Sakshi News home page

బుచ్చయ్యకు పొత్తు సెగ!

Published Fri, Dec 8 2023 5:14 AM

Rajahmundry Rural TDP MLA will be stubborn in the upcoming elections - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం: టీడీపీ, జనసేన పొత్తు సెగ టీడీపీ సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరికి తగిలిందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమండ్రి రూరల్‌ అసెంబ్లీ స్థానం జనసేనకు కేటాయించేందుకు ప్రయత్నాలు ముమ్మురంగా జరుగుతుండటంతో బుచ్చయ్యకు భంగపాటు తప్పదు అని చెబుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో  తనదైన ముద్ర వేసుకున్న బుచ్చయ్య.. టీడీపీలో చంద్రబాబు కంటే సీనియర్‌. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి మంత్రిగా పనిచేశారు. పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా క్రియాశీల పాత్ర పోషించారు. అలాంటి బుచ్చయ్యకు జనసేనతో పొత్తు వల్ల ఇప్పుడు సీటు దక్కే పరిస్థితి లేకుండా పోతోంది.

వచ్చే ఎన్నికల్లో బుచ్చయ్య స్థానంలో టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నేత కందుల దుర్గేష్‌ పోటీకి ఇరు పార్టీల అధినేతల నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై ఇప్పటికే బుచ్చయ్యకు స్పష్టత ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికి తోడు తానే అభ్యర్థినంటూ దుర్గేష్‌ కూడా ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు. తాను నమ్ముకున్న పా ర్టీయే తన సీటుకు ఎసరు పెడుతోందని తెలిసి బుచ్చయ్య ఆగ్రహంగా ఉన్నారని తెలిసింది. సీనియర్‌ నేతకు ఇలాంటి పరిస్థితి తీసుకురావడం పట్ల స్థానిక టీడీపీ కార్యకర్తలు, బుచ్చయ్య అభిమానులు అధిష్టానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చూపేందుకు సిద్ధమవుతున్నారు.  

లోక్‌సభ పేరుతో సాగనంపేందుకు.. 
పొమ్మనలేక పొగబెట్టే క్రమంలో రాజమండ్రి పార్లమెంట్‌ స్థానం నుంచి బరిలోకి దిగాలని బుచ్చయ్యకు టీడీపీ అధిష్టానం సూచించినట్లు తెలిసింది. తనకు ఇష్టం లేకపోవడంతో బుచ్చయ్య ససేమిరా అన్నట్లు సమాచారం. తాను రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగానే పోటీ చేస్తానని చెప్పినట్లు తెలిసింది. మరోపక్క రాజమండ్రి సిటీ స్థానం టికెట్‌ను సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి వాసుకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు ఇక్కడి జైల్లో ఉన్నపుడు ఆయన కుటుంబం రాజమండ్రిలోనే బస చేసింది.

అందుకు తగ్గ ఏర్పాట్లు చేసి వాసు అధిష్టానం దృష్టిలో పడ్డాడని దాంతో అతనికే టికెట్‌ ఇస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో బుచ్చయ్యకు సిటీ ఆశ కూడా అడియాసగా మారింది. పైగా చంద్రబాబు జైల్లో ఉన్నపుడు ఒక్కసారి కూడా బుచ్చయ్యకు ములాఖత్‌ అవకాశం ఇవ్వలేదు. అంతేగాక టీడీపీ, జనసేన నేతల ఉమ్మడి సమన్వయ కమిటీలో కూడా సీనియర్‌ నేత బుచ్చయ్యకు చోటు కల్పిం చలేదు. ఇలా అధిష్టానం బుచ్చయ్యను అవమానిస్తూ మానసిక క్షోభకు గురి చేస్తోందంటూ ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

What’s your opinion

Advertisement