Thummala: తుమ్మల చేజారిపోకుండా.. | This Party Hardly Tries For Thummala Nageswara Rao - Sakshi
Sakshi News home page

Thummala Nageswara Rao: తుమ్మల చేజారిపోకుండా.. ఆ సమీకరణాలు వర్కవుట్‌ అయ్యేనా?

Published Tue, Aug 29 2023 9:06 AM

This Party Hardly Tries For Thummala Nageswara Rao - Sakshi

సాక్షి, ఖమ్మం: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు రాజకీయ అడుగులు ఎటు అనేదానిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. ప్రస్తుతానికి బీఆర్‌ఎస్‌లో ఉన్న ఆయన పాలేరు టికెట్‌ దక్కకపోవడంతో బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం కాకుండా.. ప్రజల కోసం, తనను నమ్ముకున్న అనుచరుల కోసం ఎన్నికల బరిలోకి దిగుతానంటూ ప్రకటించి మరింత ఆసక్తిని రేకెత్తించారు. ఈ క్రమంలో ఆయన బీఆర్‌ఎస్‌లో ఉంటూనే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా? లేదంటే పార్టీ వీడి మరో పార్టీలో చేరి పోటీ చేస్తారా? అనే చర్చ నడుస్తోంది. 

అయితే.. ఖమ్మంలో బలమైన నేత అయిన తుమ్మలను వదులుకునేందుకు ఇతర పార్టీలు పోటీ పడుతున్నాయి. బీజేపీ ఆహ్వానించినా.. చేరొద్దంటూ ఆయన అనుచరులు ఇప్పటికే ఆయనకు సూచించారు. దీంతో.. కాంగ్రెస్ పార్టీ  ఆయన కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తుమ్మల చేజారిపోకుండా ఉండేందుకు ముఖ్య నేతలను రంగంలోకి దించాలని చూస్తోంది. 

ఆ స్పష్టత వస్తేనే.. 
పాలేరు కేంద్రంగానే తుమ్మల గత కొంతకాలంగా రాజకీయాలు నడిపిస్తున్నారు. దీంతో అక్కడి నుంచే పోటీ చేయాలని ఆయన ఆశపడుతున్నారు. అయితే పాలేరు లేదంటే ఖమ్మం.. ఈ రెండు నియోజక వర్గాల్లో ఎక్కడి నుంచైనా పోటీ గురించి చేయాలని అనుచరులు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ చేరికతోనే కాదు.. పోటీ విషయంలోనూ అనుచర గణం ఆయన్ని గందరగోళంలోకి నెట్టేస్తోంది. దీంతో డైలమా కొనసాగుతోంది. ఇక.. తుమ్మల గనుక పార్టీలో చేరితే.. తుమ్మలతో పాటు పొంగులేటి సీట్ల విషయంలో సర్దుబాటు ప్రక్రియ గురించి కాంగ్రెస్‌ సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో స్పష్టత రాగానే.. తుమ్మలో కాంగ్రెస్‌లో చేరవచ్చనే ప్రచారం నడుస్తోందక్కడ. 

కాంగ్రెస్‌ వ్యూహాలు
తుమ్మల చేరికకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉంది. ఇక జిల్లా నేతలైన సీఏల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం తుమ్మల చేరికపై అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. దీంతో తుమ్మల కాంగ్రెస్‌ చేరికకు ఎలాంటి అవాంతరాలు లేవనే చెప్పాలి. అయితే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మూడు జనరల్ స్థానాల్లో బలమైన నేతలను రంగంలోకి దింపేందుకు కాంగ్రెస్‌ ‍వ్యూహరచన చేస్తుండగా.. పరిస్థితులు అందుకు ఎంత వరకు సహకరిస్తాయో అనేది వేచి చూడాలి. మరో రెండు, మూడు రోజుల్లో తుమ్మల రాజకీయ భవితవ్యంపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement