Parliament Monsoon Session Live Updates: Congress Submits No-Confidence Motion - Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌ సమావేశాలు: లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాసం.. లైవ్‌ అప్‌డేట్స్‌

Published Wed, Jul 26 2023 10:18 AM

Parliament monsoon session Live No confidence motion Updates - Sakshi

లోక్‌సభలో ఎన్డీయేపై అవిశ్వాసం.. Live Updates

లోక్‌సభ వాయిదా
మణిపుర్‌ అంశంపై పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. మణిపుర్‌పై ప్రధాని మోదీ మాట్లాడాలని డిమాండ్‌ చేస్తూ లోక్‌సభలో ప్రతిపక్ష ఎంపీలు  నిరసనకు దిగారు. ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. విపక్షాల ఆందోళన నడుమ లోక్‌సభను బుధవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు స్పీకర్‌ ఓం బిర్లా.

► “ప్రధానమంత్రి పార్లమెంటును గౌరవించాలి. ఇది రాష్ట్రపతి పాలన కాదు, ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం’’..లోక్‌సభ స్పీకర్ ఆమోదించిన అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం

► ఢిల్లీ పాలనాధికారాల బిల్లుపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు విప్‌ జారీ చేశాయి. లోక్‌సభ ఎంపీలంతా సభకు తప్పనిసరిగా హాజరుకావాలని విప్‌ జారీ. ఢిల్లీ పాలనాధికారాల బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలంటూ విప్‌లో పేర్కొంది.

► మణిపూర్‌ అంశంపై పార్లమెంట్‌లో నెలకొంటున్న గందరగోళంపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు లేఖ రాశారు. ‘‘ప్రధాని మోదీని వచ్చి మాట్లాడమని మేం కోరుతున్నాం.ఆయన మౌనం ఆయన ప్రతిష్టకే భంగం కలిగిస్తుంది.  దేశ ప్రజలకు మేం కట్టుబడి ఉన్నాం, అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటాం. అంటూ లేఖలో పేర్కొన్నారయన. 

ప్రధాని మోదీ గైర్జాహజరు విపక్ష సభ్యులు నిలదీయడంతో సభలో గందరగోళం నెలకొనగా..  లోక్‌సభ మధ్యాహ్నాం 2గం. వరకు వాయిదా పడింది. 


 ఎన్డీయే ప్రభుత్వంపై విపక్షాల అవిశ్వాస తీర్మానానికి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అనుమతి ఇచ్చారు. కాంగ్రెస్‌ ఎంపీ గోగోయ్‌ ప్రవేశపెట్టిన తీర్మానంపై.. సోనియా గాంధీ సహా ఇండియా కూటమి ఎంపీలు తమ తమ స్థానాల్లో నిలబడి మద్దతు ప్రకటించారు. అయితే అఖిలపక్షంతో భేటీ తర్వాత అవిశ్వాసంపై తేదీ ప్రకటిస్తానని స్పీకర్‌ ఓం బిర్లా వెల్లడించారు.

తిరిగి ప్రారంభమైన లోక్‌సభ

బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానంపై ఆ పార్టీ ఎంపీ రంజిత్ రెడ్డి సాక్షి టీవీతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానంతో మాకు సంబంధం లేదు. మేము విడిగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాం. మా అవిశ్వాస తీర్మానానికి ఎంఐఎం అధినేత ఓవైసీ కూడా మద్దతు పలికారు. కాంగ్రెస్ పార్టీ మాకు ప్రధాన ప్రతిపక్షం. ఆ పార్టీతో చేతులు కలిపే ప్రసక్తి లేదు. మణిపూర్ హింసపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనం వీడాలి. ఆయన అసలు ఎందుకు మాట్లాడడం లేదు? అని ఎంపీ రంజిత్‌ రెడ్డి నిలదీశారు. 

► BRS ఎంపీల అవిశ్వాస తీర్మానంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంతకం చేశారు. 

రాజ్యసభలో మైక్‌ లొల్లి
► రాజ్యసభలో కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే మైక్‌ను ఆపేశారంటూ ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి. మైక్‌ ఆపేయడం వల్ల తన ఆత్మగౌరవం దెబ్బతిందని వాదించారాయన. అయితే తాను మైక్‌ ఆపేయలేదని చైర్మన్‌ ధన్‌ఖడ్‌ స్పష్టం చేశారు. అయినా ఆ వివరణతో ప్రతిపక్ష సభ్యులు సంతృప్తి చెందకుండా.. నిరసన కొనసాగిస్తున్నారు.

విపక్ష సభ్యుల నినాదాలతో లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు స్పీకర్‌.

రాజ్యసభలోనూ విపక్షాల మొండిపట్టు. మణిపూర్‌పై చర్చ జరగాలని డిమాండ్‌. 

మణిపూర్‌ పరిస్థితులపై ప్రధాని మోదీ  స్పందించాలని బీఆర్‌ఎస్‌ ఎంపీలు డిమాండ్‌ చేస్తున్నారు.

పార్లమెంట్‌వర్షాకాల సమావేశాల్లో భాగంగా.. బుధవారం ఉభయ సభలు ప్రారంభం అయ్యాయి. మణిపూర్‌ ఘటనపై చర్చించాలని విపక్షాలు నినాదాలు చేస్తున్నాయి.  

► లోక్‌సభలో ఎన్డీయే కూటమి బలం 330, ఇండియా కూటమి బలం 141, ఏ కూటమిలో లేని మరో 64 మంది ఎంపీలు. ఆరు ఎంపీ స్థానాలు ఖాళీ ఉన్నాయి.  అవిశ్వాస తీర్మానంపై 50 మంది ఎంపీలు సంతకం చేశారు. వీగిపోతుందని తెలిసి కూడా..  అవిశ్వాసంతో మణిపూర్‌ అంశంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే దిశగా విపక్ష కూటమి ప్రయత్నిస్తోంది. 

► అందుకే అవిశ్వాసం
మా పార్టీ తరపున అవిశ్వాస తీర్మానం పెట్టాం. సభ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్ష నేతలంతా మణిపూర్‌ అంశంపై చర్చించాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై ప్రధాని మాట్లాడితే శాంతి నెలకొంటుంది.అందుకే మా వంతు ప్రయత్నం మేం చేస్తున్నాం.

:::బీఆర్‌ఎస్‌ ఎంపీ నామా

► ప్రజలే బుద్ధి చెప్పారు
దేశ ప్రజలకు ప్రధాని మోదీ, బీజేపీపై విశ్వాసం ఉంది. గత టర్మ్‌లోనూ అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చారు. ఈ దేశ ప్రజలు వారికి గుణపాఠం చెప్పారు.
:::పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి


► లోక్ సభలో వేరుగా.. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చారు బీఆర్ఎ‌స్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు. అలాగే.. తన పార్టీ ఎంపీలకు విప్‌ జారీ చేసింది బీఆర్‌ఎస్‌. ఢిల్లీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని బీఆర్‌ఎస్‌ ఎంపీలకు విప్‌ జారీ చేసినట్లు తెలుస్తోంది.

మణిపూర్‌ పరిస్థితిపై చర్చించాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ ఎంపీ మనీష్‌ తివారీ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.

డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ, ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా, కాంగ్రెస్ ఎంపీలు రాజీవ్ శుక్లా, రంజీత్ రంజన్, ఆప్ ఎంపీ రాఘ చద్దా రాజ్యసభలో రూల్ 267 కింద బిజినెస్ నోటీసును సస్పెండ్ చేస్తూ మణిపూర్ పరిస్థితిపై చర్చకు డిమాండ్ చేశారు.

  కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి అంతా రంగం సిద్ధమైంది. యాభై మంది ఎంపీలు సంతకాలు చేశారు. బుధవారం ఉదయం కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ లోక్‌సభలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.

మణిపూర్‌ అంశంపై విపక్ష కూటమి ప్రభుత్వంపై పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాని చర్చకు రావాలన్న డిమాండ్‌కు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేయడం లేదు. పైగా దీర్ఘకాలిక చర్చకూ సిద్దంగా లేదు. ఈ తరుణంలో అవిశ్వాస తీర్మానానికి విపక్ష కూటమి సిద్ధమైంది.

► బుధవారం ఉదయం విపక్ష కూటమి INDIA నేతలు సమావేశం కాగా.. 50 మంది ఎంపీలు అవిశ్వాస తీర్మానం కోసం సంతకాలు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌చౌదరి సైతం ధృవీకరించారు.

► అవిశ్వాసం వీగిపోతుందని తెలిసినా.. ఒకవేళ స్పీకర్‌ గనుక ఓటింగ్‌-చర్చకు అనుమతించడం ద్వారా మణిపూర్‌ అంశంపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం దొరుకుతుందని, తద్వారా బీజేపీని నిలదీయొచ్చని విపక్ష కూటమి ఇండియా భావిస్తోంది.  

Advertisement

తప్పక చదవండి

Advertisement