కరప్షన్‌, కమీషన్‌ వారి సిద్దాంతాలు.. పాలమూరులో మోదీ ఫైర్‌ | Sakshi
Sakshi News home page

కరప్షన్‌, కమీషన్‌ వారి సిద్దాంతాలు.. పాలమూరులో మోదీ ఫైర్‌

Published Sun, Oct 1 2023 4:42 PM

PM Modi Political Speech At BJP Palamuru Praja Garjana Sabha - Sakshi

సాక్షి, పాలమూరు: తెలంగాణ బీజేపీ పాలమూరులో ప్రజా గర్జన సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ, పాలమూరు ప్రజలను ఉద్దేశించి ప్రసగించారు. పాలమూరు ప్రజలందరికీ నమస్కారములు, మరోసారి నా కుటుంబ సభ్యులారా అంటూ ప్రధాని మోదీ ప్రసంగాన్ని ప్రారంభించారు.

పాలమూరు సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం కారు స్టీరింగ్‌ ఎవరి చేతిలో ఉందో మీకు తెలుసు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారో అందరికీ తెలుసు. తెలంగాణ అభివృద్ధిని రెండు కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయి. కరప్షన్‌, కమీషన్‌ ఈ రెండు పార్టీల సిద్ధాంతం. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు ఈరోజు రాత్రి నిద్రపట్టదు. ఈ ప్రజాస్వామ వ్యవస్థను కుటుంబవ్యవస్థగా మార్చేశారు. పెద్ద పోస్టుల్లో కుటుంబ సభ్యులుంటారు.. తమ అవసరాల కోసమే కొందరు బయటి వ్యక్తులు ఉంటారు. పార్టీ అధ్యక్షుడి నుంచి అన్ని పదవుల్లోనూ కుటుంబ సభ్యులే ఉంటారు. తెలంగాణలో రోజురోజుకు బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోంది. మోదీ హామీ ఇస్తే నెరవేరుతుందనే నమ్మకం తెలంగాణ ప్రజల్లో ఉంది. కలిసికట్టుగా తెలంగాణను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్దాం. బీజేపీ మాత్రం సామాన్యుల కోసం ఆలోచిస్తుంది.

తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం కావాలి..
పాలమూరు ప్రజలకు అభివాదం చేస్తున్నాను. ఇవాళ స్వచ్చతా కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. నేడు తెలంగాణలో రూ.13,500 కోట్ల విలువైన పనులను ప్రారంభించుకున్నాం. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాను. తెలంగాణ రాష్ట్రం బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటోంది. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. చెప్పింది చేసే ప్రభుత్వమే తెలంగాణకు కావాలి. తెలంగాణ అవినీతి రహిత పాలన కావాలి. పారదర్శక ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. నాలుగేళ్ల కాలంలో ప్రజలు బీజేపీని బలోపేతం చేశారు. అబద్ధాలు, వాగ్ధానాలు కాదు.. క్షేత్రస్థాయిలో పనులు తెలంగాణకు కావాలి.  రాష్ట్ర ప్రజల బ్రతుకులు బాగుపడేందుకు బీజేపీ కట్టుబడి ఉంది. 

తెలంగాణకు ఎంతో చేశాం..
తెలంగాణకు 9 ఏళ్లలో లక్ష కోట్ల నిధులిచ్చాం. 2014కు ముందు కేవలం 2,500 కి.మీ నేషనల్‌ హైవేలున్నాయి. మా ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో తొమ్మిదేళ్లలో 2,500 కి.మీల జాతీయ రహదారులు నిర్మించాం. పేదలకు గ్యాస్‌, ఇళ్లు ఉచితంగా ఇస్తున్నాం. ప్రతీ గ్రామం, పల్లు నుంచి పట్టణాలకు వచ్చేందుకు రోడ్లు వేశాం.  2014కు ముందు కాంగ్రెస్‌ హయాంలో రూ.3400 కోట్లతో ధాన్యాన్ని కొనుగోలు చేశాం. రైతుల పథకాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం దోచుకుంటోంది. సాగునీటి కాలువల పేరుతో​ తెలంగాణ ప్రభుత్వం గొప్పలకు పోతోంది. కానీ.. ఆ కాలువల్లో అసలు నీరు ఉండదు.

కేసీఆర్‌ సర్కార్‌పై ఫైర్‌..
తెలంగాణ ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోంది. అన్నదాతను మేము ఎప్పుడూ గౌరవిస్తాం. రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం అందిస్తున్నాం. రైతుల కోసం రామగుండ ఫెర్టిలైజర్‌ ఫ్యాక్టరీని తెరిపించాం. రుణమాఫీ పేరుతలో తెలంగాణ ప్రభుత్వం రైతులను మోసం చేసింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు. పసుపు రైతుల సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి ఉంది. పసుపు బోర్డు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. పసుపు బోర్డుతో ఎంతో మేలు జరుగుతుంది. పసుపు ఎగుమతి గతంలో పోలిస్తే రెట్టింపు అయ్యింది. తెలంగాణలో మా ప్రభుత్వం లేకపోయినా.. ఇక్కడి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. 

రాణిరుద్రమ దేవి వంటి ధీరవనితలు పుట్టిన గడ్డ తెలంగాణ. చారిత్రాత్మక మహిళా బిల్లును ఆమోదించుకున్నాం. దేశాభివృద్ధికి మహిళా శక్తి కావాలి. మహిళా శక్తికి నా హృదయపూర్వక అభినందనలు. ఢిల్లీలో ఓ సోదరుడు ఉన్నాడనే నమ్మకాన్ని తెలంగాణ సోదరీమణులకు కల్పించేందుకు ప్రయత్నం. మహిళల జీవితాన్ని మెరుగుపర్చేందుకు ఎన్నో చర్యలు చేపట్టాం’ అని కామెంట్స్‌ చేశారు. 

Advertisement
Advertisement