కేసీఆర్‌కు ఏటీఎంగా ధరణి  | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు ఏటీఎంగా ధరణి 

Published Sat, Aug 26 2023 2:07 AM

Revanth Reddy comments over kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గతంలో కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులు కేసీఆర్‌కు ఏటీఎంగా ఉండేవని, ఇప్పుడు ధరణి పోర్టల్‌ను ఆయన ఏటీఎంగా మార్చుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్‌ను కచ్చితంగా రద్దు చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు. మహబూబ్‌నగర్‌ నియోజకవర్గానికి చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్‌.పి. వెంకటేశ్‌తో పాటు పలువురు బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో రేవంత్‌ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహా్వనించారు.

అనంతరం మాట్లాడుతూ ధరణి పోర్టల్‌ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని దళిత, గిరిజనులకు చెందిన 35 లక్షల ఎకరాల భూములను కొల్లగొట్టారని, జిల్లా కలెక్టర్లను అడ్డుపెట్టుకుని భూములను అక్రమార్కులు దోచుకుంటున్నారని ఆరోపించారు. ధరణి పోర్టల్‌పై రాష్ట్రంలోని 12 వేల గ్రామాల్లో సభలు పెట్టేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధమా అని ప్రశ్నించారు.

‘ధరణిని రద్దు చేస్తే రైతుబీమా, రైతుబంధు ఎలా వస్తుందని కేసీఆర్‌ ప్రశ్నిస్తున్నారు. ధరణి పోర్టల్‌ అమల్లోకి వచ్చింది 2020లో అయితే, రైతుబంధు, బీమాలు 2018లోనే ప్రారంభమయ్యాయి. మరి అవి ఎలా వచ్చాయి’అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి కంటే మెరుగైన విధానాన్ని తీసుకువచ్చి రైతుల భూములకు రక్షణ కలి్పస్తామని, టైటిల్‌ గ్యారంటీ చట్టాన్ని అమలు చేస్తామని రేవంత్‌ హామీ ఇచ్చారు.  

ఉప్పు, నిప్పు అన్నారు 
ప్రగతిభవన్, రాజ్‌భవన్‌ మధ్య అగాధం ఉందన్నట్టుగా ఇన్నాళ్లూ కేసీఆర్‌ ప్రజలను నమ్మించారని, ఉప్పు, నిప్పు తరహాలో వ్యవహరించారని, ఎన్నికలు సమీపిస్తుండడంతో సీఎం, గవర్నర్‌లు రహస్యంగా మాట్లాడుకున్నారని రేవంత్‌ ఆరోపించారు.

ప్రజాసమస్యలపై ఆ ఇద్దరూ మాట్లాడుకుని ఉంటే అందరి ముందే మాట్లాడుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. మోదీ, కేసీఆర్, అసదుద్దీన్‌లు.. ముగ్గురూ తోడు దొంగలని, వారి రూపం వేరు కానీ మనసులు మాత్రం ఒక్కటేనని అన్నారు. బీఆర్‌ఎస్, ఎంఐఎంలకు ఓటేస్తే మోదీకి వేసినట్టేనని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement