సీతారామ ప్రాజెక్టు భారీ కుంభకోణం: మంత్రి ఉత్తమ్‌

19 Jan, 2024 19:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీతారామ ప్రాజెక్టు భారీ కుంభకోణమని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ధ్వజమెత్తారు. స్వతంత్ర భారత దేశంలో ఇంతటి భారీ కుంభకోణం చూడలేదని అన్నారు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని విమర్శించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నీటి పారుదల ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఇరిగేషన్ కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఈఎన్సీ మురళీధర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులు,సీతారామ ప్రాజెక్టు అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఒక్కో ప్రాజెక్టుపై సమీక్ష చేస్తున్నామని, ఇందులో భాగంగా ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ, ఇతర సాగునీటి ప్రాజెక్టు పనుల వేగవంతంపై చర్చించామని తెలిపారు. ఈ ప్రాజెక్టు గతంలో రాజీవ్‌ దుమ్ముగూడ, ఇందిరాసాగర్‌.. అని రెండు వేర్వేరుగా ఉండేవని. ఆ రెండింటినీ ఏ విధంగా ఒక్కటి చేసి సీతారామ ప్రాజెక్టుగా తీర్చిదిద్దారో తెలియడం లేదన్నారు.

గత ప్రభుత్వంలో సీఎంగా ఉన్న కేసీఆర్‌ సైతం సీతారామ ప్రాజెక్టుపై  అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. 2014లో  బీఆర్‌ఎస్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చినప్పుడు మరో 1,400  కోట్లు ఖర్చు చేస్తే దుమ్ముగూడ, ఇందిరాసాగర్‌ ప్రాజెక్టులు ఏడాదిలో పూర్తయ్యేవని కేసీఆర్‌ చెప్పినట్లు గుర్తిచేశారు. అయితే పదేళ్లు అయినా అవి పూర్తి కాలేదని దుయ్యబట్టారు. ప్రాజెక్టు పూర్తయితే 3 లక్షలకు పైగా ఆయకట్టుకు నీళ్ళు అప్పుడే వచ్చేదని... కానీ ఇప్పటికీ ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ రూ. 1,681కోట్ల ప్రాజెక్టు మాత్రమేనని.. 2014 నాటికి 7వందల కోట్లు ఖర్చు చేస్తే అయిపోయే ప్రాజెక్టు అని తెలిపారు. రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్‌ రెండు ప్రాజెక్టులు రూ. 1552 కోట్లు ఖర్చు చేస్తే అయిపోయేవని అన్నారు. 3 లక్షల 30 వేల ఎకరాలకు నీళ్ళు  వచ్చేమని పేర్కొన్నారు.

వీటిని రీడిజైన్ చేసి.. రెండు ప్రాజెక్టులు కలిపి సీతారామ అని పేరు పెట్టి 18వేల కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. రూ.7500 కోట్లు అదనంగా ఖర్చు చేశారని మండిపడ్డారు.  1,500 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్ట్‌ను 22 వేల కోట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు. ఇప్పటికే 9 వేల కోట్లు ఖర్చు చేసినా.. ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఇంతటి దోపిడి నుంచి రాష్ట్రాన్ని కాపాడటానికి ప్రజలు సహకరించాలని కోరారు. బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన దోపిడి చూస్తుంటే కడుపు తరుక్కుపోతోదన్నారు. 

>
మరిన్ని వార్తలు