నువ్వా నేనా... | Sakshi
Sakshi News home page

నువ్వా నేనా...

Published Thu, Oct 19 2023 3:48 AM

In Nalgonda district the contest is between BRS and Congress - Sakshi

దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన ఉద్ధండుల పురిటిగడ్డ నల్లగొండ. అణువణువునా చైతన్యం.. అన్యాయంపై పిడికిలెత్తిన పోరాటం ఈ జిల్లా సొంతం. ఆ పోరాట పటిమ స్ఫూర్తిగానే వామపక్ష రాజకీయాలకు పెట్టని కోటగా నిలిచింది నల్లగొండ. 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ఎర్రజెండాకు పట్టం కట్టిన జిల్లా ప్రజలు తరువాతి కాలంలో టీడీపీ, వామపక్ష కూటమికి, ఆ తర్వాత కాంగ్రెస్‌కు అధిక స్థానాలను ఇచ్చి అండగా నిలవగా, తెలంగాణ రాష్ట్రంలో అధిక స్థానాలను కట్టబెట్టి టీఆర్‌ఎస్‌ను ఆదరించారు. ఇలా కాలానుగుణంగా ఎప్పటికప్పుడు విలక్షణ తీర్పు  ఇస్తున్నారు. 

స్వరాష్ట్రంలో క్రమంగా బీఆర్‌ఎస్‌ పరం 
తెలంగాణ ఉద్యమ సమయం నుంచి జిల్లా ఓటర్లలో భిన్నమైన మార్పు వచ్చింది.  తెలంగాణ తెచ్చిన పార్టీగా టీఆర్‌ఎస్‌ను, ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ను 2014 ఎన్నికల్లో రెండింటినీ ఆదరించిన జిల్లా ఓటర్లు ఆ తర్వాత అభివృద్ధి వైపు మళ్లారు. 2014 ఎన్నికల్లో జిల్లాలోని 12 స్థానాల్లో కాంగ్రెస్‌ను ఐదు స్థానాల్లో, టీఆర్‌ఎస్‌ను ఆరు స్థానాల్లో, సీపీఐని ఒక స్థానంలో గెలిపించారు.  2018 ఎన్నికల్లో జిల్లాలోని 12 స్థానాలకు గాను 9 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులనే గెలిపించారు.

నకిరేకల్‌లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన లింగయ్య టీఆర్‌ఎస్‌లో చేరారు. అదే ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేసి ఎంపీగా వెళ్లారు. దీంతో అక్కడ వచ్చిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి  సైదిరెడ్డి గెలుపొందారు. మునుగోడులోనూ  రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌  నుంచి ప్రభాకర్‌రెడ్డి గెలుపొందారు. ఇలా 12 స్థానాలు గులాబీ ఖాతాలోకి వెళ్లాయి.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈసారి ప్రధాన పోటీ బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్యే ఉండనుంది. 
ఈ దఫా బీఆర్‌ఎస్‌ పట్టు నిలిచేనా? 
జిల్లాలోని 12 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ అన్నింటిని దక్కించుకొని పట్టు నిలుపుకోవాలని శతవిధాలుగా ప్రయత్నం చేస్తోంది. కానీ పార్టీకి అసంతృప్తుల రూపంలో తంటాలు తప్పేలా లేవు. నల్లగొండ, కోదాడ, దేవరకొండ, నాగార్జునసాగర్‌ నియోజకవర్గాల్లో సొంత పార్టీ నుంచే తంటాలు మొదలయ్యాయి.

కోదాడ, దేవరకొండ, నాగార్జునసాగర్‌ నియోజకవర్గాల్లో అసంతృçప్తులు, ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థులను వ్యతిరేకిస్తున్న వారు ఇంకా తమ వర్గాలతో ప్రత్యేక భేటీలు కొనసాగిస్తూనే ఉన్నారు. జిల్లా కేంద్రాలైన నల్లగొండ, సూర్యాపేట నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వెళ్లిన అసంతృప్తులు పోటీలో నిలిచే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అసంతృప్తులను చల్లార్చి, తమ పట్టు నిలుపుకోవడం బీఆర్‌ఎస్‌కు కత్తిమీద సామువంటిదే.  

కాంగ్రెస్‌కు పూర్వ వైభవం వచ్చేనా.. 
పూర్వ వైభవం కోసం కాంగ్రెస్‌ పార్టీ తహతహలాడుతోంది. 1999 ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ కూటమి విజయం సాధించి రాష్ట్రంలో అధికారం చేపడితే, జిల్లాలో ఆ మాత్రం కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఆ తర్వాత 2004, 2009లో కూడా సగం కంటే ఎక్కువ స్థానాలతో జిల్లాలో తమ పట్టును నిలుపుకున్న కాంగ్రెస్‌ 2014 వచ్చే సరికి డీలా పడి 5 స్థానాలకే పరిమితమైంది. 2018లో మూడు స్థానాలను గెలుచుకున్నా ఒక చోట ఎమ్మెల్యే పార్టీ మార్పుతో, రెండు చోట్ల ఉప ఎన్నికల్లో పూర్తిగా ప్రాతినిధ్యం కోల్పోయింది. 1999 నాటి పూర్వ వైభవాన్ని ఈ ఎన్నికల్లో సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డే ప్రయత్నం చేస్తోంది. 

ప్రాతినిధ్యం కోసం 
కమ్యూనిస్టులు : కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న జిల్లాలో ఇప్పుడు ఆ పార్టీలు ప్రాతినిధ్యం కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 2004 ఎన్నికల్లో చెరో రెండు స్థానాలను గెలుచుకున్న సీపీఐ, సీపీఎం పార్టీలు క్రమంగా చతికిలపడ్డాయి.  2009కి వచ్చే సరికి కేవలం రెండింటికే పరిమితం అయ్యాయి. 2014లో దేవరకొండలో సీపీఐ గెలుపొందినా 2018 వచ్చేసరికి దానినీ కోల్పోయారు. 

బీజేపీ.. జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఈ ఎన్నికల్లో గెలుస్తారన్న ధీమాతో ఉంది

- చింతకింది గణేశ్‌  
 

Advertisement
Advertisement