బీజేపీ పొలిటికల్‌ ప్లాన్‌ ఛేంజ్‌.. మోదీ కీలక నిర్ణయం!

7 Jul, 2023 16:55 IST|Sakshi

ఎన్నికల్లో బీజేపీ వ్యూహాలు ఎంతో భిన్నంగా ఉంటాయి. ప్రతిపక్ష నేతలు కూడా ప్రధాని మోదీ వ్యూహాలను అంచనా వేయలేరని టాక్‌ రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే, ఉత్తరాదిలో బీజేపీ గెలుపొందినంత సులభంగా దక్షిణాది మాత్రంలో కాషాయపార్టీ ప్రభావం చూపలేకపోతోంది. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో కూడా బీజేపీ ఘోరంగా ఓటమిపాలైంది. దీంతో, దక్షిణాదిలో ఒక్క రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలో లేదు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ.. కీలక నిర్ణయం తీసుకుంటున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 

తమిళనాడు నుంచి పోటీ!
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ తమిళనాడు నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని కేంద్ర ప్రభుత్వానికి చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వారణాసి స్థానంతోపాటు దక్షిణాదిలో మరో చోట నుంచి ప్రధాని బరిలో నిలబడతారని సమాచారం. దక్షిణాదిలో బీజేపీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని ఓ నియోజకవర్గం నుంచి మోదీ పోటీ చేయనున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాగా, కొన్ని నెలల క్రితం నిర్వహించిన కాశీ-తమిళ సంగమం కార్యక్రమం వల్ల తమిళనాడుతో ఆయన అనుబంధం బలపడిందని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ వారణాసితోపాటు కన్యాకుమారి లేదా కోయంబత్తూర్‌ నుంచి పోటీ చేస్తే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరోవైపు.. ఇటీవల కొత్త పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజదండానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చింది. ఈ సందర్భంగా రాజదండంతో చేపట్టిన తంతు ఇందుకు బలాన్ని చేకూర్చుతున్నదని తెలిసింది. దీంతో, మోదీ తమిళనాడు నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: గుజరాత్‌ హైకోర్టులో రాహుల్‌ గాంధీకి చుక్కెదురు

మరిన్ని వార్తలు