కొత్త ఈక్వేషన్స్‌.. ఖమ్మం.. రసవత్తర రాజకీయం | Sakshi
Sakshi News home page

కొత్త ఈక్వేషన్స్‌.. ఖమ్మం.. రసవత్తర రాజకీయం

Published Fri, Feb 16 2024 4:04 PM

New Equations In Khammam Politics - Sakshi

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం మరోసారి తెరపైకి వచ్చింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ రెండు పార్టీలు ఖమ్మం జిల్లాకు నేతలకు రాజ్యసభ అవకాశం కల్పించడం ఇప్పుడు కొత్త సమీకరణాలకు దారి తీసింది. నిజానికి రాజ్యసభకు వెళ్తున్న ఇద్దరూ ఖమ్మం పార్లమెంట్ బరిలో నిలుస్తారనే ప్రచారం జరిగినప్పటికీ, పార్టీలు మాత్రం కొత్త ఊహగానాలకు తెరలేపారు.

తెలంగాణలో కాంగ్రెస్‌కు 64 మంది ఎమ్మెల్యేలు, మిత్రపక్షమైన సీపీఐ ఎమ్మెల్యే కలిపి 65 మంది ఉన్నారు. సంఖ్యా బలం ఆధారంగా కాంగ్రెస్‌ పార్టీ రెండు రాజ్యసభ స్థానాలు గెలుచుకోనుంది. ఇక బీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యేల సంఖ్య ఆ పార్టీ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర గెలుపు కూడా లాంఛనమే కానుంది. కాంగ్రెస్‌ నుంచి రేణుకా చౌదరీ అయినా, బీఆర్‌ఎస్‌ నుంచి వద్దిరాజు అయినా.. ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు కావడం విశేషం. రేణుకాచౌదరీ కమ్మ సామాజిక వర్గం కాగా.. వద్దిరాజు రవిచంద్ర కాపు సామాజిక వర్గానికి చెందిన నేత.

కాంగ్రెస్ నుంచి రేణుక చౌదరి ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపించారు. గత కొన్నాళ్లుగా నేనే పోటీ చేస్తానంటూ ప్రకటనలు చేస్తున్నారు. సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటి చేయకపోతే ఖమ్మం సీటు నుంచి తానే పోటీ చేస్తానంటూ టీవీ ఇంటర్వ్యూల్లో  చెబుతున్నారు. ఖమ్మం నుంచి తనకు మాత్రమే అర్హత ఉందని రేణుకా చౌదరీ చెప్పుకోవడం పార్టీలో పెద్ద దూమారమే రేపింది. రేణుకా చౌదరి ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా వరుసగా విజయం సాధించారు.

అయితే, 2009లో టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై, 2019లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. టీడీపీలో ఉండగా రేణుకాచౌదరి 1997–98లో దేవెగౌడ కేబినెట్‌లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1998లో కాంగ్రెస్‌లో చేరారు. ఈసారి ఎన్నికల్లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ఉద్దేశంతో టికెట్‌ కేటాయించాలని దరఖాస్తు చేసుకున్నారు. ఢిల్లీ స్థాయిలో తనకున్న పరిచయాలతో టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే.. ఆమెను ప్రత్యక్ష ఎన్నికల బరినుంచి అధిష్టానం తప్పించి రాజ్యసభకు పంపింది. ఇక ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా ఎవరు పోటీ చేయనున్నారన్న దానిపై చర్చ మొదలైంది. ప్రస్తుతం రేసులో ముగ్గురు ఆశావాహులు ఉన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాదరెడ్డి, వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్‌ ఉన్నారు.

బీఆర్‌ఎస్‌ నుంచి రాజ్యసభకు నామినేట్‌ అవుతోన్న వద్దిరాజు రవిచంద్రది కాపు సామాజిక వర్గం. తెలంగాణలో కాపులు, మున్నూరు కాపులు, రెడ్డి కాపులున్నారు. ఈ  ఓట్లు ఎక్కువగా నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లో మూడు పార్లమెంటు స్థానాలున్నాయి. వద్దిరాజుకు అవకాశం ఇచ్చాం కాబట్టి కాపు ఓట్లపై కన్నేయాలన్న ఆలోచన బీఆర్‌ఎస్‌లో కనిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర్ రావుకు టికెట్ దాదాపు ఖారారు అయ్యే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు టచ్‌లో ఉన్నారు: బండి సంజయ్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement