చంద్రబాబు యూజ్‌ అండ్‌ త్రో పాలసీ.. ఇద్దరిలో సీటు ఎవరికో? | Sakshi
Sakshi News home page

చంద్రబాబు యూజ్‌ అండ్‌ త్రో పాలసీ.. ఇద్దరిలో సీటు ఎవరికో?

Published Sun, Feb 25 2024 9:03 AM

Political Suspense Over Guntur TDP MP Seat Race - Sakshi

యూజ్ అండ్ త్రో పాలసీ విజయవంతంగా అమలు చేసే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. పార్టీ నాయకుల్ని కూడా విచ్చలవిడిగా వాడేసుకుంటున్నారు. గుంటూరు ఎంపీ టిక్కెట్ ఇస్తామంటూ తండ్రీ కొడుకులిద్దరూ కలిసి ఇద్దరు కోటీశ్వరుల్ని మ్యాగ్జిమం ముంచారు. ఇప్పుడా ఇద్దరూ ఎంపీ సీటు తనదే అంటూ కొట్లాడుకుంటున్నారు. ఇద్దరిలో ఒక మేధావి చంద్రబాబు మార్క్‌ రాజకీయాల్ని ఒంటబట్టించుకున్నాడు. తన ప్రత్యర్థికి వ్యతిరేకంగా ఎల్లో మీడియాలో వ్యతిరేక వార్తలు రాయిస్తున్నాడు. అలాగైనా తనకు సీటు వస్తుందని ఆశపడుతున్నాడు. 

గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం పార్టీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. గుంటూరు ఎంపీ సీటుకోసం ఇద్దరు బడాబాబులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒకరు భాష్యం విద్యాసంస్థల అధిపతి బాష్యం రామకృష్ణ అయితే మరొకరు ఎన్నారై పెమ్మసాని చంద్రశేఖర్. వాస్తవానికి గత ఎన్నికల్లో బాష్యం రామకృష్ట పెదకూరపాడునుంచి అసెంబ్లీకి పోటీ చెయ్యాలని భావించారు. చివరివరకూ సీటు నీకేనంటూ మాయమాటలు చెప్పి ఆఖరులో బాష్యం రామకృష్ణకు హ్యండిచ్చారు చంద్రబాబు. 

ఈసారి ఎన్నికల్లో అయినా ఏదో ఒక అసెంబ్లీ స్థానంనుంచి పోటీ చెయ్యాలని రామకృష్ణ గట్టిగా నిర్ణయించుకున్నారు. అందుకోసం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. విద్యా వ్యాపారంతో దండిగా సంపాదించిన బాష్యం రామకృష్ణ వద్ద వందల కోట్లు ఉండడంతో నీకు అసెంబ్లీ సీటు ఎందుకు..? పార్లమెంట్ సీటుకు పోటీ చేయమని ఆయన్ను ఊహల పల్లికిలో ఊరేగించారు. గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయడానికి 150కోట్లు రెడీ చేసుకోమని కూడా చెప్పేశారట. చంద్రబాబు చెప్పిందే తడవుగా ఎంపీగా పోటీ చేయడానికి ఆయన డబ్బు కూడా రెడీ చేసుకున్నట్లు టాక్ నడుస్తోంది.  

గుంటూరు ఎంపీ సీటు ఇచ్చేసారంటూ బాష్యం రామకృష్ణ సంబరపడినంత సేపు కూడా ఆయన ఆనందం నిలవలేదు. ఇంతలోనే ఎన్నారై పెమ్మసాని చంద్రశేఖర్ పేరు తెరపైకి వచ్చింది. గుంటూరు ఎంపీగా అమెరికా నుంచి వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్ రేసులో ఉన్నాడని, చంద్రబాబు కూడా పెమ్మసానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. పెమ్మసాని గుంటూరు సిట్టింగ్‌ ఎంపీ గల్లా జయదేవ్‌కు సన్నిహితుడు. దీంతో గల్లా ద్వారా పెమ్మసాని ప్రయత్నాలు చేసినట్లు బాష్యం రామకృష్ణకు తెలిసింది. ఇప్పటికే లోకేష్, చంద్రబాబులు పెమ్మసానిని బాగా వాడేశారట. పెమ్మసాని కూడా టిక్కెట్ కోసం టీడీపీకి భారీ ఆఫర్ ఇవ్వడమే గాకుండా.. ఆ మొత్తాన్నిచంద్రబాబుకు ముట్టచెప్పేశాడని కూడా ప్రచారం జరుగుతోంది. అందుకే పెమ్మసానిని తండ్రీకొడుకులు ఎంటర్‌టైన్ చేస్తున్నారని టీడీపీ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న బాష్యం రామకృష్ణ చంద్రబాబు స్టైల్ లోనే పెమ్మసానికి చెక్ పెట్టాలని డిసైడయ్యారు. 

విద్యాసంస్థల యజమాని కావడంతో మీడియా సంస్థల యజమానులతో.. మరీ ముఖ్యంగా ఎల్లో మీడియా పెద్దలతో బాష్యం రామకృష్ణకు మంచి పరిచయాలున్నాయి. వాటి ఆధారంగా ఎన్‌ఆర్‌ఐ పెమ్మసానిపై పుంఖానుపుంఖాలుగా నెగిటివ్ వార్తలు రాయిస్తున్నాడట బాష్యం రామకృష్ణ. ఎన్నారైలు వద్దు.. స్థానికులే ముద్దు అంటూ లోకల్‌ పేజీల్లో పతాక శీర్షికలు పెట్టించి కథనాలు రాయిస్తున్నారు. ఎన్నారైలు ఎన్నికల సమయంలో డబ్బులిచ్చి సీట్లు తెచ్చుకుంటారు. తర్వాత పార్టీకి పనిచెయ్యరు. కాబట్టి గుంటూరు ఎంపీ సీటు ఎన్నారైకి ఇవ్వొద్దంటూ ఎల్లో మీడియాతోనే వార్తలు కుమ్మేస్తున్నారు.

ఈ కథనాల గురించి పెమ్మసాని అనుచరులు ఆరా తీస్తే అసలు విషయం తెలిసిందట. ఇక పెమ్మసాని కూడా రామకృష్ణకు టికెట్ రాకుండా చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యాడట. పార్లమెంట్ సీటు కాదు కనీసం అసెంబ్లీ సీటు కూడా రామకృష్ణకు రానివ్వకుండా చెయ్యాలని చకచకా పావులు కదుపుతున్నాడని టాక్ నడుస్తోంది. ఇప్పటికే తండ్రీకొడుకులకు ఇవ్వాల్సింది ఇచ్చేశా.. నాకు గుంటూరు ఎంపీ సీటు కూడా ఖాయం చేశారు. ఇక నా తడాఖా చూపిస్తానంటూ సన్నిహితుల వద్ద సవాల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 

మరోవైపు బాష్యం రామకృష్ణ మాత్రం గుంటూరు ఎంపీ సీటుకోసం డబ్బులు రెడీ చేసుకోమని చెప్పారు. నేను రెడీ చేసుకున్నాను. మధ్యలో పెమ్మసాని గొడవేంటని మండిపడుతున్నాడట. నాకు సీటు ఇవ్వాల్సిందేనంటూ ఇద్దరు ఎల్లో మీడియా అధిపతుల ద్వారా చంద్రబాబు వద్ద లాబీయింగ్ మొదలుపెట్టాడని తెలుస్తోంది. మీడియా పెద్దలు మాత్రం బాష్యం రామకృష్ణకు కంగారుపడొద్దు.. టికెట్ ఇప్పిస్తామని భరోసా ఇచ్చారట. ఆవసరమైతే మరో ఐదారు వార్తలు వేసి పెమ్మసానిని మళ్లీ అమెరికా పంపిస్తాం.. నువ్వు మాత్రం ఆందోళన చెందవద్దని చెప్పారట. మమ్మల్ని బాగా చూసుకుంటే నీ రాజకీయ భవిష్యత్‌కు ఢోకా ఉండదని కూడా హామీ ఇచ్చారట. ఇదే ఇప్పుడు గుంటూరు తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement
Advertisement