Rahul Gandhi Speaks In Lok Sabha On No-Confidence Motion - Sakshi
Sakshi News home page

Rahul Gandhi: లోక్‌సభలో రాహుల్‌ ఘాటు ప్రసంగం.. ప్రధాని మోదీని రావణుడితో పోల్చుతూ విమర్శలు

Published Wed, Aug 9 2023 1:18 PM

Rahul Gandhi Speaks In Lok Sabha On No-Confidence Motion - Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభలో రెండో రోజు అవిశ్వాస తీర్మానంపై వాడీవేడీ చర్చ జరుగుతోంది. మణిపూర్‌ అంశంపై రాహుల్‌ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. ప్రధాని దృష్టిలో మణిపూర్‌ మన దేశంలో లేదని అన్నారు. మణిపూర్‌లో భారత మాతను చంపేశారని, మీరు దేశ భక్తులు కాదు.. దేశ ద్రోహులని రాహుల్‌ ధ్వజమెత్తారు. మీరు మణిపూర్‌ ప్రజల మనసులను గాయపరిచారని, ఈశాన్య రాష్ట్రాన్ని రెండు భాగాలుగా విభజించారని మండిపడ్డారు.

కాగా లోక్‌సభలో చర్చ ప్రారంభం కాగానే రాహుల్‌ ప్రసంగిస్తూ.. అదానీ గురించి మరోసారి ప్రస్తావించారు. నేడు అదానీ గురించి మాట్లాడనని, మీరు భయపడాల్సిన పనిలేదని బీజేపీపై సెటైర్లు వేశారు. గతంలో అదానీ గురించి మాట్లాడినప్పుడు ఓ పెద్ద నేతకు ఇబ్బంది అనిపించిందేమోన్నారు. తనది రాజకీయ ప్రసంగం కాదని, మణిపూర్‌ గురించి మాట్లాడతానని తెలిపారు. బీజేపీ నేతలు రిలాక్స్‌ అవ్వొచ్చు.. ఒకటి రెండు తూటాలు పేలుతాయి.. కానీ భయం వద్దు అంటూ చురకలంటించారు.
చదవండి: లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ.. సభ నుంచి వెళ్లిపోయిన రాహుల్‌ 

కన్యాకుమారినుంచి కశ్మీర్‌ వరకు యాత్ర చేపట్టానన్న రాహుల్‌.. పాదయాత్రలో ఎన్నో నేర్చుకున్నానని చెప్పారు. లక్షల మందితో తనతో కలిసి రావడంతో ధైర్యమొచ్చిందని, జోడో యాత్రలో ప్రజల సమస్యలను దగ్గరుండి చూశానని తెలిపారు. తన యాత్ర ఇంకా ముగియలేదు.. లద్ధాఖ్‌ వరకు వెళ్తానని చెప్పారు. యాత్రకు ముందు నాకు అహంకారం ఉండేదని.. యాత్ర తన అహంకారాన్ని అణచివేసిందన్నారు.

మణిపూర్‌ సహాయ శిబిరాల్లో బాధితులను కలిశానన్నారు రాహుల్‌. మహిళలు, పిల్లలతో మాట్లాడా.. వారి బాధను విన్నాని పేర్కొన్నారు. తల్లి కళ్లముందే కొడుకును కాల్చి చంపారని, ఆ తల్లి బాధను కళ్లారా చూశానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఈ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. 
చదవండి: శరద్‌ పవార్‌ అందుకే ప్రధాని కాలేకపోయారు: మోదీ సంచలన వ్యాఖ్యలు

ప్రధాని మోదీని రాహుల్‌ రావణుడితో పోలుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ అమిత్‌ షా, అదానీ మాటలే వింటారని అన్నారు. రావణుడు ఇద్దరి మాటలే(మేఘనాథుడు, కుంభకర్ణుడు) వింటాడని..మోదీ కూడా ఇద్దరి మాటలే వింటాడని వ్యాఖ్యానించారు. రావణుడి అహంకారమే నాడు లంకను కాల్చేసిందని అన్నారు.

రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాహుల్‌ ప్రసంగాన్ని అడుగడుగునా అడ్డుకున్న అధికార పక్షం అడ్డుపడింది. ఒక దశంలో రాహుల్‌ ప్రసంగానికి స్పీకర్‌ సైతం అడ్డుపడి అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ఎంపీ క్షమాపణలు చెప్పాలని అధికార పక్షం ఎంపీలు డిమాండ్‌ చేశారు.

ఇరుపక్షాల మాటలతో లోక్‌సభ దద్దరిల్లుతోంది. స్పీకర్‌ కల్పించుకొని ఇరుపార్టీల సభ్యులను వారిస్తున్నా మాటల యుద్ధం ఆగడం లేదు. ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసిన రాహుల్‌ సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. అటు నుంచి ఆయన రాజస్థాన్‌ వెళ్లనున్నారు. బన్స్వారా జిల్లాలోని మాన్‌గర్ ధామ్‌లో ఆదివాసీల ర్యాలీలో పాల్గొననున్నారు

Advertisement
Advertisement