‘ఐ విల్‌ ఓట్‌.. బికాజ్‌ ఐ లవ్‌ సూర్యాపేట’

29 Oct, 2023 04:52 IST|Sakshi

ఓటు ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన

సెల్ఫీ పాయింట్‌ వద్ద ఫొటో దిగిన కలెక్టర్, అదనపు కలెక్టర్లు

దురాజ్‌పల్లి (సూర్యాపేట): ‘ఐ విల్‌ ఓట్‌.. బికాజ్‌ ఐ లవ్‌ సూర్యాపేట’అని రాసి ఉన్న సెల్ఫీ పాయింట్‌ వద్ద సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు, అదనపు కలెక్టర్లు ప్రియాంక, వెంకట్‌రెడ్డి ఫొటో దిగారు. జిల్లాలో ఓటింగ్‌ శాతం పెంచేందుకు, ఓటు ఆవశ్యకతపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌ వద్ద సెల్ఫీ పాయింట్‌ ఏర్పాటు చేశారు.

శనివారం అక్కడ ఫొటో దిగిన అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గానికి 12 చొప్పున సెల్ఫీ పాయింట్స్‌ను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రాలు, మండలాల్లో ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాలలో సెల్ఫీ పాయింట్స్‌ ఏర్పాటు చేసి ఓటు ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా కీలకమని, అర్హత ఉన్న ప్రతివారూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.  

‘సోషల్‌’ మానిటరింగ్‌! 
ఎన్నికల ప్రశాంతతను చెడగొట్టే మెసేజ్‌లపై పోలీసుల నిఘా  
అన్ని జిల్లాల్లో సోషల్‌ మీడియా మానిటరింగ్‌ సెల్స్‌ ఏర్పాటు  

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో సోషల్‌ మీడియా వేదికలను అన్ని పార్టీల వారూ విరివిగా వాడుతున్నారు. ప్రత్యర్థులపై విరుచుకుపడేందుకు వీటిని అ్రస్తాలుగా మార్చుకుంటున్నారు. అయితే సోషల్‌ మీడియాలో వ్యాఖ్యలు,  వ్యంగ్యాస్త్రాలు శ్రుతిమించకుండా పోలీసులు నియంత్రణ చర్యలు చేపట్టారు. ఈ మేరకు ప్రతి జిల్లా పరిధిలో సోషల్‌ మీడియా మానిటరింగ్‌ సెల్‌ ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రశాంతతను చెడగొట్టే, కించపర్చే వ్యాఖ్యలు, వర్గాల మధ్య ఉద్రిక్తలకు దారితీసే ఫొటోలు, వీడియోలు, సందేశాలపై నిఘా పెడుతున్నారు.

స్థానికంగా నేతల పర్యటనలు, సభలు, ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు ప్రత్యర్థులను రెచ్చగొట్టే, కించపర్చే సందేశాలు ఉంటున్నాయా.. అని మానిటరింగ్‌ సెల్‌ సిబ్బంది పరిశీలిస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించిన పోస్టులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నారు. వర్గాల మధ్య వైషమ్యాలు తెచ్చేలా, ఇతర వర్గాలను కించపర్చేలా ఎవరైనా పోస్టులు పెట్టినా చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.   

మరిన్ని వార్తలు