నితీశే బిహార్‌ సీఎం అభ్యర్థి

24 Aug, 2020 03:25 IST|Sakshi
జేపీ నడ్డా, నితీశ్‌కుమార్‌

జేడీయూ, ఎల్‌జేపీతో కలిసే పోటీ చేస్తాం

ప్రతిపక్షాల పని అయిపోయింది

బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీయూ(జనతాదళ్, ఐక్య), ఎల్‌జేపీ(లోక్‌జనశక్తి పార్టీ)లు ఐక్యంగానే బరిలోకి దిగుతాయని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. త్వరలో జరగనున్న ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ సారథ్యంలో తమ విజయం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఆదివారం నడ్డా పార్టీ బిహార్‌ ఎగ్జిక్యూటివ్‌ సమావేశాన్ని ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించారు. బీజేపీ, జేడీయూ, ఎల్‌జేపీ కలిసి ఎప్పుడు పోటీ చేసినా ఘన విజయం సాధించాయన్నారు. కొంతకాలంగా జేడీయూ, ఎల్‌జేపీ నేతల పరస్పర విమర్శలతో వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం.. అదే సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థి నితీశ్‌కుమారేనంటూ స్పష్టం చేయడం గమనార్హం.

ఆదివారం భేటీలో ఆయన మాట్లాడుతూ.. మిగతా రాష్ట్రాల్లో మాదిరిగానే బిహార్‌లో కూడా ప్రతిపక్షం నిర్వీర్యమైందనీ, ప్రజలు తమ ఆకాంక్షలు నెరవేరుతాయని ఆశగా చూస్తున్న ఏకైక పార్టీ బీజేపీయేనని అన్నారు. ‘ప్రతిపక్షానికి ఒక సిద్ధాంతం, దృష్టి లేవు. ప్రజలకు సేవ చేయాలనే ఆసక్తి ఏమాత్రం లేదు. చిల్లర రాజకీయాల నుంచి అవి బయట పడలేదు’అంటూ విపక్షంపై మండిపడ్డారు.

కోవిడ్‌–19 మహమ్మారి, రాష్ట్రంలో సంభవించిన వరదలపై బిహార్‌ ప్రభుత్వం సమర్థంగా స్పందించిందన్నారు. రాష్ట్రం ఈ రెండు సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఎన్నికలు వస్తున్నాయని తెలి పారు. రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కరోనా రికవరీ రేటు 73 శాతం వరకు ఉండగా, పాజిటివిటీ రేట్‌ 2.89 శాతం మాత్రమేనన్నారు.  

కోవిడ్‌ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని చిన్నచిన్న సమావేశాలు, ఇంటింటి ప్రచారం చేపట్టాలని పార్టీ నేతలకు సూచించారు. ప్రధాని మోదీ బిహార్‌కు ప్రత్యేకంగా ప్రకటించిన ప్యాకేజీని తు.చ.తప్పకుండా అమలు చేస్తామని, ఈ ప్యాకేజీ వివరాలను ప్రజలకు వివరించాలని సూచించారు. బీజేపీతోపాటు మిత్ర పక్షాల గెలుపు కోసం కూడా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.

కరోనా సమయంలో ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కేంద్రం తీసుకుంటున్న వివిధ చర్యలను, పేదల కోసం అమలు చేస్తున్న సహాయ కార్యక్రమాలను ఆయన వివరించారు. మోదీ ప్రభుత్వం రూ.1.70 లక్షల కోట్లతో గరీబ్‌ కల్యాణ్‌ యోజన, రూ.20 లక్షల కోట్లతో ఆత్మనిర్భర్‌ భారత్‌ను ప్రకటించిందని తెలిపారు. పేదల ఉద్యోగిత కోసం అమలు చేస్తున్న రూ.50 వేల కోట్ల పథకం బిహార్‌లోని 32 జిల్లాల్లో అమలు కానుందన్నారు.

సకాలంలోనే బిహార్‌ ఎన్నికలు: ఈసీ వర్గాలు
బిహార్‌ అసెంబ్లీకి సకాలంలోనే ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం(ఈసీ) వర్గాలు అంటున్నాయి. కోవిడ్‌  మహమ్మారి తీవ్రంగా ఉన్నందున ఎన్నికలను వాయిదా వేయాలంటూ కొన్ని  పార్టీల నుంచి డిమాండ్లు వినిపిస్తున్న సమయంలో ఈసీ ఉన్నతాధికర వర్గాలు ఈ విషయం స్పష్టం చేశాయి. అక్టోబర్‌–నవంబర్‌ నెలల్లో ఎన్నికలు జరుగుతాయని ఈసీ ఇప్పటికే సంకేతాలిచ్చింది. 

రాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబర్‌ 29వ తేదీతో ముగియనుంది. కోవిడ్‌ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికలను వాయిదా వేయాలంటూ ఎన్‌డీఏ కూటమిలోని ఎల్‌జేపీ కోరింది.  ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీతోపాటు ఎన్‌సీపీ, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ కూడా ఇదే రకమైన డిమాండ్లు వినిపిస్తున్నాయి. మహమ్మారి సమయంలో ఎన్నికల అవసరం  ఏముందని ప్రశ్నిస్తున్నాయి.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా