Nellore City: మాజీ మంత్రి నారాయణకి ఇక చుక్కలే.. | Sakshi
Sakshi News home page

Nellore City: మాజీ మంత్రి నారాయణకి ఇక చుక్కలే..

Published Mon, Feb 12 2024 4:40 PM

New Equations In Nellore Politics - Sakshi

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేతగా జగన్ తీసుకున్న నిర్ణయం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది. నెల్లూరు సిటీ పార్టీ సమన్వయకర్తగా వైఎస్ జగన్ ప్రకటించిన పేరు సోషల్ ఇంజనీరింగ్‌లో భాగం అనే ప్రశంసలు వినిపిస్తున్నాయి. నెల్లూరు సిటీ నుంచి గత రెండుసార్లుగా బీసీ నేతలనే బరిలో దించి అసెంబ్లీకి పంపించారు జగన్‌. ఈ సారి నెల్లూరు డిప్యూటీ మేయర్‌ను ప్రకటించారు. ఇంతకీ సిటీ డిప్యూటీ మేయర్‌ ఎవరు? ఆ పేరు సంచలనంగా ఎందుకు మారింది?

వచ్చే ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్యే జరగబోతున్నాయని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ నుంచి పెత్తందారులు బరిలో ఉంటే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం నిత్యం జనాల్లో ఉండే సామాన్యులకు అవకాశాలు కల్పిస్తోంది. నెల్లూరు జిల్లా చరిత్రలో గతంలో ఏ రాజకీయ పార్టీ చేయని సాహసాన్ని సీఎం జగన్ చేశారు. స్వాతంత్రానంతరం నెల్లూరు సిటీ నుంచి ఇప్పటివరకు మైనార్టీలను అసెంబ్లీకి పంపించిన చరిత్ర ఏ పార్టీకి లేదు. గత ఎన్నికలకు ముందు అబ్దుల్ అజిజ్ అనే మైనార్టీ నేతకు మేయర్ గా అవకాశం కల్పించింది వైస్సార్సీపీ. తర్వాత అజిజ్ టీడీపీలోకి జంప్ అయ్యాడు. రాబోయే ఎన్నికల్లో కూడా నెల్లూరు సిటీ నుంచి మైనారిటీ నేతను అసెంబ్లీకి పంపించాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ నిర్ణయించడం ఇక్కడి రాజకీయాల్లో సరికొత్త ఈక్వేషన్స్‌కు తెర తీస్తున్నాయి.

ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల్లో గెలుపు ఓటమిలో మైనారిటీలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ప్రత్యేకించి నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు, ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో 18 నుంచి 21 శాతం వరకు మైనార్టీ ఓటర్లు ఉన్నారు. నెల్లూరు సిటీలో 38 వేలు నుంచి 40వేల వరకు మైనారిటీ ఓట్లు ఉన్నాయి. అందుకే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మైనారిటీని అభ్యర్థిని నిలిపితే జిల్లాలోని మైనారిటీలంతా వైఎస్‌ఆర్‌సీపీకి సంపూర్ణ మద్దతిస్తారనే విశ్లేషణలు వస్తున్నాయి. గతంలో మాదిరిగా ఈసారి కూడా జిల్లాలో సైకిల్‌ తుక్కుతుక్కుగా ఓడిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జిల్లాలో మైనార్టీల శాసనసభ ప్రాతినిధ్యాన్ని పరిశీలిస్తే.. 1970వ దశకానికి ముందు ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఒకరు మాత్రమే అసెంబ్లీకి ఎన్నియ్యారు. ఆ తర్వాత జిల్లా నుంచి మైనారిటీ నేతలనెవ్వరూ అసెంబ్లీ గడప తొక్కలేదు. అయితే నెల్లూరు కార్పొరేషన్‌లో మాత్రం మైనారిటీలకు తగిన ప్రాధాన్యం లభిస్తోంది. నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని వైస్సార్సీపీ మైనారిటీ నేతగా.. కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా ఉన్న ఖలీల్ అహ్మద్‌కి కేటాయించడంతో ఆ సామాజిక వర్గం నేతలు జోష్‌లో ఉన్నారు. నెల్లూరు సిటీలో ఖలీల్‌ను గెలిపించుకుంటామని.. జిల్లాలోని ఉండే తమ సామాజిక వర్గం వైస్సార్సీపీ కి అండగా ఉంటుందని మైనారిటీ నేతలు చెబుతున్నారు. పెత్తందారు మాజీ మంత్రి నారాయణకి సామాన్యుడు చుక్కలు చూపించబోతున్నాడనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: నన్ను లైంగికంగా వేధిస్తున్నారు: మాజీ మంత్రి నారాయణపై మరదలు ఫిర్యాదు

Advertisement
Advertisement