కోడ్‌ కూయక ముందే.. మోదీ టూరు!  | Sakshi
Sakshi News home page

కోడ్‌ కూయక ముందే.. మోదీ టూరు! 

Published Tue, Feb 20 2024 1:40 AM

Prime Minister Narendra Modi to visit Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడేలోగానే.. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల కంటే ముందుగానే తొలివిడత ప్రచారాన్ని పూర్తిచేయాలని బీజేపీ భావిస్తోంది. వచ్చే నెల మొదటివారంలో షెడ్యూల్‌ ప్రకటనతో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందనే అంచనాల మధ్య పెద్దఎత్తున ముందస్తు ప్రచారానికి కమలదళం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తెలంగాణ పర్యటనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రానున్నట్టు పార్టీవర్గాల సమాచారం. ఈ నెలాఖరులోగా లేదంటే మార్చి మొదటివారంలోగా రెండు, మూడు పర్యాయాలు మోదీ రాష్ట్రానికి వస్తారని చెబుతున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం ద్వారా రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని స్వయంగా ప్రధానితోనే ప్రారంభించినట్టు అవుతుందని బీజేపీ నాయకులు అంచనావేస్తున్నారు. 

మోదీ చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు 
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడడానికి ముందే గత అక్టోబర్‌ 1న మహబూబ్‌నగర్‌లో, 3న నిజామాబాద్‌లలో ఏర్పాటు చేసిన బహిరంగసభల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు, ములుగులో గిరిజన యూనివర్సిటీ, తెలంగాణలో పసుపుబోర్డులను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే పంథాలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించేలోగానే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేయనున్నట్టు తెలుస్తోంది.

అదేవిధంగా శాసనసభ ఎన్నికలకు ముందు కేంద్రప్రభుత్వం ప్రకటించిన వివిధ కార్యక్రమాలకు సంబంధించి యాక్షన్‌ప్లాన్‌ కూడా అమల్లోకి తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్రం ద్వారా రాష్ట్రంలో వివిధ రూపాల్లో చేపట్టనున్న ఎన్‌టీపీసీ, రోడ్లు, తదితర అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేయనున్నట్టు తెలిసింది.

ఆదిలాబాద్‌లో బహిరంగసభ? 
ఆదిలాబాద్‌లో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం అక్కడే విడిగా ఏర్పాటు చేసే బహిరంగసభలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ లక్ష్యంగా చేసుకుని మోదీ రాజకీయ విమర్శలు సంధిస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇక మోదీ రాష్ట్ర పర్యటనలో భాగంగా... ములుగులో గిరిజన యూనివర్సిటీ, నిజామాబాద్‌లో పసుపు బోర్డ్‌ ఏర్పాటుకు శంకుస్థాపనలు, తెలంగాణకు మరీ ముఖ్యంగా రాష్ట్ర రాజధానికి ప్రయోజనం చేకూరేలా చేపట్టనున్న రీజినల్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది. ఇక చర్లపల్లిలో రైల్వే టెరి్మనల్‌ను మోదీ లాంఛనంగా ప్రారంభిస్తారని అంటున్నారు. మొత్తంగా ఈ కార్యక్రమాల ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ మైలేజీని సాధించే దిశలో పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని బీజేపీ భావిస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement