బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నకిలీ హిందువులు | Sakshi
Sakshi News home page

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నకిలీ హిందువులు

Published Thu, Sep 16 2021 5:59 AM

Rahul Gandhi calls BJP-RSS Fake Hindus - Sakshi

సాక్షి , న్యూఢిల్లీ: హిందూ పారీ్టగా చెప్పుకొనే బీజేపీ, దేశంలో హిందుత్వాన్ని వాడుకుంటుందే తప్ప వారు ఎప్పటికీ హిందువులు కారని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌లు తమ ప్రయోజనాల కోసం మతాన్ని ఉపయోగించుకొనే నకిలీ హిందువులు అని ఆయన ఆరోపించారు. అంతేగాక ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నాయకులు మహిళా శక్తిని అణచివేసి, దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని రాహుల్‌ గాంధీ విమర్శించారు.  అయితే కాంగ్రెస్‌ మాత్రం మహిళా శక్తికి సమాన వేదికను ఇస్తుందని ఆయన తెలిపారు.

బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన అఖిల భారత మహిళా కాంగ్రెస్‌ 38వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న రాహుల్‌ మహిళా కాంగ్రెస్‌ నూతన లోగోను ఆవిష్కరించారు. ప్రధాని నరేంద్రమోదీ తన గదిలో కూర్చొని భయంతో వణికిపోతున్నందున సమాజంలోని ప్రతి విభాగంలోనూ భయాన్ని సృష్టించారని అన్నారు. చైనా అంశాన్ని ఉదహరించిన రాహుల్‌గాం«దీ, ఇటీవల చైనా వేల కిలోమీటర్ల భూమిని లాక్కుందని, అయితే నరేంద్ర మోదీ చైనాపై ఉన్న భయంతో అంతా బాగానే ఉందని చెప్పారని ఎద్దేవా చేశారు. ఇది ప్రధాని మోదీ భయానికి సంకేతమని రాహుల్‌ పేర్కొన్నారు. నరేంద్రమోదీ జీవితమంతా అబద్ధాలపై ఆధారపడి ఉన్నందునే ఆయన భయపడుతున్నారని రాహుల్‌ విమర్శించారు.  

ద్వేషంతో కాదు.. ప్రేమతో పోరాడుదాం
కాంగ్రెస్‌ సిద్ధాంతం.. బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకమని, రెండు సిద్ధాంతాలలో ఒకటి మాత్రమే దేశాన్ని పాలించగలదని అన్నారు.  బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు దేశవ్యాప్తంగా భయాన్ని వ్యాప్తి చేశారని, ప్రస్తుతం రైతులు, మహిళలు భయపడుతున్నారని పేర్కొన్నారు. దేశంలో జీఎస్టీని అమలు చేసినప్పుడే, చిన్న చిన్న దుకాణదారుల ఇంట్లో లక్ష్మీదేవిని బీజేపీ తీసేసిందని ఆయన మోదీ ప్రభుత్వాన్ని నిందించారు.  కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్‌టీఐని అమలు చేయడం ద్వారా దుర్గా శక్తిని కోట్లాది మంది ప్రజల చేతుల్లో అస్త్రంగా ఉంచామని రాహుల్‌ వ్యాఖ్యానించారు.

బీజేపీ నాయకులు తమను తాము హిందూ పార్టీ అని చెప్పుకుంటున్నప్పటికీ, దేశవ్యాప్తంగా లక్షి్మ, దుర్గలపై దాడి చేశారని దుయ్యబట్టారు. హిందూమతం పునాది అహింస. మహాత్మా గాంధీ తన జీవితమంతా హిందూ మతాన్ని అర్థం చేసుకోవడంలో గడిపితే, ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం ఆ హిందువు ఛాతిపై మూడు బుల్లెట్లను ఎందుకు కాల్చిందని రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. మనం వారిపై ప్రేమతో పోరాడాలి తప్ప ద్వేషంతో పోరాడలేమని కాంగ్రెస్‌ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్‌ వ్యాఖ్యానించారు.

మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌ దేశానికి ఒక మహిళా ప్రధానిని ఎప్పటికీ  ఇవ్వలేవని, కాంగ్రెస్‌ పార్టీ మహిళను ప్రధానిని చేసి చూపించిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటికీ ఎవరికీ భయపడదని రాహుల్‌ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నెట్టా డిసౌజా, ప్రధాన కార్యదర్శులు సీతక్క, సౌమ్యారెడ్డి, అప్సరా రెడ్డి, తెలంగాణ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతా రావు, ఆంధ్రప్రదేశ్‌ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ప్రమీలమ్మ సహా తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 200మంది కార్యకర్తలు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచి్చన సుమారు 2వేల మంది కార్యకర్తలు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement