టీడీపీలో హాహాకారాలు  | Sakshi
Sakshi News home page

టీడీపీలో హాహాకారాలు 

Published Thu, Apr 4 2024 4:44 AM

Rebellion of seniors against Chandrababu - Sakshi

చంద్రబాబుపై సీనియర్ల తిరుగుబాటు  

సీట్ల కేటాయింపులో విఫలమయ్యారని ఆవేదన 

బీసీ సాకుతో ఏలూరు సీటు యనమల అల్లుడికి ఇవ్వడంపై మాగంటి బాబు ఆగ్రహం 

నమ్మించి మోసం చేశారంటున్న కిమిడి నాగార్జున, బండారు సత్యనారాయణమూర్తి   

అనపర్తి బరిలో ఇండిపెండెంట్‌గా నల్లమిల్లి!.. కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రచారంలో వర్గపోరు  

ఆదోని, ఆలూరు, మంత్రాలయం, కోడుమూరు, నంద్యాల, డోన్‌ టీడీపీ ఇన్‌చార్జ్‌లకు దక్కని టికెట్లు 

మంత్రాలయం, కోడుమూరు, ఆదోనిలో చల్లారని నిరసన జ్వాలలు 

సాక్షి, అమరావతి/ఏలూరు (ఆర్‌ఆర్‌పేట)/ఆత్మకూరు రూరల్‌/అమలాపురం టౌన్‌/సాక్షి ప్రతినిధి, నెల్లూరు/సాక్షి ప్రతినిధి కర్నూలు: తెలుగుదేశం పార్టీలో ఆగ్రహ జ్వాలలు చల్లారడంలేదు. పొత్తులు, సమీకరణలు, ధన ప్రభావంతో సీట్లు గల్లంతైన సీనియర్‌ నేతలు చంద్రబాబు తీరుపై గతంలో ఎన్నడూ లేనివిధంగా దుమ్మెత్తిపోస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తుతున్నారు. ప్రతిజిల్లాలోనూ అసమ్మతి తీవ్రస్థాయిలో రాజుకోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు ముచ్చెమటలు పడుతున్నాయి. 30కిపైగా నియోజకవర్గాల్లో సీట్లు రాని నేతలు టీడీపీ అభ్యర్థులను ఓడిస్తామని ప్రకటించడంతో బాబు తల పట్టుకుంటున్నారు.

తాజాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సీనియర్‌ నేత, మాజీ ఎంపీ మాగంటి బాబు తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఏలూరు ఎంపీ సీటును యనమల రామకృష్ణుడి అల్లుడు మహేశ్ కు కేటాయించడాన్ని తప్పు బట్టారు. చాలాఏళ్లుగా తమ సామాజికవర్గానికి కేటాయించే సీటును బీసీకివ్వడం సరికాదని, ఈ సీటును బీసీలకు ఇవ్వాలని ఎవరడిగారని ఆయన మంగళవారం రాత్రి చంద్రబాబును కలిసినప్పుడు ప్రశ్నించారు. తమకు కనీసం చెప్పకుండా తమ సీటును మార్చడం అవమానించడమేనని నిలదీశారు. బీసీల్లో యనమల కుటుంబం తప్ప మరొకరు దొరకలేదా? ఎక్కడో కడప నుంచి అభ్యర్థిని తీసుకురావడమేమిటీ అంటూ మాగంటి సంధించిన వరుస ప్రశ్నలకు చంద్రబాబు వద్ద సమాధానం లేదని సమాచారం.

చంద్ర­బాబు ఎంత బుజ్జగించినా, ఎన్నికల తర్వాత రాజ్యసభ సీటు ఇస్తానని నమ్మబలికినా మాగంటి శాంతించలేదు. ఆయన తన దారి తాను చూసుకోవడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. చంద్రబాబును కలిసి బయటకు వచ్చిన వెంటనే బాబుపై నమ్మకం లేదని వ్యాఖ్యానించి కోపంగా వెళ్లిపోవడం దీనికి బలం చేకూరుస్తోంది. చంద్రబాబుతో చర్చలు ఆశాజనకంగా సాగలేదని పార్టీ శ్రేణులకు మాగంటి బాబు రాసినట్టు చెబుతున్న ఓ లేఖ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.  

కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని ఆదోని, ఆలూరు, మంత్రాలయం, కోడుమూరు, నంద్యాల, డోన్‌ నియోజకవర్గాల్లో టికెట్లు దక్కని టీడీపీ ఇన్‌చార్జులు అసమ్మతిబావుటా ఎగురేశారు.  ఆదోనిలో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న మీనాక్షినాయుడు సీటును బీజేపీకి కేటాయించడంపై మండిపడుతున్నారు. తానుగానీ, తన తనయుడుగానీ ఇండిపెండెంట్‌గా బరిలో దిగాలని యోచిస్తున్నారు. ఆలూరులో టీడీపీ ఇన్‌చార్జి కోట్ల సుజాతమ్మ పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. కుటుంబానికి ఒకే సీటు అంటూ తనను పక్కన పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

ప్రచారానికి దూరంగా ఉంటున్నారు.  మంత్రాలయంలో రాఘవేంద్ర, నందికొట్కూరులో గిత్త జయసూర్యకు టికెట్లు కేటాయించిన తర్వాత గెలుపు అవకాశాలు సన్నగిల్లాయని నివేదికలు అందడంతో ఈ సీట్లను మార్చే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. కోడుమూరులో ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి వర్గాల మధ్య టిక్కెట్‌ పంచాయతీ తెగలేదు. విష్ణు ప్రతిపాదించిన బొగ్గుల దస్తగిరి అభ్యర్థిత్వాన్ని కోట్ల వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

ఆకేపోగు ప్రభాకర్‌కు టిక్కెట్‌ ఇవాల్సిందేనని పట్టుబట్టినా అధిష్టానం స్పందించకపోవడంతో ప్రచారంలో పాలుపంచుకోవడం లేదు. డోన్‌ ఇన్‌చార్జ్‌ మన్నే సుబ్బారెడ్డిని కాదని కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వడంతో సుబ్బారెడ్డి సైలెంట్‌ అయ్యారు. ప్రచారంలో మాత్రం పాల్గొనడం లేదు. నంద్యాలలో భూమా బ్రహా్మనందరెడ్డి కూడా అభ్యర్థి ఫరూక్‌కు సహకరించడం లేదు.  

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పదేళ్లుగా పని చేస్తున్న కిమిడి నాగార్జునను కనీసం పరిగణన లోకి తీసుకోకుండా ఆ సీటును ఆయన బంధువు కళా వెంకట్రావుకు కేటాయించడంపై పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేస్తున్న తనను బాబు తన అవసరం కోసం రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఇప్పుడు కనీసం మాటమాత్రంగానైనా చెప్పకుండా పక్కకు తప్పించడంపై నాగార్జున కన్నీటి పర్యంతమయ్యారు.   

పెందుర్తి సీటును జనసేనకు కేటాయించడం, అక్కడ తన వ్యతిరేకి పంచకర్ల రమే‹Ùను ఆ పార్టీ నుంచి పోటీ చేయిస్తుండడాన్ని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి జీర్ణించుకోలేకపోతున్నారు.చంద్రబాబు తనను ఇంతలా మోసం చేస్తారని అనుకోలేదని ఆవేదన చెందు­తున్నారు.  కొన్నిరోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆయన ఇక రాజకీయాల నుంచి విరమిస్తానని నిర్వేదం వ్యక్తం చేయడంపై పార్టీ శ్రేణులు ఆవేదన చెందుతున్నాయి. 

అనపర్తి సీటును తొలిజాబితాలోనే తనకు కేటాయించి.. అంతలోనే మళ్లీ బీజేపీకి ఇవ్వడంపై మండిపడుతున్న మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. 

రాజంపేట సీటును పార్టీ శ్రేణులకూ తెలియని సుగవాసి సుబ్రహ్మణ్యంకి కేటాయించడంతో బత్యాల చెంగల్రాయుడు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. 

హజ్‌ కమిటీ రాష్ట్ర మాజీ చైర్మన్‌ మోమిన్‌ అహమ్మద్‌ హుసేన్‌ బుధవారం తెలుగుదేశం పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేశారు. త్వరలో వైఎస్సార్‌ సీపీలో చేరనున్నట్లు ఆయన కర్నూలు జిల్లా ఆత్మకూరులోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. 30 ఏళ్లుగా టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసిన హుసేన్‌ పలు కీలక పదవులలో సేవలందించారు. ఆయనతో పాటు టీడీపీ రాయలసీమ స్థాయి నాయకుడైన కుమారుడు మోమిన్‌ ముస్తఫా, స్థానిక మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్‌ అయిన మరో కుమారుడు ముఫ్తి కూడా టీడీపీకి రాజీనామా చేశారు.   

టీడీపీ కోవూరు నియోజకవర్గ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి  బుచ్చిరెడ్డిపాళెం మండలం పెనుబల్లిలో బుధవారం నిర్వహించిన ప్రచారంలో పార్టీలోని వర్గవిభేదాలు బయటపడ్డాయి. ప్రచార రథమెక్కేందుకు యత్నించిన వవ్వేరు బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ సూరా శ్రీనివాసులురెడ్డిని పోలంరెడ్డి దినేష్‌రెడ్డితో పాటు స్థానిక టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఆయన అనుచరులనూ మెడపట్టి తోసేశారు. మరొకరిని కాలితో తన్నడంతో కిందపడిపోయారు. దీంతో సూరాతోపాటు ఆయన అనుచరులు అవమానభారంతో వెనుదిరిగారు. సూరా ఇటీవలే టీడీపీలో చేరారు.

ఆయన చేరికను పార్టీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నారు. ప్రశాంతిరెడ్డి కూడా అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూరాకు హుకుం జారీ చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే ప్రశాంతిరెడ్డి ప్రచారానికి ప్రజల నుంచి స్పందన కరువైంది. దీంతో ఆమె అర్ధాంతరంగా ప్రచారాన్ని ఆపేసి వెనుదిరిగారు.   ళీ అనంతపురం అర్బన్‌ సీటును దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ అనే కొత్త వ్యక్తికి ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి వర్గం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.  

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి శెట్టిబత్తుల రాజబాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని  పార్టీ రాష్ట్ర కార్యాలయానికి, జిల్లా అధ్యక్షుడికి ఫ్యాక్స్, వాట్సాప్‌ల ద్వారా బుధవారం పంపించారు. పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడినా తనకు న్యాయం జరగలేదని, జనసేనకు పట్టు ఉన్న అమలాపురాన్ని టీడీపీ చేతిలో పెట్టడమేమిటని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే తన భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని వివరించారు. 

Advertisement
Advertisement