కాంగ్రెస్‌ అభ్యర్థిగా దానం నాగేందర్‌.. హైకోర్టులో మరో పిటిషన్‌ | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ అభ్యర్థిగా దానం నాగేందర్‌.. హైకోర్టులో మరో పిటిషన్‌

Published Wed, Mar 27 2024 12:06 PM

Petitetion Filed Over BRS Danam Nagender For Congress Joining - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల వేళ ఖైరతాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశముంది. దానం కాంగ్రెస్‌ చేరడం, సికింద్రబాద్‌ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగడంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ జరుగనుంది. 

కాగా, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నగరానికి చెందిన రాజు యాదవ్‌ అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ బీఫామ్‌పై పోటీ చేసి దానం ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలో ఆయన ఖైరతాబాద్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 

ఇక, కొద్దిరోజుల క్రితమే దానం నాగేందర్‌ కాంగ్రెస్‌లో చేరారు. దీంతో, దానంకు కాంగ్రెస్‌ ఎంపీ సీటు ఆఫర్‌ చేసింది. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి దానం బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుంచి పోటీ చేయడం రాజ్యాంగ విరుద్దం, చట్ట విరుద్దమంటూ పిటిషనర్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా దానం నాగేందర్‌పై స్పీకర్‌ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే సమయంలో దానంపై అనర్హత వేయాల్సిందిగా కోరారు. కాగా, ఈ పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా.. దానం నాగేందర్ ఎన్నిక చెల్లదంటూ ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. జస్టిస్ విజయసేన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీనిపై దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేసింది.  అయితే, దానం నాగేందర్  అసెంబ్లీ  ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని విజయారెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఓటర్లకు డబ్బులు పంచారని, ఈ విషయంలో కేసులు నమోదయ్యాయని కోర్టుకు వివరించారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం దానంకు నోటీసులు జారీ చేసింది. 

Advertisement
Advertisement