చంద్రబాబు, లోకేశ్‌ దొంగలు  | Sakshi
Sakshi News home page

చంద్రబాబు, లోకేశ్‌ దొంగలు 

Published Sat, Jan 13 2024 5:46 AM

Rayapati Ranga Rao comments on tdp - Sakshi

సాక్షి ప్రతినిధి, గుంటూరు : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన కొడుకు లోకేశ్‌ దొంగలని, ఆ పార్టీ ఓ దిక్కుమాలిన పార్టీ అని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి రాయపాటి రంగారావు చెప్పారు. ఆయన శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేశ్‌ ధన దాహానికి తమ కుటుంబం సర్వనాశనం అయిపోయిందని తెలిపారు. చంద్రబాబు, లోకేశ్‌కు డబ్బే ముఖ్యమని, మరేమీ అవసరం లేదని అన్నారు. ఇక టీడీపీలో ఉండలేనని స్పష్టం చేశారు. పార్టీ కీ, పదవికి రాజీనామ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ఆ వెంటనే తన కార్యాలయంలో ఉన్న చంద్రబాబు ఫొటోను నేలకేసి కొట్టి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి  టీడీపీలో చేరిన తాము ఆ పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశామన్నారు. గత ఎన్నికలకు ముందు తమ నుంచి రూ. 150 కోట్లు తీసుకున్నారని తెలిపారు. లోకేశ్, చంద్రబాబునాయుడు ఎంతెంత తీసుకున్నారో తమ వద్ద లెక్కలున్నాయన్నారు. తండ్రి, కొడుకు ఒకరికి తెలియకుండా మరొకరు డబ్బులు తీసుకున్నారన్నారు. డబ్బులు తీసుకుని కూడా పోలవరం ప్రాజెక్టు విషయంలో తమను సర్వ నాశనం చేశారన్నారు.

చంద్రబాబు కమీషన్ల కోసం పోలవరాన్ని వాడుకున్నారని చెప్పారు. సోమవారం పోలవారం అని చంద్రబాబు చెప్పడం ఉత్త బోగస్‌ అని అన్నారు. చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరంపై సమీక్ష చేసింది కేవలం లంచాల కోసమేనని చెప్పారు. ప్రతి వారం డబ్బులు వసూలు చేశారని తెలిపారు. తమని హింసించి మరీ డబ్బులు వసూలు చేశారన్నారు. తమ ఆస్తులన్నీ బ్యాంకులో పెట్టుకున్నారని అన్నారు. డబ్బులు వాడుకుని మూడు సంవత్సరాల తర్వాత మమ్మల్ని ప్రాజెక్టు నుంచి తప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులు 75 శాతం పూర్తి చేసినట్లుగా చంద్రబాబు చెబుతున్నది పచ్చి అబద్ధమని స్పష్టం చేశారు.  

పేదల కోసం పని చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదల కోసం పనిచేస్తున్నారని రంగారావు చెప్పారు. కోవిడ్‌ సమయంలో ప్రజలు ఇబ్బంది పడకూడదని సీఎం జగన్‌ ఒక సంవత్సరం బడ్జెట్‌ మొత్తం ఖర్చు పెట్టారని చెప్పారు. ఆ రెండేళ్లు ఆంధ్రప్రదేశ్‌ జీడీపీ ఎక్కువగా ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌ వెబ్‌సైటే చెబుతోందని తెలిపారు. అదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. సీఎం జగన్‌ అందిస్తున్న సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయన్నారు. జగన్‌ అంటే తమకు ఇష్టమని, ఆయన సీటు ఇస్తే పోటీ చేస్తానని చెప్పారు. 

టీడీపీ ఫక్తు వ్యాపార సంస్థ 
తెలుగుదేశం రాజకీయ పార్టీ యే కాదని, ఫక్తు వ్యాపార సంస్థ అని ఆరోపించారు. ఆ పార్టీ ఉంది ప్రజల కోసం కాదని, కేవలం వాళ్లు బాగుపడటం కోసమేనని చెప్పారు. లక్ష ఉద్యోగాలు తెచ్చామని,  శ్రీసిటీ కట్టించామన్నారని, కియా కంపెనీ తెచ్చామని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. కియా కంపెనీ తెస్తే అనంతపురంలో ఎందుకు ఓడిపోయారని అన్నారు. లోకేశ్‌ రాయలసీమలో కాకుండా మంగళగిరి ఎందుకొచ్చాడని ప్రశ్నించారు.

లోకేశ్‌కు ధైర్యం ఉంటే రాయలసీమలో పోటీ చేయాలని సవాల్‌ చేశారు. మంగళగిరిలో లోకేశ్‌ను ఓడిస్తానని చెప్పారు. గతంలో మంగళగిరిలో కాండ్రు కమల, మురుగుడు హనుమంతరావులను తామే గెలిపించుకున్నామని అన్నారు. బాబు, లోకేశ్‌ గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కులచిచ్చు లేపుతున్నారని ఆరోపించారు. 

టీడీపీని నమ్ముకున్న వాళ్లంతా అప్పుల్లో ఉన్నారు 
తమ కుటుంబం 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉందని, ఎవరినీ మోసం చేయలేదని తెలిపారు. తాను సత్తెనపల్లి సీటు అడిగినా, కన్నా లక్ష్మీనారాయణను నియమించారన్నారు. కన్నా నియామకంతో 83 ఏళ్ల తమ తండ్రి  రాయపాటి సాంబశివరావు ఆవేదన చెందారన్నారు. 2014లో రాయపాటి సాంబశివరావు ఎంపీగా గెలిచాక కూడా టీడీపీలో అనేక అవమానాలు ఎదుర్కొన్నారని తెలిపారు. వినుకొండలో మంచినీటి పథకం తెస్తామని ఇచి్చన హామీని నిలబెట్టుకోవడానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును అడిగితే చినబాబును అడగాలని చెప్పారన్నారు.

ఇదేం పద్ధతని, లోకేశ్‌ ఏమైనా డైరెక్ట్‌ ఎలక్షన్‌లో గెలిచారా అని నిలదీశారు. తామే కాదని, పార్టీని నమ్ముకున్న అనేకమంది అప్పుల్లో ఉన్నారని తెలిపారు. చనిపోయిన వారికి ఇన్సూ్యరెన్స్‌ ఇస్తానని డబ్బులు వసూలు చేసిన లోకేశ్‌ ఎంతమందికి ఇచ్చారని నిలదీశారు. చంద్రబాబు జన్మభూమి కమిటీల పేరుతో రాష్ట్ర ప్రజలను దోచుకున్నారని ఆరోపించారు. రెండు, మూడు లక్షల కోట్లు  ఖర్చు చేశామన్నారని, ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement