విధ్వంసకాండకు బాబే బాధ్యుడు | Sakshi
Sakshi News home page

విధ్వంసకాండకు బాబే బాధ్యుడు

Published Sun, Aug 6 2023 4:48 AM

Punganur incident as per the plan says Karumuri  - Sakshi

సాక్షి, అమరావతి : ప్రాజెక్టుల యాత్ర పేరుతో బయల్దేరిన చంద్రబాబు దురుద్దేశంతోనే రూటు మార్చుకుని శుక్రవారం పుంగనూరు బైపాస్‌ రోడ్డు వద్ద జరిగిన విధ్వంసానికి కారకుడయ్యారని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు.

పక్కాప్లాన్‌ ప్రకారమే వివిధ జిల్లాల నుంచి టీడీపీ గూండాలను రప్పించి బాబు ఆ విధ్వంసం సృష్టించారన్నారు. పోలీసులను తరమండి అని చంద్రబాబు ప్రోత్సహించడం, వారిపై రాళ్లు రువ్వడం, వ్యాన్లను తగులబెట్టడం ఇలా దగ్గరుండి మరీ పుంగనూరులో విధ్వంసకాండను సృష్టించాడని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఆయన ఏమన్నారంటే.. 
14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పార్టీ శ్రేణులను పోలీసులపైకి ఉసిగొల్పడం ఎంతవరకు సబబు? ఆయనకు ఆ హక్కు ఎవరిచ్చారు? రాష్ట్రంలో ఎవరైనా నిరసన చెయ్యొచ్చు కానీ విధ్వంసంచేసే హక్కు ఎవరికీ లేదన్న విషయం ఆయనకు తెలీదా? అందుకే ఆ ఘటనకు బాబే బాధ్యత వహించాలి. కుప్పం కోట కూలిపోతోందనే పెద్దిరెడ్డిపై బాబుకు అక్కసు. అందుకే, దాడులకు ఉసిగొల్పారు.. పోలీసుల్ని కర్రలతో కొట్టారు.. రాళ్లురువ్వి, వాహనాల్ని తగులబెట్టారు.  

జనశ్రేణుల్ని పవన్‌ రెచ్చగొడుతున్నారు.. 
మరోవైపు.. వారాహి వాహనం ఎక్కి పవన్‌కళ్యాణ్‌ బూతు పురాణంతో జనసేన కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. ఆయన తన దత్తతండ్రి బాబు కోసమే పనిచేస్తున్నారు. మా నాన్న పోలీసు కానిస్టేబుల్‌ అంటూ పవన్‌ గొప్పగా చెప్పుకుంటారు.

మరి, పుంగనూరులో పోలీసులకు దెబ్బలు తగిలితే ఆయనెందుకు స్పందించలేదు? ఇక కేసులు ఉంటేనే పదవులిస్తామని లోకేశ్‌ పిలుపునిస్తున్నారు.. అందుకే టీడీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు. ప్రాణత్యాగానికి సిద్ధం కావాలని పవన్‌ పిలుపునివ్వటం చూస్తున్నాం. వీరి కుళ్లు రాజకీయాల్ని ప్రజలు ఛీదరించుకుంటున్నారు. చంద్రబాబు కుటిల బుద్ధిని ప్రజలు గమనించారు. 2024లో టీడీపీ ఆఫీస్‌కు తాళమే. 

విధ్వంసంపై విచారణ జరగాల్సిందే.. 
పుంగనూరు ఘటనపై కచ్చితంగా విచారణ జరగాల్సిందే. కార్యకర్తలు, యువతను రెచ్చగొడుతున్న చంద్రబాబు, పవన్, లోకేశ్‌ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు? రాజకీయాల్లో బాబు అంత నీతిమాలినోడు ఎవడూ ఉండరు. మేనిఫెస్టో పేరుతో 650 హామీలిచ్చి, ఏవీ అమలుచేయకుండా, చివరకు పార్టీ వెబ్‌సైట్‌ నుంచి ఆ మేనిఫెస్టోనే తొలగించిన చరిత్ర చంద్రబాబుది.

అదే సీఎం జగన్‌ ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్నారు. అదే బాబు, జగన్‌కి ఉన్న తేడా. ఇక సౌమ్యుడిగా పేరున్న, ఎప్పుడూ దీక్షలో ఉండే మంత్రి పెద్దిరెడ్డిపై చంద్రబాబు వ్యాఖ్యలు అత్యంత హేయం. ఆయన రోజురోజుకీ గతి తప్పి వ్యవహరిస్తున్నారు. అదే బాటలో ఆయన పుత్రుడు, దత్తపుత్రుడు నడుస్తున్నారు. అందుకే ప్రజలే ఆ ముగ్గుర్నీ 2024 ఎన్నికల్లో తరిమికొడతారు. 

Advertisement
Advertisement