Sakshi News home page

CWC: కాంగ్రెస్‌ కీలక నిర్ణయం.. రఘువీరా సహా వీరికి చోటు

Published Mon, Sep 4 2023 5:14 PM

Place For Six Telugu Political Leaders In CWC Meeting - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ స్పీడ్‌ పెంచింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఫుల్‌ ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు.. సెప్టెంబర్ 16న హైదరాబాద్‌లో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరగనున్నట్లు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ వెల్లడించారు. 

తెలుగు నేతలకు చోటు..
కాగా, ఈ సమావేశం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగనున్నట్టు తెలిపారు. సెప్టెంబర్‌ 16వ తేదీన సమావేశానికి సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని మల్లికార్జున ఖర్గే పునర్వ్యవస్థీకరించారు. ఈ క్రమంలోనే సీడబ్ల్యూసీలో  తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు నేతలకు చోటు కల్పించారు. ఇక, సీడబ్ల్యూసీలో మొత్తం 39 మంది సభ్యులు, 18 మంది శాశ్వత ఆహ్వానితులు, 14 మంది ఇన్‌ఛార్జ్‌లు, 9 మంది ప్రత్యేక ఆహ్వానితులు, నలుగురు ఎక్స్-అఫీషియో సభ్యులు ఉన్నారు. 

రఘవీరాకు స్థానం
అయితే, రాజకీయాలకు దూరంగా ఉన్న రఘువీరారెడ్డికి సీడబ్ల్యూసీలో చోటు కల్పించారు. అలాగే, శాశ్వత ఆహ్వానితుల జాబితాలో సుబ్బరామిరెడ్డి, కొప్పుల రాజు, దామోదర రాజనరసింహకు చోటు కల్పించగా.. ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో పళ్లం రాజు, వంశీచంద్ రెడ్డి, రాజస్థాన్ అసమ్మతి నేత సచిన్ పైలట్, వివాదాస్పద నేత శశి థరూర్‌కు చోటు దక్కింది. ఈ కమిటీలో ముందు నుంచి సభ్యులుగా ఉన్న అధిర్ రంజన్ చౌదరి, ఏకే ఆంటోనీ, అంబికా సోనీ, దిగ్విజయసింగ్, పి.చిదంబరం, అజయ్ మాకెన్, ఆనంద్ శర్మ ఉన్నారు.

కాంగ్రెస్‌ మెగా ర్యాలీ..
ఇక, సీడబ్ల్యూసీ సమావేశం సందర్భంగా సెప్టెంబర్ 17న సాయంత్రం హైదరాబాద్‌కు సమీపంలో మెగా ర్యాలీ నిర్వహించనున్నట్టు కేసీ వేణుగోపాల్‌ చెప్పారు. ఈ ర్యాలీలో మల్లికార్జున ఖర్గేతో సహా పార్టీ మాజీ అధ్యక్షులు, సీనియర్‌ నేతలు పాల్గొంటారని తెలిపారు. కాగా సెప్టెంబర్ 17 మెగా ర్యాలీతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్  శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. ఈ ర్యాలీలోనే ఎన్నికలకు 5 గ్యారెంటీ స్కీమ్స్ ప్రకటించనుందని తెలిపారు. అదే రోజు 119 నియోజకవర్గాల్లో సీడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీలు బస చేయనున్నారని, సెప్టెంబర్ 18న బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు తమ తమ నియోజకవర్గాల్లో ఇంటింటికీ ప్రచారం నిర్వహించనున్నారన్నారు.  

ఇది కూడా చదవండి: ఉదయనిధి 'సనాతన ధర్మ' వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందన ఏంటంటే..?

Advertisement

What’s your opinion

Advertisement