు. ఆమెను గవర్నర్‌గా చాలా గౌరవించామని, కానీ తాను తలచుకుంటే ఈ ప్రభుత్వం కూలిపోయేదని అనడం సరికాదన్నారు.

Advertisement
Advertisement